చార్ధామ్ యాత్రపై ప్రకృతి పంజా.. మరణశాసనం.. హిమాయల కొండల్లో ఏం జరుగుతోంది
పవిత్ర పుణ్యక్షేత్ర దర్శనం కోసం ఆశగా.. ఆధ్యాత్మిక పరవశంతో హిమాలయాల బాట పట్టిన భక్తులను ప్రకృతి దారుణంగా పరీక్షిస్తోంది.
పవిత్ర పుణ్యక్షేత్ర దర్శనం కోసం ఆశగా.. ఆధ్యాత్మిక పరవశంతో హిమాలయాల బాట పట్టిన భక్తులను ప్రకృతి దారుణంగా పరీక్షిస్తోంది. పచ్చని కొండలు.. తెల్లటి మంచు శిఖరాల నడుమ కొలువుదీరిన చార్ధామ్ యాత్రలో ఇప్పుడు భయం భయంగా ప్రతి అడుగు పడుతోంది. ఒకవైపు హఠాత్తుగా కురుస్తున్న భారీ వర్షాలు.. మరోవైపు గడ్డకట్టే హిమపాతం.. వీటికి తోడు క్షణాల్లో మారిపోతున్న వాతావరణం యాత్రికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
ఆశలతో ప్రయాణం.. క్షణాల్లో విషాదఛాయలు
పుణ్యక్షేత్రాలను త్వరితగతిన సందర్శించుకోవాలని.. శారీరక ఇబ్బందులు ఉన్న వృద్ధులకు సులభంగా ఉంటుందని ఎంతోమంది భక్తులు హెలికాప్టర్ ప్రయాణాలను ఆశ్రయిస్తుంటారు. అయితే బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్ వైపు బయలుదేరిన ఆరుగురు ప్రయాణికుల ఆశలు క్షణాల్లో ఆవిరయ్యాయి. ట్రాన్స్ భారత్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్ మధ్యాహ్నం 1:14 గంటలకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దట్టమైన మేఘాలు.. భారీ వర్షం కారణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో కమ్యూనికేషన్ తెగిపోయింది. ఆ తర్వాత జోషిమఠ్ సమీపంలోని ఛాయ్ గ్రామం వద్ద అది కూలిపోయిందనే వార్త అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
హెలిక్యాప్టర్ లో పైలట్ కెప్టెన్ హిమాన్షుతో పాటు ప్రతాప, అరుణ్, శంకర్ గౌడ, సుధీర్, కెహెచ్ఎస్ నటరాజ్ ఉన్న ఈ ప్రమాద స్థలికి భారత సైన్యం, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు వెంటనే చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అయితే అక్కడ కురుస్తున్న మంచు, ప్రతికూల గాలులు సహాయక చర్యలకు సైతం పెద్ద సవాల్‌గా మారడం అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతోంది.
భయం గుప్పిట్లో హిమగిరులు
ఈ ప్రమాదం ఒక్కటే కాదు.. కేదార్నాథ్ ధామ్ పరిసరాల్లో ఈ సీజన్లోనే తొలిసారిగా భారీగా కురిసిన హిమపాతం కొండ ప్రాంతాలను తెల్లటి దుప్పటితో కప్పేసింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో భక్తులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉత్తరకాశీ, తెహ్రీ, హరిద్వార్ జిల్లాల్లో వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో హెలికాప్టర్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావాల్సి రావడం ప్రయాణికుల భద్రతపై ప్రశ్నార్థకంగా మారింది.
భద్రతే ముఖ్యం.. ప్రయాణాల్లో అప్రమత్తత అత్యవసరం
నవంబర్ తొలి వారం వరకు వాతావరణం ఇలాగే ప్రతికూలంగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దేవుని దర్శనం ఎంత ముఖ్యమో.. ప్రాణ రక్షణ కూడా అంతే ముఖ్యం. నిమిషాల్లో మారిపోయే హిమాలయ వాతావరణాన్ని తక్కువగా అంచనా వేయకుండా అధికారులు ఇచ్చే భద్రతా సూచనలను కచ్చితంగా పాటిస్తూ యాత్రను కొనసాగించడమే ఇప్పుడు యాత్రికులు చేయాల్సిన ఏకైక పని...