జగన్ పులివెందులకు బాబు పవన్...అందుకేనా ?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత ఇలాకా పులివెందుల అన్నది తెలిసిందే. ఆయన తండ్రి కాలం నుంచి అక్కడ రాజకీయ కోటను నిర్మించుకుని వరసబెట్టి ప్రతీ ఎన్నికల్లోనూ గెలుస్తూ వస్తున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత ఇలాకా పులివెందుల అన్నది తెలిసిందే. ఆయన తండ్రి కాలం నుంచి అక్కడ రాజకీయ కోటను నిర్మించుకుని వరసబెట్టి ప్రతీ ఎన్నికల్లోనూ గెలుస్తూ వస్తున్నారు. అలాంటి పులివెందులకు ఇపుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలసికట్టుగా వస్తున్నారు. ఈ నెల 5న పులివెందులలో జరిగే అధికారిక కార్యక్రమాలలో వారు పాల్గొంటారు అని అంటున్నారు. దాంతో అక్టోబర్ 5న ఏపీ మొత్తం పులివెందుల వైపు చూసే అవకాశం ఉంది. అలా ఓవర్ టూ పులివెందులగా ఆ రోజు కొన్ని గంటల పాటు మీడియా మొత్తం ఫోకస్ చేయనుంది.
రాజకీయంగా చర్చ :
నిజానికి అధికార పార్టీ పెద్దలు ఎక్కడికి అయినా వెళ్లవచ్చు. అయితే ప్రత్యేకించి కొన్ని ప్రాంతాలకు వెళ్ళినపుడు అక్కడ పొలిటికల్ వైబ్రేషన్స్ వేరేగా ఉంటాయి. అందుకే అంతటి చర్చకు ఆస్కారం ఏర్పడుతుంది. విషాయానికి వస్తే అక్టోబర్ 5వ తేదీన వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో బబు పవన్ పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో బాబు పవన్ కలిసి పర్యటించనుండటం ఇదే మొదటిసారి కావడంతో ఈ విషయం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అధికారిక కార్యక్రమాల్లోనే వారు పాల్గొంటారు అని అంటున్నారు.
అభివృద్ధికి శ్రీకారం :
ఇక పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం పార్నపల్లె సమీపంలో సుమారు 480 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన భారీ తాగునీటి ప్రాజెక్టు జల్ జీవన్ మిషన్ అమరజీవి జలధారని చంద్రబాబు పవన్ కలిసి ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా ఏడు మండలాల్లోని సుమారు 5.5 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందనుంది. అదే విధంగా పులివెందుల పరిధిలోని అర్హులైన పేద ప్రజలకు శాశ్వత ఇళ్ల పట్టాలను ఈ ఇద్దరు నేతలు పంపిణీ చేయనున్నారు. పులివెందుల నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు మౌలిక వసతుల పనులకు సైతం శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ఈ పర్యటనలో భాగంగా కూటమి ప్రభుత్వం తరఫున ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహించేందుకు అధికారులు స్థానిక కూటమి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ సభలో బాబు పవన్ ఏమి మాట్లాడుతారు అన్నదే ఉత్కంఠను రేపుతోంది.
స్థానిక ఎమ్మెల్యేగా :
జగన్ మూడు సార్లు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే ఒకసారి ముఖ్యమంత్రిగా రెండు సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. గతంలో విపక్ష నేతగా అసెంబ్లీకి హాజరైన జగన్ ఈసారి మాత్రం అసలు వెళ్లడం లేదు, దాంతో స్థానిక ఎమ్మెల్యేగా జగన్ గురించి కూటమి పెద్దలు ఏమి మాట్లాడుతారు అన్నది కూడా చర్చగా ఉంది. అసెంబ్లీకి స్థానిక ఎమ్మెల్యే రావడం లేదన్న అంశం ప్రస్తావిస్తే కనుక అది రాజకీయంగా కాక పుట్టించే చాన్స్ ఉంది. నిజానికి ఎమ్మెల్యేగా పులివెందుల అభివృద్ధి విషయంలో జగన్ ఏమి చేశారు, కూటమి ప్రభుత్వం ఏమి చేసింది అన్నది కూడా ఈ ఇద్దరు నేతలు వివరించే చాన్స్ ఉంది. మొత్తానికి బాబు జగన్ కలిసి పులివెందుల రావడం అన్నది రాజకీయంగా చర్చకు తావు ఇస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పులివెందుల మున్సిపాలిటీ, అలాగే జెడ్పీటీసీలు ఎంపీపీలు కూడా గెలుచుకోవాలని కూటమి పక్కగా టార్గెట్ చేస్తోంది.