డిజిటల్ ప్రచారాని దే పైచేయి!
ఏపీలో జరుగుతున్న కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో డిజిటల్ ప్రచారం అత్యంత కీలకంగా మారింది.
ఏపీలో జరుగుతున్న కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో డిజిటల్ ప్రచారం అత్యంత కీలకంగా మారింది. సరికొత్త ట్రెండ్‌గా దూసుకుపోతోంది. ప్రస్తుతం అభ్యర్థులు సాంప్రదాయ పద్ధతులతో (పాదయాత్రలు, మైక్ ప్రచారాలు) పాటు డిజిటల్ వేదికలను తమ ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో డిజిటల్ ప్రచారం సాగుతున్న తీరు భవిష్యత్తులో మరిన్ని కొత్త పంథాలకు దారి తీసేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ & షార్ట్స్: యువ ఓటర్లను, మొదటిసారి ఓటు వేసేవారిని ఆకట్టుకోవడానికి అభ్యర్థులు ఆకర్షణీయమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో కూడిన చిన్న వీడియోలు, రీల్స్‌ను విరివిగా వాడుతున్నారు. వీటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. త ద్వారా.. సుదీర్ఘ ప్రసంగాల స్థానంలో చిన్నపాటి రీల్స్ ప్రభావం చూపిస్తాయని అంచనా వేస్తున్నారు.
వాట్సాప్ ఆర్మీ: ప్రతి డివిజన్ లేదా వార్డు పరిధిలోని కాలనీలు, అపార్ట్‌మెంట్ లు, కుల/ప్రజా సంఘాల వారీగా ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేస్తున్నారు. అభ్యర్థి బయోడేటా, పార్టీ మేనిఫెస్టోను నేరుగా ఓటర్ల మొబైల్స్‌కు చేరవేస్తున్నారు. తద్వారా.. ఓటర్లు సునిశితంగా వారిని గుర్తించేందుకు, ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ఫేస్‌బుక్, యూట్యూబ్ లైవ్: ప్రచార పర్యటనలు, ముఖ్య నేతల ప్రసంగాలను ఎప్పటికప్పుడు లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఓటర్లకు చేరువవుతున్నారు. ఎక్కడ బహిరంగ సభ జరిగినా.. ప్రచారం జరిగినా.. సాధ్యమైనంత వరకు లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నారు. దీంతో అప్పటికప్పుడు ప్రజలకు చేరుకునేలా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజలకు నేరుగా చేరుతుండడం.. ఎక్కడున్నా వారు వినేలా ఉండడం గమనార్హం.
సాంప్రదాయ ప్రచారాలతో పోలిస్తే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ఓటర్లను ఒకేసారి చేరుకునే అవకాశం లభిస్తోంది. అంతేకాదు.. ఒకే ఒక్క క్లిక్‌తో వేలాది మంది ఓటర్ల మొబైల్ స్క్రీన్‌లపై అభ్యర్థి ముఖం, గుర్తు కనిపించేలా స్మార్ట్ ప్లానింగ్ చేస్తున్నారు. దీంతో మెజారిటీ పార్టీల అభ్యర్థులు సోషల్ మీడియాను నమ్ముకుంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మేయర్ అభ్యర్థులకు సంబంధించిన ఎన్నికల ప్రచారంలో డిజిటల్ ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా నిబంధనలను కఠినతరం చేసింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ మీడియాలో వచ్చే ప్రకటనల్లో అభ్యర్థి పేరు కానీ, ఫొటో కానీ ఉంటే ఆ ఖర్చును పూర్తిగా సదరు అభ్యర్థి ఎన్నికల వ్యయ ఖాతాలోనే జమ చేస్తారు. దీనివల్ల అభ్యర్థులు డిజిటల్ ప్రచార ఖర్చుల విషయంలో కూడా లెక్కలు చూసుకోవాల్సి వస్తోంది.
కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయలేని పరిస్థితి ఉంది. అలానే.. ఇంటిం టి ప్రచారానికి సమయం సరిపోని పరిస్థితులు ఎదురైనప్పుడు, అభ్యర్థులు వాయిస్ రికార్డింగ్‌లు, డిజిటల్ పోస్టర్లు, బల్క్ మెసేజ్‌ల ద్వారా ఓటర్ల దరిచేరుతున్నారు. ఫలితంగా తాము కోరుకున్న విధంగా ప్రజలకు ప్రచారాన్ని చేరువ చేసేందుకు అవకాశం ఉంటొంది.