యుద్ధానికి ముందే సమాధులు.. అమెరికా సైన్యం అసాధారణ కసరత్తు వెనుక అసలు కథ
యుద్ధరంగం అనగానే మనకు గుర్తొచ్చేవి శత్రువుపై కురిపించే బాంబులు.. యుద్ధ విమానాల మోతలు.. ఆధిపత్యం కోసం వేసే వ్యూహాలు.
యుద్ధరంగం అనగానే మనకు గుర్తొచ్చేవి శత్రువుపై కురిపించే బాంబులు.. యుద్ధ విమానాల మోతలు.. ఆధిపత్యం కోసం వేసే వ్యూహాలు. కానీ ఆ రణరంగం వెనుక దాగున్న అత్యంత విషాదకరమైన నిజాన్ని ప్రపంచం తరచూ మరచిపోతుంది. అదే.. తమ దేశం కోసం ప్రాణాలర్పించే పచ్చని సైనికుల భౌతికకాయాలు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరిన వేళ అమెరికా సైన్యం తీసుకున్న ఒక అసాధారణ.. గుండెలను పిండేసే నిర్ణయం మరో భారీ యుద్ధానికి అమెరికా సన్నద్ధమవుతుందన్న సంకేతాలను పంపుతోంది. ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళననూ పెంచుతోంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎంత విషాదాన్ని.. ఎన్ని కుటుంబాలను శోక సంద్రంలో ముంచిందో చూశాం.. యుద్ధంలో గెలుపోటములు కంటే ఇరువైపులా శవాల కుప్పలే ఎక్కువగా కనిపిస్తాయి. గెలిచినా.. ఓడినా.. కోల్పోయిన ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. చాలా శవాలను ఉక్రెయిన్, రష్యాలు కనీసం దహన సంస్కారాలకు నోచుకోకుండా వదిలేసిన దాఖలాలున్నాయి. అంతటి మహా విషాదం మరోసారి రాబోతోందా? అమెరికా సైనికులకు ఇస్తున్న ఈ సమాధుల తవ్వకాల శిక్షణ ప్రపంచానికి ఏం మెసేజ్ పంపుతున్నట్టు? మరో భారీ యుద్ధానికి ఇది సన్నాహకమా? అన్న ప్రశ్న అందరినీ వెంటాడుతోంది..
సుమారు ఏడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత అమెరికా సైన్యం 'సామూహిక సమాధుల' ఏర్పాటుపై తమ బలగాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. 1950-53 నాటి రక్తసిక్తమైన కొరియా యుద్ధం తర్వాత మళ్లీ ఇన్ని సంవత్సరాలకు అగ్రరాజ్యం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న తీవ్రత ఎంతటిదో ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది.
'ఆపరేషన్ డ్రాగన్ కోవెనెంట్ ఫేజ్-2' పేరుతో ఉత్తర కరోలినాలోని ఫోర్ట్ బ్రాగ్‌లో నిర్వహించిన ఈ శిక్షణ యుద్ధం తీసుకురాబోయే మానవ విషాదానికి నిలువుటద్దంలా నిలిచింది. రణరంగంలో ఒక్కసారిగా వందలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోతే.. వారి మృతదేహాలు కుళ్ళిపోకుండా ఎలా కాపాడాలి? తాత్కాలికంగా ఎక్కడ ఖననం చేయాలి? వారి గుర్తింపును కాపాడుతూ పరిస్థితులు అనుకూలించాక తిరిగి వారి కన్నతల్లులకు.. భార్యాపిల్లలకు ఎలా అప్పగించాలి? అనే అంశాలపై ఈ కసరత్తు సాగింది.
కేవలం 24 గంటల వ్యవధిలోనే 2,400 మంది సైనికుల మృతదేహాలను ఖననం చేసేలా భారీ యంత్రాలతో గోతులు తవ్వడం.. నమోదు ప్రక్రియలు పూర్తి చేయడం ఈ శిక్షణలో భాగం. తపనతో నిండిన ఒక సైనికుడి ఆఖరి శ్వాసను కూడా లెక్కల్లోకి తీసుకుంటూ.. కనీసం అతని భౌతికకాయానికి గౌరవప్రదమైన వీడ్కోలు పలకాలనే ఈ ప్రయత్నం ఒకవైపు సైన్యం బాధ్యతను చూపుతున్నా.. మరోవైపు భవిష్యత్తులో రాబోయే మహా ముప్పును ముందే సూచిస్తోంది.
ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మరో భారీ యుద్ధానికి సన్నాహకంగానే అమెరికా ఇలా చేస్తుందన్న వార్తాకథనాలు ఎంతగా కలవరపెడుతున్నా ఇది కేవలం ముందస్తు సన్నాహకం మాత్రమేనని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.
ఆయుధాల విన్యాసాల కంటే.. సైనికుల శవపేటికల నిర్వహణపై శిక్షణ ఇవ్వాల్సి రావడం ఆధునిక మానవాళికి ఒక హెచ్చరిక. విజయం ఎవరిదైనా.. యుద్ధం చివరకు మిగిల్చేది శోకాన్ని.. అనాథలైన కుటుంబాలను మాత్రమేనని ఈ పరిణామం మరొకసారి కళ్లకు కడుతోంది.