2026 నవంబర్ సంథింగ్ స్పెషల్ ఎందుకంటే?
అయితే 2026 నవంబర్ నెల మాత్రం వీటన్నింటికీ పూర్తి భిన్నంగా ట్రేడ్ వర్గాలను సైతం విస్తుపోయేలా సరికొత్త రికార్డులకు వేదిక కాబోతోంది.
ఇండస్ట్రీలో సాధారణంగా నవంబర్ నెలను డల్ పీరియడ్ గా భావిస్తారు. దసరా పండుగ హడావుడి ముగియడం.. సంక్రాంతి ధమాకాకు సమయం ఉండటం.. పైగా పాఠశాలలు .. కళాశాలలకు పరీక్షల కాలం సమీపిస్తుండటంతో నిర్మాతలు పెద్ద సినిమాలను నవంబర్‌లో విడుదల చేయడానికి ఎంత మాత్రం సాహసించరు. అయితే 2026 నవంబర్ నెల మాత్రం వీటన్నింటికీ పూర్తి భిన్నంగా ట్రేడ్ వర్గాలను సైతం విస్తుపోయేలా సరికొత్త రికార్డులకు వేదిక కాబోతోంది.
ఈ నవంబర్ స్పెషల్ కావడానికి ప్రధాన కారణం దీపావళి కానుకగా బాక్సాఫీస్ ముందుకు రాబోతున్న దృశ్య కావ్యం `రామాయణం` (పార్ట్-1). 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, యష్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదల కానుంది. ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్.. హన్స్ జిమ్మర్ సంగీతం అందించిన విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా వేల స్క్రీన్లలో విడుదలవుతూ నవంబర్ నెలకు ఒక గ్లోబల్ ఈవెంట్ రేంజ్ క్రేజ్‌ను తీసుకొచ్చింది.
పాన్-ఇండియా సినిమాలతో పాటు టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరోలు కూడా ఈసారి నవంబర్ క్యాలెండర్‌ను టార్గెట్ చేయడం విశేషం. సంపత్ నంది -శర్వానంద్ కాంబినేషన్ లో యాక్షన్ పీరియాడిక్ డ్రామా `భోగి` నవంబర్ 12న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. సాధారణంగా సంక్రాంతి, వేసవికి ప్రాధాన్యమిచ్చే శర్వానంద్ వంటి హీరోలు సైతం నవంబర్ బాక్సాఫీస్ పొటెన్షియల్‌ను నమ్మి తమ సినిమాలను బరిలోకి దింపుతున్నారు.
దీంతో పాటు యువ ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉన్న కామెడీ ఎంటర్‌టైనర్ `ఈ నగరానికి ఏమైంది` సీక్వెల్ గా రాబోతున్న `ఈఎన్ఈ రిపీట్` చిత్రం నవంబర్ 19న విడుదల కానుంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ అండ్ గ్యాంగ్ సృష్టిస్తున్న ఈయూత్ ఫుల్ హంగామా నవంబర్ మూడో వారంలో థియేటర్లను షేక్ చేయడానికి సిద్ధమైంది. అన్‌సీజన్ అనే మాటను పక్కనపెట్టి యూత్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించేలా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేశారు.
నవంబర్ చివరి వారంలో కూడా బాక్సాఫీస్ జోరు తగ్గేలా కనిపించడం లేదు. దుల్కర్ సల్మాన్, శృతి హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం `ఆకాశంలో ఒక తార` (నవంబర్ 20)తో పాటు, సాయి శ్రీనివాస్ బెల్లంకొండ మైథలాజికల్ థ్రిల్లర్ `హైందవ`, రష్మిక మందన్న నటిస్తోన్న పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా `మైసా` చిత్రాలు నవంబర్ 27న పోటీ పడటానికి క్యూ కట్టాయి. ఇలా వారానికో బిగ్ ప్రాజెక్ట్ తో నవంబర్ క్యాలెండర్ హౌస్‌ఫుల్ అయిపోయింది.
ఒకప్పుడు కేవలం పండుగలు.. సెలవులకే పరిమితమైన పెద్ద సినిమాల విడుదల వ్యూహాలు ఇప్పుడు మారుతున్నాయని 2026 నవంబర్ నిరూపిస్తోంది. సరైన కంటెంట్.. సరైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఏ నెలైనా గోల్డెన్ పీరియడ్ గా మారుతుందని ఈ విడుదలలు చాటిచెబుతున్నాయి. ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే నవంబర్ నెల ఈసారి వందల కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లతో టాలీవుడ్ .. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత బిజీయెస్ట్ మంత్‌గా రికార్డులకెక్కబోతోంది.