హైబీపీ కొలవడంలో ఈ రూల్స్ పాటించండి.. WHO హెచ్చరికలు!

అలాగే పరీక్షకు సరిగ్గా 30 నిమిషాల ముందు ఎలాంటి వ్యాయామాలు చేయకూడదు. ప్రశాంతమైన వాతావరణంలోనే చెక్ చేసుకోవాలి.

Update: 2026-09-06 15:30 GMT

నేటి కాలంలో హైబీపీ చాలామందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. సరైన సమయంలో బిపి తెలుసుకోకపోతే గుండెజబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ముప్పు పొంచి ఉంటుంది. అందుకే బిపి కొలిచేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేసినా రీడింగ్ తప్పుగా వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది. బిపి చెక్ చేసుకునేటప్పుడు కచ్చితంగా పాటించాల్సిన కొన్ని కీలకమైన నిబంధనలను హెచ్చరికల రూపంలో విడుదల చేసింది.

సరిగ్గా కూర్చోవడం చాలా ముఖ్యం:

బిపి కొలిచేటప్పుడు కూర్చునే భంగిమ రీడింగ్‌పై ప్రభావం చూపుతుంది. అందుకే కుర్చీలో వెనుక వీపు ఆనించి ప్రశాంతంగా కూర్చోవాలి. చాలామంది కాళ్లు క్రాస్ చేసి కూర్చుంటారు, కానీ అలా చేయకూడదు. ఇక రెండు పాదాలను నేలపై నిటారుగా మోపి ఉంచడం వల్ల సరైన బిపి రీడింగ్ వస్తుంది.

చేతి స్థానం, కఫ్ సైజ్ జాగ్రత్తలు :

బిపి చెక్ చేసే యంత్రం కఫ్ పరిమాణం మీ చేతికి సరిపడా ఉండాలి. చాలా లూజ్‌గా లేదా టైట్‌గా ఉంటే రీడింగ్ తప్పుగా వస్తుంది. అలాగే బిపి కొలిచే సమయంలో మీ చేతిని సరిగ్గా గుండె ఉన్న ఎత్తు లో ఉండేలా సపోర్ట్‌గా ఉంచడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు.

పరిశీలనకు ముందు విశ్రాంతి అవసరం:

బిపి పరీక్ష చేసుకోవడానికి కనీసం 5 నిమిషాల ముందు ప్రశాంతంగా కూర్చుని రెస్ట్ తీసుకోవాలి. హడావుడిగా వచ్చి బిపి చెక్ చేసుకుంటే రీడింగ్ ఎక్కువగా చూపిస్తుంది. అలాగే పరీక్షకు సరిగ్గా 30 నిమిషాల ముందు ఎలాంటి వ్యాయామాలు చేయకూడదు. ప్రశాంతమైన వాతావరణంలోనే చెక్ చేసుకోవాలి.

టీ, కాఫీ, పొగతాగడం నిషేధం:

బిపి కొలిచే అరగంట ముందు టీ, కాఫీలు తాగడం లేదా ధూమపానం చేయడం వంటివి అస్సలు చేయకూడదు. వీటిలో ఉండే కెఫీన్, నికోటిన్ తాత్కాలికంగా రక్తపోటును పెంచుతాయి. ఇక దీనివల్ల మీకు బిపి లేకపోయినా ఉన్నట్లు తప్పుడు రీడింగ్ వచ్చే ప్రమాదం ఉంది.

పరీక్ష సమయంలో మాట్లాడకండి:

చాలామంది బిపి చెక్ చేసుకుంటున్న సమయంలో డాక్టర్లతో లేదా పక్కన ఉన్నవారితో మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడటం వల్ల బిపి లెవెల్స్ క్షణాల్లో మారే అవకాశం ఉంది. పరీక్ష పూర్తయ్యే వరకు నోరు మూసుకుని, పూర్తి ప్రశాంతతతో ఉండటమే మంచిది.

బిపిని క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడంతో పాటు WHO సూచించిన ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తేనే సరైన రీడింగ్ వస్తుంది. తప్పుడు రీడింగ్ వల్ల అనవసరమైన మందులు వాడే ప్రమాదం ఉంది కాబట్టి, ఇకపై బిపి చెక్ చేసుకునే ప్రతిసారీ ఈ నియమాలను తప్పకుండా గుర్తుంచుకోండి.

Tags:    

Similar News