ప్రపంచంలో నీ ఆటలు ప్రతిసారీ సాగవు డోనాల్డ్ మామా.. ముఖం మీదే షాకిచ్చిన భారత్

కథేంటంటే.. దశాబ్దాలుగా క్యూబాపై ఆంక్షలు విధించి ఆ దేశాన్ని ఆర్థికంగా ఊపిరాడకుండా చేయడం అమెరికాకు అలవాటుగా మారింది.

Update: 2026-10-30 16:30 GMT

అగ్రరాజ్యం అమెరికా.. అక్కడ అధ్యక్ష పీఠంపై కూర్చునే పెద్దాయన డొనాల్డ్ ట్రంప్ ఏమనుకుంటే అది జరిగిపోవాల్సిందేనా? "మేము గీసిన గీత దాటితే ఒప్పుకోం" అని వాషింగ్టన్ పెద్దలు హుకూం జారీ చేస్తే ప్రపంచదేశాలన్నీ జీహుజూర్ అనాల్సిందేనా? "సారీ మామా.. ఆ సీన్ ఎప్పుడో అయిపోయింది" అని భారత్ నవ్వుతూనే గట్టి షాక్ ఇచ్చింది. అమెరికాతో దోస్తీ భేష్‌గా నడుస్తున్నా.. సార్వభౌమాధికారం.. సొంత దౌత్యనీతి దగ్గరికొచ్చేసరికి "మా దారి రహదారి" అని చాటిచెప్పింది.

కథేంటంటే.. దశాబ్దాలుగా క్యూబాపై ఆంక్షలు విధించి ఆ దేశాన్ని ఆర్థికంగా ఊపిరాడకుండా చేయడం అమెరికాకు అలవాటుగా మారింది. ఈసారి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఈ ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలంటూ ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. సాధారణంగా అమెరికా కన్ను ఎర్రజేస్తే చాలా దేశాలు సైలెంట్‌గా సర్దుకుంటాయి. కానీ భారత్ మాత్రం "అబ్బే.. ఆ ఆంక్షల గోల ఏంటి? క్యూబా ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతారు?" అంటూ తీర్మానానికి మద్దతుగా ఓటు వేసింది.

మొత్తం 193 సభ్య దేశాల్లో ఏకంగా 130 దేశాలు ఆంక్షలకు వ్యతిరేకంగా ఓటేస్తే.. కేవలం 17 దేశాలు మాత్రమే అమెరికా వైపు నిలిచాయి. మరో 25 దేశాలు "మాకెందుకొచ్చిన గొడవ" అని పక్కకు తప్పుకున్నాయి. ఫలితంగా ట్రంప్ సేనకు దెబ్బ అదుర్స్ అనిపించేలా ఫలితం వచ్చింది.

వాణిజ్య ఒప్పందాలు.. రక్షణ భాగస్వామ్యాలు.. వ్యూహాత్మక చర్చలు.. ఇవన్నీ ఒకవైపు నడుస్తున్నా "అమెరికాతో స్నేహం ఉంటే మాత్రం వాళ్లు చెప్పిన ప్రతీ దానికి తలాడించాలా ఏంటి?" అని భారత్ స్పష్టం చేసింది. ఐరాసలో భారత ప్రతినిధి సౌమ్య నాయర్ మాట్లాడుతూ.. ఆంక్షల వల్ల క్యూబాలో 60 శాతం మందుల కొరత ఏర్పడిందని.. ఆహార ఉత్పత్తి సగానికి పడిపోయిందని సామాన్యుల పొట్ట కొట్టడం సరికాదని గట్టిగానే చెప్పారు.

గతంలో రష్యా విషయంలో పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లకు తలొగ్గని భారత్.. ఇప్పుడు క్యూబా విషయంలోనూ అదే స్వతంత్ర వైఖరిని ప్రదర్శించింది. "స్నేహం వేరు.. సార్వభౌమాధికారంతో కూడిన స్వతంత్ర నిర్ణయాలు వేరు" అని వాషింగ్టన్‌కు స్పష్టమైన సందేశం పంపింది. ఐరాస తీర్మానంతో రేపే ఆంక్షలు ఎత్తివేస్తారని గ్యారెంటీ లేకపోయినా.. "ప్రపంచంలో నీ ఆటలు ప్రతిసారీ సాగవు డోనాల్డ్ మామా!" అని అమెరికా ముఖం మీదే చెప్పకనే చెప్పినట్లయింది..

Tags:    

Similar News