హెచ్-1బీ వీసా చీకటి కోణం.. 'అమెరికా డ్రీమ్' వెనుక ఐటీ నిపుణుల మూగవేదన

అమెరికాలో ఉద్యోగం.. చేతినిండా డాలర్లు.. గౌరవప్రదమైన జీవితం.. భారతదేశంలో ఉన్న ప్రతీ ఐటీ నిపుణుడి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది.

Update: 2026-10-01 09:57 GMT

అమెరికాలో ఉద్యోగం.. చేతినిండా డాలర్లు.. గౌరవప్రదమైన జీవితం.. భారతదేశంలో ఉన్న ప్రతీ ఐటీ నిపుణుడి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈ కలను నిజం చేసుకునేందుకు 'హెచ్-1బీ వీసా' సాధించి అట్లాంటిక్ మహాసముద్రం దాటి అగ్రరాజ్యంలో అడుగుపెడతారు. కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక దాగున్న చేదు నిజాలు, విదేశీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న మానసిక నరకం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే భారతీయులు, ఎన్నారైలపై విద్వేష వీడియోలు చేస్తూ అమెరికాలో పాపులర్ అయిన ఒక ప్రముఖ యూట్యూబర్ సారా గొంజాలెజ్ ఈ అంశంపై చేసిన సంచలన వీడియో, సోషల్ మీడియాలో దాగి ఉన్న నిజాన్ని భగ్గుమనిపించింది.

కలల దేశంలో శ్రమ దోపిడీ..

అమెరికా ఐటీ రంగంలో హెచ్-1బీ ఉద్యోగులను కొందరు మధ్యవర్తులు, బాడీ షాపింగ్ కన్సల్టెన్సీలు, నిర్దాక్షిణ్యమైన యజమానులు ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో ఈ ఆరోపణలు స్పష్టం చేస్తున్నాయి. అభ్యర్థులు హెచ్1బీ కోసం.. అమెరికాలో ఉండేందుకు అక్కడ జీవించేందుకు కాంప్రమైజ్ అయ్యే ఉద్యోగుల సమస్యలు ఆ యూట్యూబర్ బయటపెట్టింది. అర్హతకు తగ్గ వేతనాలు చెల్లించకపోవడం.. ప్రాజెక్టులు లేవనే నెపంతో నెలల తరబడి జీతాలు ఎగొట్టడం, కనీసం ఉద్యోగం మారేందుకు ప్రయత్నిస్తే వీసా రద్దు చేస్తామని బెదిరించడం వంటి ఘోరాలు జరుగుతున్నాయని ఆమె విమర్శలు చేసింది. కొందరు యజమానులు ఉద్యోగుల వ్యక్తిగత పత్రాలు, గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ కాగితాలను తమ వద్దే ఉంచుకుని బాండెడ్ లేబర్‌లా వాడుకుంటున్నారనే వార్తలు గుండెలను పిండేస్తున్నాయి.

వీసా బంధీలు.. ప్రశ్నించలేని బలహీనత

ఇక్కడ అసలు సమస్య అమెరికన్ల ఉద్యోగాలు పోతున్నాయా లేదా అనేదానికంటే విదేశాల నుంచి వచ్చిన ఒక మనిషి హక్కులు ఏ విధంగా కాలరాయబడుతున్నాయనేదే ప్రధానాంశం. హెచ్-1బీ వీసా హోల్డర్ తన ఉద్యోగాన్ని కోల్పోతే 60 రోజుల్లోగా వేరే ఉద్యోగం వెతుక్కోవాలి లేదా దేశం విడిచి వెళ్ళిపోవాలి. ఈ 'వీసా డిపెండెన్సీ' అనే కత్తి వారి మెడపై ఎప్పుడూ వేలాడుతూనే ఉంటుంది. ఈ బలహీనతనే ఆసరాగా చేసుకుని.. కొందరు కన్సల్టెంట్లు వారిని పీల్చి పిప్పి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.. కుటుంబాలను పోషించుకోవడానికి, కష్టపడి తీసుకున్న హోమ్ లోన్లు, చదువుల రుణాలను తీర్చడానికి ఉద్యోగులు ఈ మానసిక హింసను నోరుమెదపకుండా భరిస్తున్నారని యూట్యూబర్ నిరూపించింది.

పారదర్శకత లేని వ్యవస్థలో ప్రతిభకు చోటెక్కడ?

మరోవైపు ప్రతిభ, నైపుణ్యానికి ప్రాధాన్యం దక్కాల్సిన చోట, ప్రాంతీయ ఆధిపత్యాలు, నెట్‌వర్కింగ్ నెపంతో జరిగే అక్రమాలు వ్యవస్థను మరింత దెబ్బతీస్తున్నాయి. అయితే నాణేనికి మరోవైపు ఎంతోమంది నిజాయితీపరులైన విదేశీ నిపుణులు అమెరికా పురోగతిలో భాగమవుతూ సక్రమంగా పన్నులు చెల్లిస్తూ గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారు. కానీ ఈ కొద్దిమంది మధ్యవర్తుల అక్రమాల వల్ల మొత్తం సమాజంపై మచ్చ పడుతోంది.

ఇప్పుడేం కావాలి?

ఇది కేవలం ఒక రాజకీయ లేదా ఆర్థిక అంశం కాదు.. వేల కుటుంబాల జీవితాలకు సంబంధించిన మానవీయ కోణం.. అటు అమెరికన్ ఉద్యోగుల హక్కులను కాపాడుతూనే.. ఇటు దేశం కాని దేశంలో చెమటోడ్చే విదేశీ ఉద్యోగులకు చట్టభద్రత కల్పించాల్సిన బాధ్యత అమెరికా ప్రభుత్వంపై ఉంది. ఉద్యోగుల వేతనాలపై, కన్సల్టెన్సీల ఆగడాలపై కఠిన పర్యవేక్షణ, పూర్తి పారదర్శకత వచ్చినప్పుడే అగ్రరాజ్యంపై ఐటీ నిపుణులకు ఉన్న నమ్మకం నిలబడుతుంది. ఇప్పటికైనా ఈ దోపిడీకి ముగింపు పలకాలి.

Tags:    

Similar News