రాహుల్ గెలిచినట్లేనా... చర్చకు సిద్ధమంటున్న అమిత్ షా

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

Update: 2026-10-30 22:30 GMT

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రధానంగా ఓట్ల చోరీకి సంబంధించిన అంశాల మీదనే చర్చకు తాము రెడీ అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రతిపక్షాలు అంగీకరిస్తే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధం అని చెబుతోంది. రాహుల్ గాంధీ వీధుల్లో కాదు పార్లమెంట్ లో చర్చకు తాము రెడీగా ఉన్నామని అమిత్ షా స్పష్టం చేస్తున్నారు. అన్ని విషయాలు అక్కడే చర్చిద్దామని అంటున్నారు. యూపీ పర్యటనలో భాగంగా అమిత్ షా రాహుల్ గాంధీకి సవాల్ లాంటిది చేస్తూనే పార్లమెంట్ కి రావాలని కోరుకున్నారు.

ఓటు చోరీ మీద :

ఓటు చోరీ అంశం మీద గత కొన్ని నెలలుగా విపక్షాలు భారీ ఎత్తున పోరాటమే చేస్తున్నాయి. కాంగ్రెస్ అయితే దూకుడుగానే ఉంది. వరుసగా అనేక ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. అలాగే నవంబర్ 1న ఢిల్లీలోని రామ్ లీలా మైదానం దాకా భారీ మార్చ్ ని నిర్వహించడానికి కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి పూర్తిగా సన్నద్ధంగా ఉంది. దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తమ ఆలోచనలు ఏమిటో చెప్పింది. అమిత్ షా మాట్లాడుతూ ఓట్ల దొంగతనం అని విపక్షం చెప్పడం కాదు, పార్లమెంట్ లో చర్చలో పాల్గొనాలని కోరారు. అక్కడే తాము వారి సందేహాలకు తగిన జవాబు ఇస్తామని అంటున్నారు.

నిరాధారం అంటూనే :

కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని అమిత్ షా వ్యాఖ్యనించారు. అయితే అదే పనిగా ఓట్ల దొంగతనం అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై పార్లమెంటులో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయితే ఈ చర్చకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అంగీకరించరని అమిత్ షా వ్యాఖ్యానించడం విశేషం. కేంద్ర ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు పార్లమెంటులో చర్చకు రావాలని హోం మంత్రి సవాల్‌ విసిరారు.

నిరసనలు ఎందుకు :

చర్చల ద్వారానే ఏదైనా తేల్చుకోవాలని అమిత్ షా అన్నారు. కానీ విపక్షాలు మాత్రం నిరసనలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ సహా ఇండియా కూటమి నేతలు చేస్తున్న ప్రతీ ఆరోపణల మీద పార్లమెంట్ లో కేంద్రం జవాబు చెబుతుందని అమిత్ షా చెప్పుకొచ్చారు. ఈ విషయంలో రాహుల్ తో పాటు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ రెడీనా అని అమిత్ షా ప్రశ్నించారు.

తీవ్రతరం చేసిన విపక్షం :

ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు తమ నిరసనలు మరింత తీవ్రతరం చేశాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా తప్ప తమకు మరో డిమాండ్ లేదంటున్నాయి. ఈ విషయంలో చర్చ ఎందుకు అంటున్నాయి. ప్రజల మద్దతుని సమీకరించి తాము కేంద్ర ఎన్నికల సంఘం మీద ఉద్యమం చేస్తామని అంటున్నాయి. ఎన్నికల సంఘం ఏకపక్ష విధానాలకు పాల్పడుతోంది అని కూడా మండిపడుతున్నాయి. దీంతో నిరంతరాయంగా నిరసనలకు విపక్షం పిలుపు ఇస్తోంది. ఒక విధంగా ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది అని అంటున్నారు. దాంతోనే పార్లమెంట్ సమావేశాలు పెడతామని కేంద్రం చెబుతోంది. మరి రాహుల్ గాంధీ కేంద్రానికి తమ నిరసనల సెగ గట్టిగానే తెలియచేశారా అన్నది చర్చగా ఉంది. ఎందుకంటే ఏ అంశం మీద అయినా పార్లమెంట్ ని సమావేశపరచాలని విపక్షాలు డిమాండ్ చేస్తాయి. అలాంటిది ఇపుడు ప్రభుత్వమే రెడీ అంటోంది. మొత్తానికి కాంగ్రెస్ ఈ విషయంలో సక్సెస్ అయింది అనే విశ్లేషణలు ఉన్నాయి.

Tags:    

Similar News