అమరావతి 'ఫ్యూచర్ ప్లాన్' రివీల్ చేసిన చంద్రబాబు
అంతర్జాతీయ విమానాశ్రయం, బుల్లెట్ రైలు వంటివి తొలి దశ అమరావతి ప్రాజెక్టు ప్రణాళికలో లేవు. కానీ, మలిదశ లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వీటికి చోటు కల్పించారు.
ఏపీ రాజధాని అమరావతి విషయంలో సీఎం చంద్రబాబు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో.. అందరికీ తెలిసిందే. 2015లో ప్రారంభమైన ఈ రాజధాని యజ్ఞం.. 2019-24 మధ్య వైసీపీ హయాంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఆ తర్వాత.. మళ్లీ కూటమిగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. రాజధానిని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. నిరంతరం పనులు అయ్యేలా చేస్తున్నారు. కేవలం పనులు మాత్రమే చేయించడం కాదు.. రాజధానిపై ప్లాన్‌లను కూడా ఎప్పటికప్పుడు మారుస్తున్నారు.
అంతర్జాతీయ విమానాశ్రయం, బుల్లెట్ రైలు వంటివి తొలి దశ అమరావతి ప్రాజెక్టు ప్రణాళికలో లేవు. కానీ, మలిదశ లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వీటికి చోటు కల్పించారు. అలాగే ఇప్పుడు ఏఐ సిటీ పేరుతో మరో నగరాన్ని కూడా అమరావతిలో నిర్మించనున్నారు. అలాగే.. గత ప్రణాళికలో నవ నగరాలకు ప్రాధాన్యం ఇచ్చారు. వీటిలో న్యాయ నగరంతో పాటు ఐటీ నగరానికి కూడా అవకాశం ఇచ్చారు. వాటిని కొనసాగిస్తూనే ఇప్పుడు మరిన్ని నగరాలకు విస్తరించాలని ప్లాన్ చేశారు. దీనిలో ఏఐ ప్రాధాన్యం ఉంటుందన్నది చంద్రబాబు చెబుతున్న మాట.
``అమరావతి అంటే ఒక నగరం కాదు.. ఒక ప్రాంతం కూడా కాదు. అదొక ఐకాన్. ప్రపంచ దేశాలన్నీ తలతిప్పి చూసేలా అమరావతిని నిర్మిస్తున్నాం`` అని చెప్పుకొచ్చారు. ఈ మాట చెబుతున్నప్పుడు.. చంద్రబాబులో సంపూర్ణ భరోసా కనిపించడం గమనార్హం. ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డుకు మాత్రమే ప్రణాళిక ఉందని.. ఇప్పుడు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. (సుమారు 600 కిలోమీటర్లు) కూడా ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. అలాగే.. నాలుగు లైన్ల రైల్వే ట్రాక్, నాలుగు లైన్ల ఎక్స్ ప్రెస్ హైవే సహా.. అధునాతన రోడ్డు కూడా అందుబాటులోకి రానుందని చెప్పారు.
రాజధానితో మారుతున్న ముఖ చిత్రం..
రాజధాని అమరావతిలో పనులు వడివడిగా సాగుతున్న దరిమిలా.. విజయవాడ, గుంటూరు, బాపట్ల సహా.. సమీప జిల్లాల్లో ముఖ చిత్రం కూడా మారుతోందని సీఎం చంద్రబాబు చెప్పారు. కృష్నానదిపై మరో రెండు వంతెనలు నిర్మించనున్నట్టు వెల్లడించారు. దీంతో విజయవాడ సహా గుంటూరుకు పర్యాటక కళ వస్తుందని.. ఆదాయం పెరుగుతుందని చెప్పారు. అమరావతి అనేది నిరంతర ప్రక్రియ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఎప్పటికప్పుడు సింగపూర్ రాజధానిలో మార్పులు జరుగుతుంటాయని.. అలానే అమరావతిలోనూ మార్పులు జరుగుతాయని చెప్పారు.