కంప్యూటర్ కట్టే ఇళ్లు.. మహేశ్ బాబు సొంతూరిలో కూటమి కొత్త ప్రయోగం
సాంప్రదాయ పద్ధతిలో ఇళ్ల నిర్మాణానికి ఇటుకలు, సిమెంట్, ఎక్కువ సమయం, కూలీల శ్రమ అవసరమవుతాయి.
తక్కువ ఖర్చుతో పేదల సొంత ఇంటి కల నెరవేర్చాలని కూటమి ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. డబ్బు ఆదా చేయడంతోపాటు తక్కువ సమయంలో వాతావరణ ప్రతికూలతల నుంచి రక్షణ పొందేలా సరికొత్త ఇళ్ల నిర్మాణానికి డిజైన్ చేసింది. ఆధునిక టెక్నాలజీ అయిన 3డి టెక్నాలజీ నమూనాలో గృహాలు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కేంద్ర మంత్రి పెమ్మసాని సొంత ఊరు అయిన బుర్రిపాలెంను ఎంపిక చేశారు. పైలెట్ ప్రాజెక్టుగా బుర్రిపాలెంలో 3డీ ప్రింటెడ్ ఇళ్లను నిర్మించి అక్కడి ప్రజల స్పందన ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించారని అంటున్నారు.
బుర్రిపాలెం విశేషం
పేద ప్రజలందరికీ తక్కువ ఖర్చుతో అత్యుత్తమ నాణ్యత గల ఇళ్లను అందించే లక్ష్యంతో సరికొత్త 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తేవాలపి తీసుకున్న నిర్ణయం ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ఎంపిక చేసిన బుర్రిపాలెం మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెం గ్రామం దిగ్గజ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ సొంత ఊరు కావడంతో దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక ఇదే గ్రామానికి చెందిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. గుంటూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ప్రాధాన్యం ఉన్న బుర్రిపాలెంలో అధునాతన నూతన సాంకేతికతతో కూడిన గృహ నిర్మాణ ప్రాజెక్ట్ కు ఎంపిక చేయడం మరింత ప్రాధాన్యం సంతరించుకుందని అంటున్నారు.
ప్రత్యేకతలు ఇవే..
సాంప్రదాయ పద్ధతిలో ఇళ్ల నిర్మాణానికి ఇటుకలు, సిమెంట్, ఎక్కువ సమయం, కూలీల శ్రమ అవసరమవుతాయి. కానీ ఈ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీలో డిజిటల్ కంప్యూటర్ డిజైన్ల సహాయంతో అత్యాధునిక ఆటోమేటెడ్ యంత్రాల ద్వారా గోడలు పొరలవారీగా నిర్మిస్తారని చెబుతున్నారు. ఈ విధానం ద్వారా అతి తక్కువ కాలంలోనే, అంటే దాదాపు రెండు నెలల వ్యవధిలోనే గృహ నిర్మాణం పూర్తవుతుందని అంటున్నారు. ప్రస్తుతం గృహ నిర్మాణానికి నైపుణ్యం ఉన్న కార్మికులు కొరత ఉండగా, ఇప్పడు ఆ సమస్యను తేలిగ్గా అధిగమించే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
3డీ ప్రింటెడ్ ఇళ్లలో మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. ఇవి సహజమైన ఉష్ణోగ్రత నియంత్రణ కలిగి ఉంటాయని చెబుతున్నారు. బయటి వాతావరణంతో పోలిస్తే ఇంటి లోపల చల్లగా ఉండేలా నిర్మాణాలు సహకరిస్తాయి. ఉత్తరాఖండ్‌లో ఈ మోడల్‌ను విజయవంతంగా పరీక్షించిన తర్వాత, ఇప్పుడు రాష్ట్రంలో అమలులోకి తెస్తున్నారు. బుర్రిపాలెంలో చేపట్టబోయే ఈ పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా వేలాది గ్రామీణ ప్రాంతాలకు ఈ టెక్నాలజీని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ పథకం కింద చేపట్టనున్న ఈ 100 గృహాల నిర్మాణానికి సంబంధించి అక్టోబర్ 4న ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.