1000 మందికి ఎంతమంది డాక్టర్లు? దేశంలోనే ఆ రాష్ట్రంలోనే అత్యధికం!
భారత్‌లో ప్రతి సంవత్సరం వైద్యుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటు.. ఎంబీబీఎస్ , పీజీ సీట్ల పెంపుతో వైద్య రంగానికి కొత్త కళ వచ్చింది.
భారత్‌లో ప్రతి సంవత్సరం వైద్యుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటు.. ఎంబీబీఎస్ , పీజీ సీట్ల పెంపుతో వైద్య రంగానికి కొత్త కళ వచ్చింది. అయితే పెరుగుతున్న డాక్టర్ల సంఖ్యకు అనుగుణంగా దేశంలో ప్రతి ఒక్కరికీ సమానంగా వైద్య సేవలు అందుతున్నాయా? అనే ప్రశ్న మాత్రం ఇప్పటికీ కీలకంగానే ఉండిపోయింది.
కేంద్ర ఆరోగ్య - కుటుంబ సంక్షేమ శాఖ 2026 ఫిబ్రవరిలో వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 13,88,185 మంది రిజిస్టర్డ్ అలోపతి వైద్యులు ఉన్నారు. వీరితో పాటు 7,51,768 మంది ఆయుష్ వైద్యులు కూడా నమోదై ఉన్నారు.
డాక్టర్-జనాభా నిష్పత్తి ఎంత?
మొత్తం నమోదైన అలోపతి , ఆయుష్ వైద్యులలో సుమారు 80 శాతం మంది ప్రస్తుతం క్రియాశీలకంగా సేవలందిస్తున్నారని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ లెక్కన దేశంలో డాక్టర్-పాపులేషన్ నిష్పత్తి 1:811గా ఉంది. అనగా సగటున ప్రతి 811 మందికి ఒక డాక్టర్ అందుబాటులో ఉన్నారు.
ప్రతి 1,000 మంది జనాభాకు దాదాపు 1.23 మంది డాక్టర్లు అందుబాటులో ఉన్నట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణం (1:1000) కంటే ఇది మెరుగ్గానే ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ గణాంకాల్లో ఆయుష్ వైద్యులను కలపడం.. అలాగే 80% మంది మాత్రమే అందుబాటులో ఉన్నారనే అంచనాను పరిగణనలోకి తీసుకోవడం గమనించాల్సిన విషయం.
ఏ రాష్ట్రంలో వైద్యుల లభ్యత ఎక్కువ?
రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం..2022 జూన్ నాటికి దేశంలోనే అత్యధికంగా రిజిస్టర్డ్ అలోపతి వైద్యులు ఉన్న పెద్ద రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్రలో 1,88,545, తమిళనాడులో 1,48,217, కర్ణాటకలో 1,34,426, ఆంధ్రప్రదేశ్ లో 1,05,799, కేరళలో 72,999 మంది ఉన్నారు. అయితే కేవలం మొత్తం వైద్యుల సంఖ్య ఆధారంగానే లభ్యతను చెప్పలేం. జనాభాను పరిగణనలోకి తీసుకుని పోల్చితే కేరళ రాష్ట్రంలో జనాభాతో పోలిస్తే డాక్టర్ల లభ్యత దేశంలోనే అత్యధికంగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నిలిచాయి. మహారాష్ట్ర, తమిళనాడులలో వైద్యుల సంఖ్య భారీగా ఉన్నప్పటికీ జనాభా ఎక్కువ కావడం వల్ల తలసరి లభ్యత నిష్పత్తి కొంత తక్కువగా కనిపిస్తుంది.
గ్రామీణ సవాళ్లు..నర్సింగ్ సిబ్బంది
దేశంలో నర్సింగ్ సిబ్బంది సంఖ్య 39.40 లక్షలుగా ఉంది. వీరిలో 80% మంది విధుల్లో ఉన్నారని భావిస్తే ప్రతి వెయ్యి మందికి 2.23 మంది నర్సులు లభిస్తున్నారు. ప్రతి ఏటా దాదాపు 3.82 లక్షల మంది నర్సింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు.
అయితే పట్టణ ప్రాంతాల్లో వైద్యుల సాంద్రత ఎక్కువగా ఉండి గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఖాళీ పోస్టులు, స్పెషలిస్టుల కొరత తీవ్రంగా వేధిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్.సీ), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పోస్టులను భర్తీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉందని.. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా తాము ఆర్థిక, సాంకేతిక సహకారం అందిస్తున్నామని కేంద్రం తెలిపింది. డాక్టర్లు ప్రతి మారుమూల ప్రాంతానికి అందుబాటులో ఉన్నప్పుడే ఈ గణాంకాలకు నిజమైన ప్రతిఫలం లభిస్తుంది.