సుప్రీంకోర్టు అదిలిస్తే తప్ప క్యాన్సర్ మందుల ధరలు తగ్గించరన్న మాట.. భారీగా తగ్గిన ధరలు

క్యాన్సర్‌.. ఈ రెండు అక్షరాల పేరు వింటేనే బాధితులు.. వారి కుటుంబ సభ్యుల గుండెలు గుభేలుమంటాయి.

Update: 2026-10-29 06:35 GMT

క్యాన్సర్‌.. ఈ రెండు అక్షరాల పేరు వింటేనే బాధితులు.. వారి కుటుంబ సభ్యుల గుండెలు గుభేలుమంటాయి. ఒకవైపు శరీరంలో దాగిన ప్రాణాంతక వ్యాధితో క్షణక్షణం నరకయాతన అనుభవిస్తూ పోరాటం.. మరోవైపు కొండలా పేరుకుపోయే లక్షల రూపాయల వైద్య ఖర్చులు.. సంపాదించిన ఆస్తంతా కరిగిపోతున్నా.. బంధువుల ముందర చేయి చాచాల్సి వస్తున్నా.. 'ఎలాగైనా మన మనిషిని కాపాడుకోవాలి' అని తపించే సగటు కుటుంబాలకు క్యాన్సర్ మందుల ధరలు చుక్కలు చూపిస్తుంటాయి. చికిత్సలో వాడే ఖరీదైన ఇంజెక్షన్లు, మందులు కొనేందుకు పేద, మధ్యతరగతి రోగులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే అత్యవసర ఔషధాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం గట్టిగా హెచ్చరించిన తర్వాతే కేంద్రంలో కదలిక వచ్చింది. చివరకు పలు రకాల క్యాన్సర్ మందుల ధరలను భారీగా తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఊరటనిచ్చే కొత్త ధరల వివరాలు

నవంబర్ 9 నుంచి అమల్లోకి రానున్న సవరించిన ధరల ప్రకారం రోగులకు రూ. 4,000 నుండి రూ. 20,000 వరకు ఒక్కో మోతాదుపై ఆదా కానుంది. అజాక్టిన్ 100 ఎంజీ ధర గతంలో రూ.6,337 ఉంటే ఇప్పుడు రూ.1,495కే లభించనుంది. ఈ మందు విషయంలో రూ.4,842 మిగులు బాధితులకు ఊరటనిస్తోంది. ఇక బెవాసిజాబ్ 100 ఎంజీ/ 4 ఎంఎల్ గతంలో రూ.21,767 ఉన్న ధరను రూ.5,930కి తగ్గించారు. ఈ మందులో ఏకంగా రూ.15,837 ఆదా కానుంది. డెబ్రూమాబ్ 60 ఎంజీ గతంలో రూ.22,031 ఉన్న ఇంజెక్షన్ ఇప్పుడు రూ.5,941కే అందనుంది. ఈ మందుపై ఏకంగా రూ.16,090 లబ్ధి బాధితులకు కలుగనుంది.ఫుల్‌బ్రెకా ఔషధం రూ.26,072 నుంచి ఏకంగా రూ.5,491కి తగ్గింది. దీనిపై అత్యధికంగా రూ.20,581 మేర ఊరట లభించనుంది. రాత్రికి రాత్రే పదుల వేల రూపాయల వ్యత్యాసం రావడం బాధితులకు కొంత ఉపశమనం ఇచ్చినా.. ఈ పరిణామం వెనుక మరో నిష్టుర సత్యం దాగి ఉంది.

65 ఖరీదైన మందుల జోలికి వెళ్లని వైనం..

కోర్టు ఆగ్రహంతో కొన్ని మందుల ధరలు తగ్గినా అత్యంత కీలకమైన 65 హైకాస్ట్ మందుల ధరల్లో ఎలాంటి మార్పూ చేయలేదు. ఒకే సంస్థ ఉత్పత్తి చేసే లేదా సరఫరా పరిమితంగా ఉన్న ఈ ఖరీదైన ఔషధాలను కొనుగోలు చేయలేక ఇప్పటికీ ఎందరో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.

కోర్టు గురక పెడితేనే ప్రభుత్వ స్పందనా?

ఇక్కడే ప్రజల్లో తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. అత్యంత భయంకరమైన వ్యాధితో పోరాడుతున్న పౌరుల ఆక్రందనలు ప్రభుత్వాలకు ముందుగా ఎందుకు వినిపించవా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలంటితే తప్ప బాధితుల బాధలు పట్టవా? ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వాలు ముందే స్పందించి ఉంటే.. ఎంతోమంది పేదలు అప్పులపాలు కాకుండా రక్షింపబడేవారు కదా..

తగ్గించిన ధరలు క్షేత్రస్థాయిలో నవంబర్ 9 నుంచి ఖచ్చితంగా అమలయ్యేలా చూడటంతో పాటు మిగిలిన 65 ఖరీదైన మందుల ధరలను కూడా నియంత్రించి.. ప్రాణకాపలా మందులను అందరికీ అందుబాటులోకి తెచ్చినప్పుడే ఈ నిర్ణయానికి సార్థకత చేకూరుతుంది.

Tags:    

Similar News