ప్రపంచంపైకి మరో వైరస్.. అప్రమత్తతే శ్రీరామరక్ష

ఆఫ్రికా ఖండంలోని డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ప్రస్తుతం దృశ్యాలు అత్యంత విషాదకరంగా మారాయి.

Update: 2026-10-30 05:23 GMT

కరోనా అనే మహమ్మారి తెచ్చిన ముళ్ల బాటల నుంచి తేరుకోకముందే.. మానవాళికి మరో భయంకరమైన సవాలు ఎదురవుతోంది. కోట్లాది కుటుంబాల్లో నింపిన శోకం.. ముఖానికి మాస్కులు.. అనుబంధాలకు దూరం చేసిన విషాద ఘట్టాలు ఇంకా మన కళ్లముందే కదులుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మరో రకమైన ప్రాణాంతక వైరస్ ప్రపంచాన్ని వణికించేందుకు సిద్ధమవుతోందన్న వార్త ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు రేపుతోంది.

కాంగోలో మరణ మృదంగం మోగిస్తోంది..

ఆఫ్రికా ఖండంలోని డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ప్రస్తుతం దృశ్యాలు అత్యంత విషాదకరంగా మారాయి. అక్కడ ఎబోలా వైరస్ రక్కసిలా విరుచుకుపడుతోంది. యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ఈసీడీసీ) గణాంకాల ప్రకారం.. అక్టోబర్ 26 నాటికే ఏకంగా 10,141 మంది ఈ వ్యాధి బారినపడగా.. ఆసుపత్రుల బెడ్లపై పోరాడుతూ 4,928 మంది అమాయకులు ప్రాణాలు విడిచారు. తమ కళ్లముందే బంధువులు.. ఆత్మీయులు రాలిపోతుంటే ఆఫ్రికా ప్రజలు పడుతున్న వేదన వర్ణనాతీతం. కాంగో సరిహద్దులు దాటి కెన్యా, నైజీరియా వంటి పొరుగు దేశాలకు కూడా ఈ ముప్పు పాకింది.

మళ్లీ లాక్‌డౌన్ చీకట్లు కమ్ముకుంటాయా?

ఎబోలా పేరు వినగానే మనకు కరోనా నాటి గడ్డు రోజులే గుర్తుకొస్తున్నాయి. అయితే వైద్య నిపుణులు చిన్న ఓదార్పునిస్తున్నారు. కరోనా వలె ఇది గాలి ద్వారా లేదా శ్వాసకోశ బిందువుల ద్వారా అంత వేగంగా వ్యాపించదు. బాధితుల రక్తం, శరీర ద్రవాల ప్రత్యక్ష స్పర్శ ద్వారా మాత్రమే సంక్రమిస్తుంది. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు.. చివరికి శరీరం నుండి రక్తం కారడం వంటి భయానక లక్షణాలు దీనిలో కనిపిస్తాయి.

ప్రస్తుతానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) ప్రపంచ దేశాలకు తక్షణ భారీ ముప్పు లేదని చెబుతున్నప్పటికీ ప్రయాణాల వల్ల ప్రమాదం ఎప్పుడైనా ముంచుకురావచ్చనే భయం అందరినీ వెంటాడుతోంది. ఐరోపా, బ్రిటన్ సహా పలు దేశాలు ఇప్పటికే తమ విమానాశ్రయాల్లో నిఘాను పెంచాయి.

మన అప్రమత్తతే మనకు రక్షణ

గతంలో మహమ్మారులు ఇచ్చిన చేదు అనుభవాలు మనకు నిలకడగా.. జాగ్రత్తగా ఉండటాన్ని నేర్పాయి. భయాందోళనలకు గురికాకుండా అధికారిక వర్గాల సమాచారాన్ని మాత్రమే నమ్మడం శ్రేయస్కరం. అంతర్జాతీయ సమాజం, వైద్య వ్యవస్థలు కలిసికట్టుగా పోరాడితేనే ఈ ముప్పును ఆదిలోనే అంతం చేయగలం. సమైక్యత, పరిశుభ్రత, ముందస్తు జాగ్రత్తలతో మాత్రమే మరో విపత్తు నుంచి ప్రపంచాన్ని మనం కాపాడుకోగలమని గుర్తుంచుకోవాలి.

Tags:    

Similar News