యూరప్ తో వైరానికి పుతిన్ రెడీ అవుతున్నారా? ఆ హెచ్చరిక వెనుక ఏం జరిగింది?
యూరప్‌లోని కొన్ని దేశాలు 2030 నాటికి రష్యాతో యుద్ధానికి సిద్ధమవుతున్నాయనే చర్చలపై స్పందిస్తూ "యుద్ధానికి సిద్ధపడటం సరైన మార్గం కాదు..
అది ప్రశాంతంగా కనిపించే బాల్టిక్ సముద్రం. కానీ దాని నీటి అడుగున శత్రుత్వపు మంటలు రగులుతున్నాయి. ప్రపంచం ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంలో దాగిన అంతులేని శోకాల్ని.. ఆర్తనాదాల్ని కళ్లారా చూస్తోంది. అంతలోనే మనుషుల గుండెల్లో మరో తీవ్ర ప్రకంపన.. "మరో యుద్ధం రాబోతోందా?" అన్న భయంకరమైన సందేహం ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఆ సందేహాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నోటి వెంట వచ్చిన మాటలే కారణమయ్యాయి.
సమరానికి సై.. కానీ.. పుతిన్ గళంలో కఠినత్వం..
"మేం ఏ రోజూ యుద్ధాన్ని కోరుకోలేదు.. కానీ ఎవరైనా బలవంతంగా మమ్మల్ని యుద్ధంలోకి నెట్టాలని చూస్తే ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం" అని పుతిన్ నోటి వెంట వచ్చిన ఈ హెచ్చరిక యూరప్ దేశాల గుండెల్లో గుబులు రేపింది. ఉద్రిక్తతలు గనుక హద్దులు దాటితే ఆ తర్వాత వచ్చే విధ్వంసంలో విజేతలు అంటూ ఎవరూ మిగలరని.. కేవలం స్మశాన నిశ్శబ్దమే మిగులుతుందని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.
యూరప్‌లోని కొన్ని దేశాలు 2030 నాటికి రష్యాతో యుద్ధానికి సిద్ధమవుతున్నాయనే చర్చలపై స్పందిస్తూ "యుద్ధానికి సిద్ధపడటం సరైన మార్గం కాదు.. అయినా సరే మేము దేనికైనా సిద్ధమే" అంటూ రష్యా ఆత్మరక్షణ కవచం వెనుక ఉన్న కఠినమైన సైనిక వైఖరిని స్పష్టం చేశారు.
వివాదానికి అసలు కేంద్ర బిందువు.. బాల్టిక్ సముద్రం
ఈ హెచ్చరికల వెనుక ప్రధానంగా ఒక పెద్ద దౌత్య సముద్ర వివాదం దాగి ఉంది. ఉక్రెయిన్ దాడి నేపథ్యంలో రష్యా ఇంధన ఎగుమతులను, నౌకల రాకపోకలను కట్టడి చేసేందుకు పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా బాల్టిక్ సముద్రంలో రష్యా నౌకలపై నియంత్రణలు విధించేందుకు పాశ్చాత్య దేశాలు యత్నిస్తున్న వేళ పుతిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మధ్యప్రాచ్యంలో ప్రపంచాన్ని వణికించే హార్ముజ్ జలసంధి తరహా సంక్షోభ పరిస్థితులను బాల్టిక్ సముద్రంలోకి తెచ్చేందుకు యూరప్ ప్రయత్నిస్తోందా? అని ఆయన ప్రశ్నించారు. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో రష్యా నౌకల ప్రయాణానికి ఆటంకాలు సృష్టిస్తే దాని పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో పరోక్షంగా హెచ్చరించారు.
విద్వేషం మధ్యలో చిన్న ఆశల చినుకు.. దౌత్యానికి తలుపులు బహిరంగమే..
ఒకవైపు రక్తం మరిగేలా హెచ్చరికలు జారీ చేస్తూనే.. మరోవైపు దౌత్యపరమైన సంభాషణలకు కూడా రష్యా సిద్ధంగా ఉందనే సంకేతాన్ని పుతిన్ ఇచ్చారు. యూరప్ దేశాలతో తెగిపోయిన దౌత్య సంబంధాలను మళ్లీ పునరుద్ధరించేందుకు.. ముఖాముఖి చర్చలకు తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. ఇటీవల ఫిన్లాండ్, నార్వే దేశాల నాయకులతో జరిపిన సంభాషణలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. యుద్ధం అనేది తమ మొదటి ఎంపిక కాదని.. కానీ తమ సార్వభౌమాధికారాన్ని.. భద్రతను సవాలు చేస్తే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.
శాంతి కోసం కోట్లాది గుండెల ప్రార్థన
పుతిన్ వ్యాఖ్యల్లో దేనికైనా రెడీ అన్న ధీమా కనిపిస్తోంది. తమ జోలికి వస్తే ఉక్కుపాదం మోపుతామనే తీవ్ర హెచ్చరికతోపాటు.. ఇప్పటికైనా చర్చలకు ముందుకు వస్తే దౌత్య మార్గానికి సిద్ధమనే పిలుపు వినిపిస్తోంది..
నేడు లోకం ఇప్పటికే ఆకలి, ఆర్థిక మందగమనం, సరిహద్దుల కన్నీళ్లతో తల్లడిల్లిపోతోంది. మరో యుద్ధం వస్తే మనుషుల ఉనికికే ముప్పు వాటిల్లుతుంది. అహంకారాలు, రాజకీయ ప్రయోజనాలు పక్కనబెట్టి రష్యా, యూరప్ దేశాలు శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని.. తుపాకీ గొట్టాల కంటే చర్చల పట్టికలే సమస్యా పరిష్కారానికి ఏకైక మార్గమని ప్రపంచ మానవాళి ఆశిస్తోంది.