మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం
ఈ దృశ్యం నేరుగా స్టేడియంలోని భారీ స్క్రీన్ పై ప్రదర్శితమైంది. బిగ్ స్క్రీన్‌పై అది కనిపించగానే మైదానంలో ఉన్న ర్యాన్ రికెల్టన్ దృష్టి కూడా దానిపై పడింది.
క్రికెట్ మైదానంలో ఆట ఎంత ఉత్కంఠభరితంగా సాగుతుందో.. స్టాండ్స్‌లో అభిమానుల హంగామా కూడా అంతే సందడిగా ఉంటుంది. అభిమానులు తమ ప్రియతమ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ప్లకార్డులు పట్టుకోవడం.. నినాదాలు చేయడం సహజమే. అయితే కొన్నిసార్లు ఈ అల్లరి హద్దులు దాటి ఆటగాళ్లను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుంటుంది. తాజాగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో అలాంటి వింతైన.. అసౌకర్యకరమైన ఘటనే ఒకటి వెలుగుచూసింది.
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్కు మైదానంలో ఊహించని వింత అనుభవం ఎదురైంది. మ్యాచ్ కొనసాగుతుండగా స్టాండ్స్‌లో కూర్చున్న ఒక అభిమాని చేతిలో పెద్ద ప్లకార్డు పట్టుకుని కెమెరాల దృష్టిని ఆకర్షించాడు. ఆ బోర్డుపై “ర్యాన్.. మీ అమ్మగారు సింగిలేనా?” అని రాసి ఉంది. అంతటితో ఆగకుండా సదరు అభిమాని కెమెరా వైపు చూస్తూ కన్నుకొడుతూ.. ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ విపరీతమైన అల్లరి చేశాడు.
ఈ దృశ్యం నేరుగా స్టేడియంలోని భారీ స్క్రీన్ పై ప్రదర్శితమైంది. బిగ్ స్క్రీన్‌పై అది కనిపించగానే మైదానంలో ఉన్న ర్యాన్ రికెల్టన్ దృష్టి కూడా దానిపై పడింది. ఆ ప్రశ్నకు, అభిమాని ప్రవర్తనకు రికెల్టన్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఏమీ అనలేక.. ఆ ఇబ్బందికర క్షణాన్ని భరిస్తూ అసంతృప్తిగా ముఖం తిప్పుకున్నారు. క్రీడాకారులు అభిమానుల నుంచి హుందాతనంతో కూడిన మద్దతును కోరుకుంటారు కానీ ఇలా కుటుంబ సభ్యులను లాగుతూ వ్యక్తిగత ప్రశ్నలు వేయడం ఎంతమాత్రం తగదని క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు దీన్ని కేవలం క్రీడా వినోదంలో భాగమని సరదాగా కొట్టిపారేస్తుంటే.. మరికొందరు మాత్రం ఆటగాళ్ల కుటుంబసభ్యులను, వారి వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి చౌకబారు కామెంట్లు చేయడం సరికాదని.. ఇది తీవ్రమైన హద్దుమీరడమేనని మండిపడుతున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మైదానంలో రెండు జట్ల మధ్య తీవ్ర స్థాయిలో పోరు కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా జట్టు 40 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఒకవైపు ఆటగాళ్లు ఆధిక్యం కోసం చెమటోడుస్తుంటే.. మరోవైపు స్టాండ్స్‌లో అభిమాని చేసిన ఈ విచిత్రమైన వ్యాఖ్య మ్యాచ్‌కు అదనపు చర్చనీయాంశంగా మారింది.
క్రీడాకారుల పట్ల గౌరవం, హుందాతనం ప్రదర్శించాల్సిన బాధ్యత అభిమానులపై ఎంతైనా ఉందనే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. మరి ఆ అల్లరి అభిమానిపై చర్యలు తీసుకున్నారా? రికల్టన్ దీనిపై ఫిర్యాదు చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.