వానాకాలం ముగిసింది.. చలికాలం రావట్లేదు.. ఎల్ నినో ఎఫెక్ట్ నాయనలారా..

ఈసారి శీతాకాలంలో చలి తక్కువగా ఉంటుంది.. వెచ్చని వాతావరణం ఉంటుంది’ అంటూ వాతావరణ శాఖ చావుకబురు చల్లగా.. సారీ సారీ వెచ్చగా చెప్పింది.

Update: 2026-10-01 16:30 GMT

ఈసారి శీతాకాలంలో చలి తక్కువగా ఉంటుంది.. వెచ్చని వాతావరణం ఉంటుంది’ అంటూ వాతావరణ శాఖ చావుకబురు చల్లగా.. సారీ సారీ వెచ్చగా చెప్పింది. వర్షాకాలంలో సరిగ్గా వర్షాలు పడక పోయినా ఎండలకి ఇబ్బంది పడ్డాం... పోనీ ఈ వచ్చే చలికాలంలోనైనా.. స్వెట్టర్లు, కోట్లు కొనుక్కుని ముసుగేసి పడుకుందామంటే ఆ ఆశపై కూడా ఐఎమ్‌డీ నీళ్లు కాదు.. ఎల్‌నినో వేడి గాలి చల్లింది.. ఏటా "ఏంటి బాబోయ్ ఈ చలి" అని వణకడానికే సిద్ధమయ్యే జనాలు.. ఈసారి మాత్రం శీతాకాలంలో కూడా ఏసీ వేసుకోవాలా లేదా ఫ్యాన్ కింద పడుకోవాలా అని సరికొత్త కన్ఫ్యూజన్‌లో పడిపోయేరోజులు ముందుముందు రాబోతున్నాయట..

నైరుతి రుతుపవనాలు దేశం నుంచి అధికారికంగా వైదొలిగాయి. మాన్‌సూన్ సీజన్ ముగియడంతో ఇకపై దేశవ్యాప్తంగా శీతాకాల వాతావరణ పరిస్థితులు క్రమంగా నెలకునేందుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతోందనే దానిపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సంచలన అంచనాలను విడుదల చేసింది. ఈసారి శీతాకాలంలో చలి తీవ్రత గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

వర్షపాతంలో 13 శాతం లోటు

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయింది. దేశవ్యాప్తంగా నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే, సాధారణం కంటే సుమారు 13 శాతం మేర లోటు నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ అత్యధిక ప్రాంతాల్లో వర్షపాతం పంపిణీ అసమానంగా ఉండటం వల్ల మొత్తంగా ఈ లోటు ఏర్పడింది. అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే తదుపరి సీజన్‌లో వర్షాలు మరింత తగ్గి దేశవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్థానిక వాతావరణ వైపరీత్యాల కారణంగా స్వల్ప వర్షాలు పడే అవకాశం ఉంది.

ఈసారి వెచ్చని శీతాకాలం?

సాధారణంగా అక్టోబర్ చివరి వారం నుంచి దేశంలో చలిగాలుల ప్రభావం మొదలవుతుంది. కానీ ఈ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉండే మూడు నెలల కాలంలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. సాధారణంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోవడం వల్ల చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయి కంటే పైనే నమోదయ్యే అవకాశం ఉన్నందున.. శీతాకాలం అంత తీవ్రంగా ఉండకపోవచ్చని కాస్త వెచ్చని వాతావరణమే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

ప్రధాన కారణం ఎల్‌నినో ప్రభావమే

ఈ తరహా భిన్నమైన వాతావరణ మార్పులకు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే 'ఎల్‌నినో' పరిస్థితులే ప్రధాన కారణమని ఐఎమ్‌డీ స్పష్టం చేసింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పులు ప్రపంచ వాతావరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఎల్‌నినో కారణంగా భారత ఉపఖండంలో వర్షపాతం తగ్గడమే కాకుండా ఉష్ణోగ్రతలు పెరిగేందుకు దారితీస్తుంది. ఫలితంగా అక్టోబర్-డిసెంబర్ కాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.

మొత్తానికి మాన్‌సూన్ వర్షాల లోటుతో పాటు రాబోయే శీతాకాలం కూడా మునుపటి అంత తీవ్రమైన చలిని అందించకపోవచ్చని వాతావరణ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Tags:    

Similar News