దేవుడా.. ఆ దేశంలో హెచ్ఐవీ అత్యవసర పరిస్థితి!
హైదరాబాద్ మహానగర పరిధిలోని శేరిలింగంపల్లి.. కుత్భుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మొత్తం ఓటర్ల కంటే తక్కువగా ఆ దేశ జనాభా ఉంటారు.
హైదరాబాద్ మహానగర పరిధిలోని శేరిలింగంపల్లి.. కుత్భుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మొత్తం ఓటర్ల కంటే తక్కువగా ఆ దేశ జనాభా ఉంటారు. అలాంటి ఆ చిట్టి దేశంలో జాతీయ హెచ్ఐవీ అత్యవసర పరిస్థితిని విధిస్తూ అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం ఆ దేశంలో హెచ్ఐవీ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతుండటమే. ఇంతకూ ఆ దేశం పేరేమిటంటారా? అక్కడికే వస్తున్నాం. ఫిజి. పది లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న ఆ అందమైన దేశంలో ఇప్పుడు పరిస్థితులు అత్యంత దారుణంగా.. భయానకంగా మారాయి. తాజా లెక్కల ప్రకారం ఆ దేశంలోని ప్రతి 60 మంది పెద్దవారిలో ఒకరు హెచ్ఐవీతో జీవిస్తున్నట్లుగా గుర్తించారు.
ఎందుకు ఇలాంటి పరిస్థితి? దీనికి ఎవరు బాధ్యులు? ఇంతటి దారుణ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? లాంటి ప్రశ్నలకు సమాధానం వెతికితే.. షాకింగ్ నిజాలు వెలుగు చూస్తాయి. పసిఫిక్ మహాసముద్రం నడిబొడ్డున ఉండే ఈ అందమైన ద్వీప దేశానికి సరిహద్దున ఉన్న సంపన్న దేశాలే ఇప్పుడు శాపంగా మారాయి. ఆస్ట్రేలియాకు తూర్పున.. న్యూజిలాండ్ కు ఉత్తరంగా ఉంటే ఫిజీ మొత్తం 300లకు పైగా చిన్నచిన్న దీవుల సమూహం. మన దేశం నుంచి సదూరంలో ఉండే ఈ దేశానికి చేరాలంటే.. ఢిల్లీ.. ముంబయి నుంచి కనీసం 21 గంటల నుంచి 24 గంటల సమయం పడుతుంది. దీనికి కారణం నేరుగా విమానాలు లేకపోవటమే.
ఈ దేశం సంప్రదాయబద్ధమైనదిగా పేరుండేది. దీనికి తోడు క్లోజ్డ్ సొసైటీ గా చెబుతారు. అలాంటి దేశంలో హెచ్ఐవీ కేసులు ఇంత దారుణంగా పెరిగిపోవటానికి కారణం.. డ్రగ్స్ మాఫియా. ఈ దేశానికి సరిహద్దు దేశాలుగా ఉన్న ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ లలో భారీ డిమాండ్ ఉన్న డ్రగ్స్ ను చేరవేసేందుకు ఫిజీని ఒక సురక్షితమైన ట్రాన్సిట్ పాయింట్ గా మార్చుకున్నాయి మెక్సికన్.. అమెరికాకు చెందిన ముఠాలు.
ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ కు డ్రగ్స్ ను చేరేవేసేందుకు ఫిజీ ఒక సురక్షితమైన స్థావరంగా మారింది. అంతర్జాతీయ స్మగ్లర్లు ఫిజీలోని స్థానిక గ్యాంగ్ లకు.. డ్రగ్స్ సరఫరాకు సాయం చేసిన వారికి డబ్బుకు బదులుగా ఖరీదైన మెథాంపెటమైన్ డ్రగ్స్ ను ఇవ్వటం.. దానిని అమ్మేయటం ద్వారా డబ్బులు సంపాదించేవారు. దీంతో.. ఫిజీలో డ్రగ్స్ చాప కింద నీరులా చేరింది. ఈ దేశంలోని కల్చర్ డ్రగ్స్ వినియోగాన్ని ఒక అంటువ్యాధిగా మార్చేసింది.
ఫిజీలోని స్వదేశీ తెగల్లో ఒక అద్భుతమైన కల్చర్ ఉండేది. తమకు లభించింది ఏదైనా సరే.. కలిసి పంచుకు తినే అలవాటు వీరి సొంతం. ఆ దేశ సంప్రదాయ పానీయం ‘కావా’. దాన్ని సైతం ఒక పెద్ద గిన్నెలో వేసుకొని అందరూ తాగుతారు. బ్యాడ్ లక్ ఏమంటే.. ఆ దేశ యువత డ్రగ్స్ బారిన పడినప్పుడు.. ఇదే పద్దతిలో షేరింగ్ కల్చర్ లో వినియోగించేవారు. దీనికి తోడు ఖరీదైన డ్రగ్స్ ను కొనేందుకు డబ్బులు పూల్ చేసి కొనటం.. ఒకే ఇంజెక్షన్ సూదిని గ్రూప్ మొత్తం షేర్ చేసుకోవటం హెచ్ఐవీ కేసులు భారీగా నమోదు కావటానికి కారణాలుగా చెప్పాలి.
ఈ డ్రగ్స్ మహమ్మారి గడిచిన పదేళ్లలో నిశ్శబ్దంగా ఆ దేశం మొత్తాన్ని పాకేలా చేసింది. మొదట్లో ఫిజీ మీదుగా డ్రగ్స్ రవాణా మాత్రమే జరిగేది. డ్రగ్స్ వినియోగం తక్కువగా ఉండేది. అయితే కరోనా తర్వాత నుంచి అంతర్జాతీయ ముఠాలు ఈ దేశ స్థానికులకు డ్రగ్స్ ఇవ్వటం పెరిగింది. పట్టణ ప్రాంతాలే కాదు పల్లెల్లోనూ వీటి వినియోగం పెరిగింది. చివరకు ఎంతటి దారుణ పరిస్థితి అంటే.. తొమ్మిది.. పదేళ్ల పిల్లలు కూడా డ్రగ్స్ బారిన పడ్డారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. డ్రగ్స్ వినియోగనికి బ్లూటూత్ విధానాన్ని ఫాలో కావటం దారుణ పరిస్థితులకు తాజా హెచ్ఐవీ కేసుల విస్పోటనానికి కారణమైంది. బ్లూటూత్ విధానంలో..డ్రగ్స్ సేవించిన వ్యక్తి తనలోని రక్తాన్ని తీసి.. తమ గ్రూప్ లోని మరొకరు ఎక్కించుకోవటం. దీని వల్ల తమకు డ్రగ్స్ మత్తు మరింత తొందరగా ఎక్కుతుందన్న అపోహ. సాధారణంగా డ్రగ్స్ వినియోగించేవారు.. తమ రక్తం నుంచి నేరుగా మెదడులోకి వెళ్లి.. అక్కడి నరాల్ని ఉత్తేజితం చేస్తుంది. కానీ.. ఈ దేశంలో అపోహ ఏమంటే.. డ్రగ్స్ వినియోగించిన తర్వాత.. దాని మత్తు రక్తంలోకి చేరుతుందని.. ఆ రక్తాన్ని సిరంజి ద్వారా తీసుకొని.. ఇతరులు తమ ఒంట్లోకి ఎక్కించుకోవటంతో.. డ్రగ్స్ మత్తు తమకు బదిలీ అవుతుందని భావించటమే.
ఒకే సూదిని పలువురు వినియోగించటం.. కండోమ్ లేకుండా సెక్స్ చేయటం లాంటి అంశాలతో ఆ దేశంలో హెచ్ఐవీ కేసులు భారీగా నమోదై.. ఇప్పుడు ప్రమాదకర పరిస్థితికి చేరుకొని జాతీయ అత్యవసర పరిస్థితికి దారి తీసింది. బ్లూటూత్ పద్దతి భారీగా పెరగటానికి ఆ దేశంలోని కల్చర్ ఒక కారణమైతే.. డ్రగ్స్ కొనుగోలుకు డబ్బులు తగినంతగా లేకపోవటం.. ఆ దేశంలోని వైద్యవిధానాల్లో భాగంగా సిరంజిలను డాక్టర్ చిట్టీ లేకుండా మందుల షాపుల్లో ఇవ్వరు. దీంతో.. అతి కష్టంగా దొరికిన సిరంజిని.. సూదిని పలువురు వాడటం..ఒకరి ఒంట్లోని రక్తాన్ని మరొకరు ఇంజెక్టుచేసుకోవటంతో హెచ్ఐవీ కేసుల వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో పెరిగింది.దీనికి తోడు ఈ దేశంలో కండోమ్ వాడకాన్ని చాలా తప్పుగా చూస్తారు. ఇలాంటివన్నీ కలిసి ఆ దేశంలో హెచ్ఐవీ అత్యవసర పరిస్థితి ప్రకటించాల్సిన దుస్థితిలోకి జారిపోయింది. విదేశాల్ని తరచూ పర్యటించే వారు ఫిజీ దేశాన్ని పర్యటించాలన్న ప్లాన్ లో ఉంటే మాత్రం అత్యంత అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని మర్చిపోకూడదు.