టీటీడీ చైర్మన్ రేస్ : బిగ్ ట్విస్ట్ ఇస్తారా? బీఆర్ నాయుడు రిటైర్మెంట్, కళా వర్సెస్ జ్యోతుల నెహ్రూ

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి గడువు శుక్రవారంతో ముగిసింది. దేశంలోనే అత్యంత ప్రాధాన్యం ఉన్న టీటీడీకి కొత్త చైర్మన్ ఎవరు అన్న చర్చ మొదలైంది.

Update: 2026-10-30 09:15 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి గడువు శుక్రవారంతో ముగిసింది. దేశంలోనే అత్యంత ప్రాధాన్యం ఉన్న టీటీడీకి కొత్త చైర్మన్ ఎవరు అన్న చర్చ మొదలైంది. రెండేళ్ల క్రితం బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు వైదొలుగుతున్నారు. అయితే ఆయనను మళ్లీ కొనసాగించే విషయమై ప్రభుత్వంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని అంటున్నారు. ఈ కారణంగానే పొడిగింపు ఉత్తర్వులు జారీ చేయలేదని విశ్లేషిస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్లే టీటీడీ పాలకవర్గంపై నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏదిఏమైనా గడువు ముగియడంతో రేపటి నుంచి చైర్మన్ బీఆర్ నాయుడు మాజీ అవనున్నారన్న ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. ప్రస్తుత పాలకవర్గం స్థానంలో తాత్కాలికంగా అధికారులతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ పాలకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 నవంబర్ ప్రారంభంలో బి.ఆర్. నాయుడిని టీటీడీ 54వ ఛైర్మన్‌గా నియమించారు. నవంబర్ 6న ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రముఖ మీడియా సంస్థ అధినేతగా, ఆధ్యాత్మిక సేవా రంగాల్లో గుర్తింపు ఉన్న బీఆర్ నాయుడి సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా చెబుతారు. దీంతో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయనకు టీటీడీ బాధ్యతలు కట్టబెట్టారని చెబుతున్నారు. తన పదవీకాలంలో శ్రీవారి ప్రసాదాల తయారీలో వాడే నెయ్యి నాణ్యతా ప్రమాణాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, సాధారణ భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించేలా సాంకేతిక మార్పులు, కాటేజీల బుకింగ్, నిత్యాన్నదాన కాంప్లెక్స్ నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు ఈ-టెండరింగ్ విధానాన్ని కఠినతరం చేయడం వంటి పలు సంస్కరణలను చైర్మన్ బీఆర్ నాయుడు అమలు చేశారని చెబుతున్నారు.

ఇక పదవీకాలం ముగియడంతో బీఆర్ నాయుడికి మరో విడత కొనసాగింపు ఇస్తారా? లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. పాలనలో తెచ్చిన పారదర్శకత ఆయనకు కలసివచ్చే అంశమైనప్పటికీ, ఎన్డీయే కూటమిలోని రాజకీయ సమీకరణాలు, సీనియర్ నాయకుల ఆకాంక్షల దృష్ట్యా మార్పు ఉండే అవకాశం ఉందనే చర్చ జోరుగా నడుస్తోంది. ఒకవేళ నూతన ఛైర్మన్‌ను నియమించాల్సి వస్తే, సీనియర్ నేతలు జ్యోతుల నెహ్రూ, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు పేర్లు పరిశీలించే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కళావెంకటరావు గతంలో ఒకసారి టీటీడీ చైర్మనుగా పోటీ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ సీనియర్ నేత బొత్సను ఓడించారు. కానీ, మంత్రి పదవి దక్కలేదన్న ఆవేదనతో కళా ఉన్నారని అంటున్నారు. ఆయన వయసు రీత్యా మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచన లేకపోవడంతో టీటీడీ పదవి ఇచ్చి సంతృప్తి పరచాలని టీడీపీ అధిష్టానం ఆలోచిస్తోందని చెబుతున్నారు. అయితే సీనియర్ నేత జ్యోతుల నెహ్యూ సైతం కళాకు గట్టిపోటీ ఇస్తున్నారని అంటున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి కాలేకపోయారన్న ఆవేదన జ్యోతుల అనుచరుల్లో ఉందని అంటున్నారు. మంత్రి పదవికి బదులుగా టీటీడీ సభ్యత్వంతో ఆయనను సంతృప్తి పరుస్తున్నారని అంటున్నారు. ఇక చివరి అవకాశంగా తనకు చైర్మన్ పదవి ఇవ్వాలని జ్యోతుల నెహ్రూ కోరుతున్నారని అంటున్నారు. రాష్ట్రంలోని ప్రధాన సామాజికవర్గానికి చెందిన ప్రతినిధిగా నెహ్రూ విషయంలో అధిష్టానం కూడా సానుకూలంగా ఉందన్న టాక్ నడుస్తోంది. దీంతో కళా వర్సెస్ జ్యోతుల అన్నట్లు పోటీ ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News