శత్రుదేశమైన పాకిస్తాన్ వెళ్లి.. 3 నెలలుగా బంధీగా భారతీయుడు.. ఏమైంది? ఎందుకు విడుదలవ్వట్లేదు..?

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన కుటుంబ పెద్ద అనుకోని కష్టాల్లో చిక్కుకుంటే ఆ ఇంట నిలిచే వేదన వర్ణనాతీతం

Update: 2026-10-30 07:34 GMT

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన కుటుంబ పెద్ద అనుకోని కష్టాల్లో చిక్కుకుంటే ఆ ఇంట నిలిచే వేదన వర్ణనాతీతం. ఆ వెళ్లేది పొరుగునే ఉన్న మన శత్రుదేశమైన పాకిస్థాన్ వంటి సున్నిత ప్రాంతం అయినప్పుడు ఆ కుటుంబం అనుభవించే ప్రతి క్షణం ఒక నరకప్రాయమే. ఆరు నెలల ఉద్యోగ ఒప్పందంతో పాకిస్థాన్‌కు వెళ్లిన ఒక భారతీయ మర్చంట్ నేవీ అధికారి.. కాంట్రాక్ట్ గడువు ముగిసినప్పటికీ స్వదేశానికి తిరిగి రాలేక గత మూడు నెలలుగా అక్కడే బంధీగా మిగిలిపోయారు.

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌కు చెందిన వినీత్ కిషోర్ మిశ్రా అనే మర్చంట్ నేవీ అధికారి ప్రస్తుతం కరాచీ పోర్టులో చిక్కుకుపోయారు. ఆరు నెలల కాంట్రాక్ట్ నిమిత్తం వెళ్లిన ఆయనకు గత ఆగస్టు నెలలోనే ఒప్పందం ముగిసింది. నిబంధనల ప్రకారం ఆయన వెంటనే భారత్‌కు తిరిగిరావాల్సి ఉన్నప్పటికీ పాకిస్థాన్ అధికారులు స్వదేశానికి వెళ్లేందుకు అనుమతి నిరాకరిస్తున్నారు. వినీత్‌తో పాటు మరో ఐదుగురు భారతీయులు.. ఆరుగురు ఇరాన్ దేశస్థులు కూడా ఇదే రీతిలో కరాచీ పోర్టులోనే ఉండిపోవాల్సి రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇస్లామాబాద్‌లోని భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లభించలేదు.

ఈ వ్యవహారంలో అత్యంత హృదయవిదారకమైన అంశం వినీత్ కుటుంబ పరిస్థితి. వినీత్ తండ్రి లలిత్ కిషోర్ మిశ్రా దేశరక్షణ కోసం సేవ చేసిన మాజీ ఆర్మీ అధికారి. నాటి పోరాట పటిమతోనే ఇప్పుడు తన కుమారుడి రక్షణ కోసం ఢిల్లీ వీధుల్లో ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖలకు వినతిపత్రాలు సమర్పించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక చొరవతో తన కుమారుడిని స్వదేశానికి రప్పించాలని కన్నీటితో విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడ మొబైల్ రీఛార్జ్ ఖర్చులు ఎక్కువగా ఉండటంతో కనీసం తండ్రితో ఎక్కువసేపు మాట్లాడే వీలు కూడా వినీత్‌కు లేకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

మరొకవైపు వినీత్ భార్య నేహా మిశ్రా ఇద్దరు చిన్న పిల్లలతో పడుతున్న ఆవేదన వర్ణించలేనిది. రెండున్నరేళ్ల కుమారుడు, పది నెలల పసిపాప తండ్రి ప్రేమకు దూరం కాగా.. 'నాన్న ఎప్పుడు వస్తాడు?' అని కుమారుడు అడిగే అమాయకపు ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆ తల్లి రోజిస్తోంది. భర్త భద్రతపై ప్రతి క్షణం భయపడుతూ కంటిమీద కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తోంది.

భారత్, పాకిస్థాన్‌ల మధ్య దౌత్య సంబంధాలు సున్నితంగా ఉన్న తరుణంలో ఈ వ్యవహారం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర విదేశాంగ శాఖ తక్షణమే స్పందించి.. దౌత్యపరమైన చర్చల ద్వారా కరాచీ పోర్టులో చిక్కుకున్న భారతీయులందరినీ సురక్షితంగా మాతృభూమికి చేర్చాలని.. ఆయా కుటుంబాల కన్నీళ్లను తుడవాలని ప్రవాస భారతీయులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News