రేవంత్ ‘నల్లమల పులి’ కాదని, చంద్రబాబు వద్ద ‘పిల్లి’

హైదరాబాద్‌లో తనకు హోటళ్ల వ్యాపారం ఉందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Update: 2026-10-01 13:17 GMT

హైదరాబాద్‌లో తనకు హోటళ్ల వ్యాపారం ఉందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనకు హోటల్ వ్యాపారం ఉందన్న విషయం కొత్తగా బయటపడినది కాదని.. 2009 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లోనే తాను ఆ వివరాలను స్పష్టంగా వెల్లడించానని తెలిపారు.

తన అఫిడవిట్‌లోని విషయాన్నే ఇప్పుడు కొత్తగా కనుగొన్నట్లు రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. "నేను 2009లోనే ఈ విషయాలు చెప్పాను. కొలంబస్ లేదా వాస్కోడిగామా లాగా రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్తగా కనుగొన్నదేంటి?" అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 1999లో ఒక హోటల్‌తో ప్రారంభమైన తమ వ్యాపారం, క్రమంగా విస్తరించి ప్రస్తుతం నగరంలో మూడు హోటళ్లు ఉన్నాయని వివరించారు. చట్టబద్ధంగా వ్యాపారం చేయడం నేరమా అని ఆయన ప్రశ్నించారు.

సిరిసిల్ల పర్యటనపై తీవ్ర విమర్శలు

ఇటీవల సిరిసిల్లను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి శైలిపై కేటీఆర్ మండిపడ్డారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేతన్నల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందిస్తారని ఆశించామని కానీ పర్యటన మొత్తం తమపై బురద చల్లడానికే పరిమితమైందని ఆరోపించారు. కేవలం రాజకీయ విమర్శలు చేయడానికే అయితే హైదరాబాద్‌లోనే సమావేశం పెట్టుకోవచ్చని సిరిసిల్లకు రావడం ఎందుకని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి తనను తాను ‘నల్లమల పులి’గా అభివర్ణించుకోవడాన్ని కేటీఆర్ ఎద్దేవా చేశారు. నిజంగానే పులి అయితే 4 వేల మంది పోలీసుల భద్రత, ఆరుగురు మంత్రులు, పీసీసీ అధ్యక్షుడి తోడు లేకుండా సిరిసిల్లకు వెళ్లలేకపోయారా అని నిలదీశారు. రేవంత్ ‘నల్లమల పులి’ కాదని, చంద్రబాబు వద్ద ‘పిల్లి’ లాంటి వారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ ఆరోపణలపై సవాల్

కాళేశ్వరం ప్రాజెక్టు, ఫార్ములా-ఈ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాల్లో బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించినా ఏమీ సాధించలేకపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ నిర్మించిన నూతన సచివాలయాన్ని 'రాజమహల్' అని.. ప్రగతి భవన్‌లో 150 బెడ్‌రూమ్‌లు, బంగారు బాత్‌రూమ్‌లు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది కాబట్టి ఆ ఆరోపణలను నిరూపించి చూపాలని ఆయన సవాల్ విసిరారు.

హోటల్ వ్యాపారం వివరాల నుంచి సిరిసిల్ల పర్యటన వరకు కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం రానున్న రోజుల్లో మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News