దళపతి విజయ్, సీఎం రేవంత్ గొప్ప మనసు.. ఏపీకి అనూహ్య సహకారం

అర్నాబ్ తుపాను ధాటికి వేలాది విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, సబ్ స్టేషన్ లైన్లు తెగిపడటంతో కరెంట్ వ్యవస్థను సాధారణ స్థితికి తేవడం ఏపీ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.

Update: 2026-10-30 10:41 GMT

రాజకీయాలు, సరిహద్దు వివాదాలు, ఎన్నికల వేడి... ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే. కానీ, ప్రకృతి ప్రకోపించి ఆపద ఎదురైనప్పుడు ప్రజా సంక్షేమం, మానవత్వమే పరమావధిగా నిలుస్తాయని పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిరూపించాయి. అర్నాబ్ తుపాను ప్రభావంతో ఏపీ తీవ్ర నష్టాన్ని చవిచూసింది. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. వేలాది గ్రామాలు, పట్టణాలు అంధకారంలో కూరుకుపోయాయి. ఈ క్లిష్ట సమయంలో రాజకీయాలను పక్కనబెట్టి తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు ఏపీకి స్నేహహస్తం అందించడం దక్షిణాది రాజకీయాల్లో ఒక గొప్ప సానుకూల పరిణామంగా నిలిచింది.

చీకట్లను తరిమేందుకు తక్షణ సహాయం

అర్నాబ్ తుపాను ధాటికి వేలాది విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, సబ్ స్టేషన్ లైన్లు తెగిపడటంతో కరెంట్ వ్యవస్థను సాధారణ స్థితికి తేవడం ఏపీ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. వేలాది మంది ప్రజలు నిత్య జీవితానికి అవసరమైన విద్యుత్, తాగునీరు లేక అల్లాడుతున్న తరుణంలో ప్రభుత్వం ఇతర రాష్ట్రాల సహాయం కోరింది. దీనిపై పొరుగు రాష్ట్రాలు అత్యంత వేగంగా స్పందించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే సానుకూలంగా స్పందించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్వయంగా ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు ఫోన్ చేసి, అవసరమైన సిబ్బందిని, సాంకేతిక సామగ్రిని పంపుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి వచ్చిన నిపుణులైన విద్యుత్ బృందాలు క్షేత్రస్థాయిలోకి దిగి, ఏపీ సిబ్బందితో భుజం భుజం కలిపి విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యాయి.

తమిళనాడు ప్రభుత్వ సానుకూల స్పందన

మరోవైపు తమిళనాడు ప్రభుత్వం సైతం ప్రకృతి విపత్తు వేళ పొరుగు రాష్ట్రానికి సహాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఏపీలో అస్తవ్యస్తమైన విద్యుత్ వ్యవస్థను వేగంగా పునరుద్ధరించేందుకు అవసరమైన సాంకేతిక బృందాలను, సామగ్రిని పంపించేందుకు అంగీకరించింది. తమిళనాడు నుంచి వచ్చిన నిపుణుల సహకారంతో తీరప్రాంత జిల్లాల్లో కరెంట్ సరఫరా పనులు మరింత వేగవంతమయ్యాయి. ఈ తుపాను సహాయ చర్యల వెనుక ఒక ప్రశంసనీయమైన రాజకీయ పరిణతి కనిపిస్తోందని అంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో టీవీకే అధినేత, సీఎం విజయ్‌కి వ్యతిరేకంగా గతంలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారాలు చేసినప్పటికీ, అవేవీ మనసులో పెట్టుకోకుండా పొరుగు రాష్ట్రం ఆపదలో ఉందన్న విషయాన్ని గుర్తించిన విజయ్ ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలకు సానుకూలంగా స్పందించిందని అభినందనలు అందుకుంటోంది.

రేవంత్ - చంద్రబాబు సుదీర్ఘ అనుబంధం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య ఉన్న సుదీర్ఘ అనుబంధం విపత్తు సమయంలో రెండు రాష్ట్రాల మధ్య వేగవంతమైన సమన్వయానికి పునాదిగా నిలిచింది. రాజకీయం ఎలా ఉన్నా, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు తక్షణమే స్పందించి పరస్పరం సహకరించుకోవటం విశేషంగా చెబుతున్నారు. అదేసమయంలో తమిళనాడుతో ఎల్లప్పుడూ సత్సంబంధాలు కొనసాగించాలని ఆశిస్తున్న సీఎం చంద్రబాబు ఇటీవల సీఎం విజయ్‌ని ఆహ్వానించారు. విపత్తు వేళ విజయ్ చూపిన సానుకూల దృక్పథం, చంద్రబాబు గతంలో తీసుకున్న చొరవ రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలకు దారితీసినట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News