లైఫ్‌స్టైల్ తప్పులను పక్కన పెట్టి వ్యాక్సిన్లను బ్లేమ్ చేస్తున్నారా?
నిజమైన డాక్టర్లు, శాస్త్రవేత్తలు చెబుతున్న నిజాలను పక్కనపెట్టి, సోషల్ మీడియాలో వచ్చే క్లిక్ బైట్ థంబ్‌నెయిల్స్, నిరూపణ లేని వార్తలనే నిజాలని నమ్మే మైండ్‌సెట్ ప్రజల్లో పెరిగిపోయింది.
ఈమధ్య కాలంలో ఎవరికైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా లేదా హఠాత్తుగా గుండెపోటు వంటివి వచ్చినా, వెంటనే అందరి నోటా వినిపించే మాట "అంతా ఆ వ్యాక్సిన్ మహత్యమే" అని. కానీ నిజంగానే వ్యాక్సిన్లే కారణమా? లేక మన బాధ్యతారాహిత్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక నెపం వెతుక్కుంటున్నామా? మన చెడు అలవాట్లను, జీవనశైలి తప్పులను పక్కనపెట్టి వ్యాక్సిన్లను బ్లేమ్ చేసే ఈ విచిత్రమైన సైకాలజీ గురించి, సోషల్ మీడియా చేస్తున్న ప్రచారాలు గురించి చూద్దాం..
సొంత తప్పులను కప్పిపుచ్చే "ఎస్కేప్" సైకాలజీ:
మన ఆరోగ్యం పాడవడానికి ప్రధాన కారణం మన రోజువారీ అలవాట్లే. గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ తినడం, సిగరెట్లు తాగడం, విపరీతమైన స్ట్రెస్ తీసుకోవడం వంటి నిజమైన కారణాలను ఒప్పేసుకోవడం ఎవరికైనా కష్టమే. అందుకే మన తప్పులను ఒప్పుకోకుండా, సులభంగా వేరొక దానిపై తోసేయడానికి "వ్యాక్సిన్ బ్లేమింగ్" ఒక సాధనంగా మారిపోయింది అన్నదికొందరి మాట.
సోషల్ మీడియా తెచ్చిన "ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ":
సైన్స్ మరియు మెడికల్ ఆధారాలు లేకుండా సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను జనాలు కళ్ళు మూసుకుని నమ్మేస్తున్నారు. "ఫలానా వ్యాక్సిన్ వల్లే ఇలా జరిగింది" అంటూ వచ్చే మెసేజ్‌లు విపరీతంగా షేర్ అవుతున్నాయి. నిజమైన డాక్టర్లు, శాస్త్రవేత్తలు చెబుతున్న నిజాలను పక్కనపెట్టి, సోషల్ మీడియాలో వచ్చే క్లిక్ బైట్ థంబ్‌నెయిల్స్, నిరూపణ లేని వార్తలనే నిజాలని నమ్మే మైండ్‌సెట్ ప్రజల్లో పెరిగిపోయింది.
నిజమైన ముప్పును గుర్తించకపోవడమే అసలైన ప్రమాదం:
ప్రతిదానికీ వ్యాక్సిన్‌ను నిందిస్తూ కూర్చుంటే అసలైన ప్రమాదాన్ని మనం గుర్తించలేం. రక్తంలో పెరిగే బ్యాడ్ కొలెస్ట్రాల్, నిద్రలేమి, అధిక రక్తపోటు వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్లనే చిన్న వయసులోనే ప్రాణాల మీదికి వస్తోంది. వైద్య నిపుణుల ప్రకారం.. గుండె సమస్యలు రావడానికి వ్యాక్సిన్ల కంటే మన అనారోగ్యకరమైన జీవనశైలే 99 శాతం కారణం.
లైఫ్‌స్టైల్ మార్చుకోకపోతే ఎంత ప్రమాదం?:
మన శరీరానికి కావాల్సిన పోషకాహారం ఇవ్వకుండా, క్రమం తప్పకుండా వాకింగ్ లేదా వ్యాయామం చేయకుండా కేవలం వేరేవాటిపై నెపం నెట్టేస్తే ఆరోగ్యం బాగుపడదు. సోషల్ మీడియా భయాలను పక్కనపెట్టి, క్రమం తప్పకుండా బాడీ చెకప్స్ చేయించుకోవడం మరియు లైఫ్‌స్టైల్‌ను మార్చుకోవడమే మనల్ని ఆరోగ్యవంతులుగా మలుచుకోవడానికి వున్నా సాధనాలు.
కళ్ళు మూసుకుని సూర్యుడు లేడనుకోవడం ఎంత అమాయకత్వమో, మన అలవాట్లను మార్చుకోకుండా వ్యాక్సిన్లను తిట్టుకోవడం కూడా అంతే ప్రమాదకరం. ఇక సోషల్ మీడియా ప్రచారాలను గుడ్డిగా నమ్మకుండా, మెడికల్ ఫ్యాక్ట్స్ అర్థం చేసుకుని, మన లైఫ్‌స్టైల్ సరిచేసుకోవడమే మనం చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పని.