మందు.. మనీ ఇవ్వం!.. అంబటి చెప్పిన ఆర్గానిక్ ఎలక్షన్ స్ట్రాటజీ

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-10-30 14:30 GMT

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల రాజకీయాన్ని ఆర్గానిక్ వ్యవసాయంతో పోల్చిన ఆయన గుంటూరు మేయరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాడికొండ శ్రీదేవి తరఫున తమ పార్టీ మద్యం, డబ్బు పంచమని, గెలిపిస్తే మంచి పాలన అందిస్తామని వ్యాఖ్యానించారు. తాము నగరంలో ఆర్గానిక్ ఎలక్షన్స్ చేస్తామని అంబటి వ్యాఖ్యానించారు. ‘‘ఆర్గానిక్ వ్యవసాయం తెలుసు కదా’ మందులు వేయరు, ఎరువులు వేయరు. కానీ, పంట చాలా రుచిగా ఉంటుంది. మేము కూడా అంతే ఆర్గానిక్ ఎలక్షన్స్ కు వెళుతున్నాం, మందులు, ఎరువులు వేయం’’ అంటూ చెప్పారు. పరోక్షంగా తాము ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయమని, మద్యం సరఫరా చేయమని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో తాము ఘోరంగా ఓడిపోయామని వ్యాఖ్యానించిన అంబటి తమ పార్టీ తరఫున ఎన్నికల్లో ఎటువంటి ఖర్చు చేయమని విస్పష్టంగా ప్రకటించడం హాట్ టాపిక్ అవుతోంది.

విపక్షం వైసీపీలో మంచి మాటకారిగా అంబటి రాంబాబుకు పేరుంది. ముఖ్యంగా అధికార కూటమి పాలనను తనదైన శైలిలో విమర్శిస్తూ నిత్యం మీడియాను ఆకర్షిస్తుంటారు అంబటి. రెండు రోజుల క్రితం రాష్ట్రంలో ధరల పెరుగుదలను ఎండగడుతూ ‘బియ్యం కిలో వంద రూపాయలు అయినందుకు చంద్రబాబు, లోకేశ్ కు ట్యాంక్స్’ అంటూ ట్వీట్ చేసి అధికార పక్షంపై వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. ఒక్క మాటతో తమ అజెండాను వివరించిన అంబటి, ప్రజలు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యను హైలెట్ చేశారని అంటున్నారు. ఇక తాజాగా తమ పార్టీ పరిస్థితిని వివరిస్తూ ఆర్గానిక్ ఫార్మింగ్ ను ఉదహరించడంపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఆర్గానిక్ ఫార్మింగ్ కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ పార్టీ కూడా ఆర్గానిక్ ఎన్నికలకు వెళుతున్నట్లు అంబటి చెప్పడం ఆకర్షించిందని అంటున్నారు. ఓడిపోయిన తమ వద్ద డబ్బు లేదని చెప్పడంతోపాటు తమ పార్టీ తరఫున నిలిపిన అభ్యర్థి సైతం పేద ఆర్యవైశ్య కులానికి చెందిన వారంటూ చెప్పి ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఇదే సమయంలో ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన ప్రముఖలు తమ అభ్యర్థి తాడికొండ శ్రీదేవికి పార్టీలకు అతీతంగా ఓటు వేయాలని, ప్రతి ఒక్కరూ రూపాయి చొప్పున సాయం చేయాలని కోరారు. నోటు ఇవ్వాలి.. ఓటు వేయాలి అంటూ ఆయన ఆర్యవైశ్యులకు పిలుపునిచ్చారు.

టీడీపీ అభ్యర్థి ఆర్థికంగా ఉన్నవారని, వారిని డబ్బుతో ఢీకొట్టలేమని అంబటి పరోక్షంగా అంగీకరించారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.డబ్బు ఖర్చు చేయనిదే ఎన్నికల్లో పాల్గొనలేని నేటి పరిస్థితుల్లో అంబటి చేసిన తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రధానంగా ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నుంచి ఎలాంటి తాయిళాలు ఆశించవద్దని పార్టీ కేడర్ తోపాటు ఓటర్లకు మాజీ మంత్రి అంబటి సంకేతాలిచ్చారని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో అధికార కూటమి, వైసీపీ మధ్య పోటీపై రకరకాల విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా అధికారపక్షం తీరుపై విపక్షం ఘాటు విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి ఓటర్లను ఆలోచనలకు గురిచేసేలా మాటలతో మాయ చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News