500 ఎకరాలు.. ₹50 వేల కోట్లు.. మియాపూర్ భూముల వెనుక సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త ప్లాన్

ఢిల్లీ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మియాపూర్ భూములను విక్రయిస్తే దాదాపు రూ.50,000 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని వెల్లడించారు.

Update: 2026-10-30 10:21 GMT

ఎన్నో ఏళ్లుగా నలిగిపోయిన వివాదాలకు తెరపడుతూ.. సుప్రీంకోర్టు తీర్పుతో హైదరాబాద్ మియాపూర్‌లోని 550 ఎకరాల విలువైన భూములు తిరిగి రాష్ట్ర ప్రభుత్వ చేతికి వచ్చాయి. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చనీయాంశమైన ఈ భూములపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత దార్శనికమైన, భావోద్వేగమైన ఆలోచనను పంచుకున్నారు. ఈ వేల కోట్ల ఆస్తి కేవలం ప్రభుత్వ ఖజానా నింపే సంపద కాదు.. తరతరాలుగా పేదరికంలో మగ్గుతున్న వేలాది కుటుంబాల భవిష్యత్తును మార్చే శక్తి అని ఆయన స్పష్టం చేశారు.

ఢిల్లీ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మియాపూర్ భూములను విక్రయిస్తే దాదాపు రూ.50,000 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే ఈ నిధులను కేవలం సంఖ్యల రూపంలో చూడకుండా తెలంగాణ సమాజంలోని చిట్టచివరి పేదవాడి బాగు కోసం 'పెట్టుబడి'గా మారుస్తామంటూ ఒక ఎమోషనల్ అప్పీల్ చేశారు.

పేద పిల్లల కళ్లలో వెలుగులు నింపేలా..

సమాజంలో ఎంతమంది విద్యార్థులు సరైన చదువు అందుకోలేక మెరుగైన అవకాశాలకు దూరమవుతున్నారు? ఈ ప్రశ్నకు పరిష్కారంగానే ఈ భూముల ద్వారా వచ్చే నిధులను ప్రధానంగా విద్యారంగానికి మళ్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద కుటుంబాల పిల్లలకు ప్రపంచస్థాయి నాణ్యమైన విద్యను అందించడమే ఈ సంకల్పం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఒక పేద బిడ్డ నాణ్యమైన చదువు పొందితే ఆ ఒక్క కుటుంబమే కాకుండా రాబోయే తరాల తలరాతే మారుతుందనేది ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆకాంక్ష.

అమ్మల కళ్లల్లో ఆనందం.. ఇందిరమ్మ ఇళ్ల కల నెరవేర్చే దిశగా..

సొంత ఇల్లు అనేది ప్రతి పేద కుటుంబానికి ఒక దశాబ్దాల నిరీక్షణ.. ఒక భావోద్వేగం. మియాపూర్ భూముల ద్వారా లభించే ఆదాయంతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ వారికి ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లను ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధించేలా ప్రోత్సహించడం.. వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రత్యేక పథకాలను బలోపేతం చేస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి.. ఎండిపోతున్న చేలకు నీరందించి రైతన్న మొహంలో నవ్వులు చూడటం ముఖ్యమన్నారు. ఒక ప్రాంతంలోని నిరుపయోగమైన భూమి విలువను, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పేదల, మహిళల, నిరుపేద విద్యార్థుల సంక్షేమానికి మళ్లించాలనే ఈ ఆలోచనను రేవంత్ చేశారు. .

క్యాబినెట్ భేటీ తర్వాతే తుది అడుగు

ఈ ఆలోచనకు రూపునిచ్చే ప్రక్రియలో ప్రభుత్వం చాలా పారదర్శకంగా అడుగులు వేస్తోంది. భూముల విక్రయం, నిధుల మళ్లింపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని.. రాబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే స్పష్టమైన విధానాన్ని ఖరారు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

కేవలం భూ వివాదంగా మిగిలిపోవాల్సిన ఒక అంశాన్ని తెలంగాణ భవిష్యత్తును నిర్మించే ఆశాకిరణంగా మార్చిన రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు.. రూ.50 వేల కోట్ల అంచనా ఏ మేరకు సాకారమవుతుంది, పేదల జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపుతుందో చూడాలంటే క్యాబినెట్ తుది నిర్ణయం వరకు వేచి చూడాల్సిందే..

Tags:    

Similar News