రాఘవేంద్రరావు మరదలు, జగపతిబాబు చెల్లెలు.. గుంటూరు మేయర్ అభ్యర్థికి సినీ ప్రముఖుల మద్దతు

గుంటూరు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ కుటుంబ నేపథ్యంపై ఆసక్తికర సమాచారం వెలుగుచూసింది.

Update: 2026-10-30 10:22 GMT

గుంటూరు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ కుటుంబ నేపథ్యంపై ఆసక్తికర సమాచారం వెలుగుచూసింది. ఆమె విజయాన్ని కాంక్షిస్తూ ఇద్దరు సినీ ప్రముఖులు వీడియో సందేశాలు విడుదల చేశారు. ఆ ఇద్దరూ లక్ష్మీ అపర్ణకు దగ్గర బంధువులుగా చెబుతున్నారు. లక్ష్మీ అపర్ణను గుంటూరు మేయరుగా గెలిపించాలని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ హీరో జగపతిబాబు ప్రత్యేకంగా వీడియోలు విడుదల చేశారు. రాఘవేంద్రరావు, మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ భర్త కోవెలమూడి రవీంద్ర సోదరులుగా చెబుతున్నారు. అదేవిధంగా లక్ష్మీ అపర్ణ తనకు సోదరి అంటూ స్వయంగా జగపతిబాబు వెల్లడించారు.

గుంటూరు టీడీపీ నేత, మాజీ మేయర్ రవీంద్ర అలియాస్ నాని రాజకీయాల్లో చాలా సీనియర్. అయినప్పటికీ ఆయన బంధుత్వంపై గుంటూరు వాసులకు తప్ప రాష్ట్రంలో ఇతర ప్రాంతాల వారికి తెలియదు. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల పోరులో రవీంద్ర కుటుంబం దిగడంతో ఆయన బంధువులు బయటకు వస్తున్నారు. కోవెలమూడి లక్ష్మీ అపర్ణను గెలిపించాలని కోరుతున్నారు. ఇందులో సినీ ప్రముఖులు అయిన రాఘవేంద్రరావు, జగపతిబాబు విడుదల చేసిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

గుంటూరు ప్రజలకు విన్నపం నా చెల్లి లక్ష్మీ అపర్ణ మేయరుగా పోటీ చేస్తున్నారని జగపతిబాబు విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటోందని చెబుతున్నారు. ప్రజలు చాలా తెలివైన వారని, ఎవరిని గెలిపించాలో వారికి బాగా తెలుసు అన్న జగపతిబాబు గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించినట్లుగానే లక్ష్మీ అపర్ణను గెలిపించాలని కోరారు. నా చెల్లికి మంచి మనసు ఉంది. సమర్థురాలు అంటూ ఆయన కితాబునిచ్చారు. ఇక జగపతిబాబు చెల్లెలుగా లక్ష్మీ అపర్ణను పరిచయం చేయడంతో వారి మధ్య బంధుత్వంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ప్రముఖ నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ కుమారుడైన జగపతిబాబుకు ఇద్దరు సోదరులు మాత్రమే ఉన్నారని సమాచారం. అయితే లక్ష్మీ అపర్ణ కుటుంబంతో దగ్గర సంబంధం ఉండటం, బంధుత్వం కారణంగా ఆమె సోదరి అవుతారని అంటున్నారు. మొత్తానికి గుంటూరు మేయరు అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు మద్దతుగా సినీ ప్రముఖులతోపాటు పారిశ్రామిక, వ్యాపార దిగ్గజాలు సైతం బయటకు వస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని అంటున్నారు. శుక్రవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియగా, సినీ ప్రముఖులు విడుదల చేసిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో గుంటూరు కూటమి మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణకు డిజటల్ ప్రచారం బాగా జరుగుతోందని విశ్లేషిస్తున్నారు.




Tags:    

Similar News