'రాజ‌మండ్రి సిటీ' రాజ‌కీయం మంచి హాటే... !

మ‌రోవైపు త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న‌ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వ్య‌వ‌హారం కూడా కీల‌కంగా మారింది.

Update: 2026-10-01 11:30 GMT

రాజమండ్రి సిటీ (రాజమహేంద్రవరం అర్బన్) నియోజకవర్గ రాజకీయం ప్రస్తుతం అధికార కూటమి ఆధిపత్యంతో స్థిరంగా సాగుతున్నా.. వైసీపీ నేత‌, మాజీ ఎంపీ భ‌ర‌త్ కూడా అదే రేంజ్‌లో పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం.. టీడీపీకి బలమైన కంచుకోట. కూటమి బలం విష‌యానికి వ‌స్తే.. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు): 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అదే ఎన్నిక‌ల్లో ఎంపీ నుంచి ఎమ్మెల్యే స్థాయికి దిగి పోటీ చేసిన మార్గాని భరత్ రామ్ 71,404 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు.

ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రస్తుతం నియోజకవర్గంలో ‘మన వార్డులో – మన ఆదిరెడ్డి’ అనే వినూత్న కార్యక్రమంతో నిరంతరం ప్రజల్లో ఉంటూ, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. నాయ‌కుల‌ను క‌లుసుకుంటు న్నారు. కూటమిని స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక‌, రాజ‌మండ్రి ఎంపీ పురందేశ్వరి ప్రభావం కూడా నియోజ‌క‌వ‌ర్గంపై బాగానే ఉంద‌ని అంటున్నారు. రాజమండ్రి లోక్‌సభ స్థానం నుండి బీజేపీ తరపున గెలిచిన దగ్గుబాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

అభివృద్ధి పనుల విష‌యానికి వ‌స్తే.. 2027లో రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గం లో ఘాట్ల ఆధునీకరణ, ఇతర మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నిధుల కేటాయింపు కూడా ముమ్మ‌రంగానే సాగుతోంది. నగరంలో దాదాపు రూ. 350 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు, ఇటీవల ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ అదనపు భవనాలకు నిధులు కేటాయించారు. ఇవ‌న్నీ.. ఎమ్మెల్యే వాసు నేతృత్వంలోనే జ‌రుగుతున్నాయ‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు.

మ‌రోవైపు త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న‌ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వ్య‌వ‌హారం కూడా కీల‌కంగా మారింది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల చుట్టూ టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేసి "గ్రేటర్ రాజమండ్రి" ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై హైకోర్టులో ఉన్న వివాదాల కారణంగా గత కొంతకాలంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీనిపై తుది తీర్పు కోసం రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి.

అంతర్గత రాజకీయ సమీకరణాల విష‌యానికి వ‌స్తే.. మేయర్ సీటు కోసం పోటీ నెల‌కొంది. ఈ సీటును దక్కించుకు నేందుకు కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, బీజేపీల మధ్య అంతర్గత చర్చలు కొన‌సాగుతున్నాయి. ఒక ర‌కంగా చెప్పాలంటే.. పోటీ గట్టిగా నడుస్తున్నాయి. మరోవైపు జనసేన స్థానిక శ్రేణుల్లో కొంత సమన్వయ లోపం చర్చనీ యాంశంగా మారింది. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ ఎంపీ/ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ, కూటమి వేవ్‌తో పాటు ఆదిరెడ్డి కుటుంబానికి ఉన్న స్థానిక పట్టు ముందు ప్రస్తుతం ప్రతిపక్షం డిఫెన్స్‌లో పడిందని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Tags:    

Similar News