అలారమ్ శబ్దాలు వద్దు.. 'లైట్ థెరపీ' ముద్దు: ఉదయాన్నే ప్రశాంతంగా లేవడానికి కొత్త ట్రెండ్స్!
అందుకే ఈ డిజిటల్ షాక్‌ల నుంచి తప్పించుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నేటి తరం ఎంచుకుంటుంది సరికొత్త 'నాచురల్ వెకప్' లైఫ్‌స్టైల్ చూసేద్దాం..
ఉదయాన్నే చెవులు చిల్లులు పడేలా మోగే అలారమ్ శబ్దాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని గ్రహించిన నేటి తరం.. మేల్కొనే విధానంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది. అనుకున్న సమయానికి లేవడానికి ఫోన్ బెడ్‌పైనే, అదీ చెవికి రెండు ఇంచుల దూరంలో అలారమ్ పెట్టుకుని పడుకోవడం మనలో చాలామందికి అలవాటు. కానీ, ఉదయాన్నే చెవి పక్కన బాంబు పేలినట్లు మోగే ఆ అలారమ్ శబ్దానికి ఉలిక్కిపడి లేవడం వల్ల గుండెపై తీవ్ర ప్రభావం పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారిగా ల్యాండ్‌మైన్ పేలినట్లు లేవడం వల్ల హార్ట్ రేట్, బీపీ పెరిగి ఒత్తిడి తీవ్రమవుతుంది. అందుకే ఈ డిజిటల్ షాక్‌ల నుంచి తప్పించుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నేటి తరం ఎంచుకుంటుంది సరికొత్త 'నాచురల్ వెకప్' లైఫ్‌స్టైల్ చూసేద్దాం..
బెడ్‌పై అలారమ్: గుండెకు ఉదయాన్నే పెద్ద షాక్:
గాఢ నిద్రలో ఉన్నప్పుడు హఠాత్తుగా పెద్ద శబ్దంతో అలారమ్ మోగడం అనేది మన శరీరానికి ఒక పెద్ద ఎమర్జెన్సీ సిగ్నల్ లాంటిది. ఉలిక్కిపడి లేవగానే శరీరంలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఒక్కసారిగా స్పైక్ అవుతుంది. దీనివల్ల ప్రశాంతంగా మొదలవ్వాల్సిన రోజు కాస్త తీవ్రమైన మానసిక ఆందోళనతో మొదలవుతుంది. ఇక క్రమంగా ఈ అలవాటు గుండె సంబంధిత సమస్యలకు, రక్తపోటుకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే లేవాల్సిన టైమ్‌కి అలారమ్ మోగాలి కానీ.. అది గుండెకు గుడ్‌బై చెప్పేలా ఉండకూడదు.
సూర్యోదయాన్ని తెచ్చే 'సన్‌రైజ్ అలారమ్స్':
గట్టి శబ్దాలతో భయపడి లేవడం కంటే, కాంతితో మేల్కొలిపే 'సన్‌రైజ్ అలారమ్స్' ఇప్పుడు ట్రెండింగ్‌గా మారాయి. ఇవి మీరు లేవాల్సిన సమయానికి కాస్త ముందు నుంచే గదిలో సూర్యోదయంలా వెలుగును మెల్లమెల్లగా పెంచుతాయి. ఇక కళ్లు మూసుకుని ఉన్నప్పటికీ, ఆ వెలుతురు కనురెప్పల ద్వారా మెదడును తాకి 'ఇది మేల్కొనే సమయం' అని సిగ్నల్ ఇస్తుంది. దీనివల్ల బాడీ ఎటువంటి షాక్ లేకుండా చాలా ప్రశాంతంగా, సహజమైన పద్ధతిలో నిద్ర నుంచి బయటకు వస్తుంది.
చెవులకు ఇంపుగా ప్రకృతి శబ్దాల మేల్కొలుపు:
ఒక్కసారిగా పెద్దగా మోగే అలారమ్స్‌కు బదులుగా 'క్రీసిండో' అలారమ్స్ వాడటం మంచిది. రింగ్‌టోన్‌గా పక్షుల కూతలు, ప్రవహించే నీటి శబ్దాలు లేదా తేలికపాటి సంగీతాన్ని పెట్టుకోవాలి. ఇక ఫోన్‌ను బెడ్‌పై ఉంచకుండా గదిలో కాస్త దూరంగా ఉంచడం వల్ల రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి.. అలారమ్ శబ్దం నేరుగా చెవిలో పడదు. రెండు.. ఆ అలారమ్ ఆపడానికి నడుచుకుంటూ వెళ్లాల్సి రావడం వల్ల నిద్ర మత్తు కూడా త్వరగా వదిలిపోతుంది.
ఉదయాన్నే లేవడం అనేది ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా ఉండాలి తప్ప, అదొక భయానకమైన సంఘటనలా మారకూడదు. ఫోన్‌ను పక్కలో పెట్టుకునే అలవాటును మానడం, బ్లూ లైట్‌కు దూరంగా ఉండటం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. నాచురల్ 'లైట్ థెరపీ' మరియు బాడీ క్లాక్‌ను రీసెట్ చేసుకునే అలవాట్లను అవలంబించడం ద్వారా నిద్రలేమి, గుండె జబ్బుల ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇక ఈ సరికొత్త హెల్తీ ట్రెండ్‌ను పాటించి ఉదయాన్నే ప్రశాంతంగా, హుషారుగా రోజును ప్రారంభించడమే అసలైన ఆరోగ్య రహస్యం.