బెజ‌వాడ మేయ‌ర్‌: 'భాగ్యం' తక్కువేనమ్మా.. !

కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో బ‌రిలో నిలిచిన ఏబీవీ త‌న ప్ర‌చారాన్ని ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఇది బాగానే వ‌ర్క‌వుట్ అవుతోంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

Update: 2026-10-31 04:36 GMT

విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల బరిలో మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలలో ప్రధానంగా కూటమి (జనసేన-టీడీపీ-బీజేపీ) అభ్యర్థిగా వంగ‌వీటి రాధాకృష్ణ‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు బ‌ల‌ప‌రిచిన స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో బ‌రిలో నిలిచిన ఏబీవీ త‌న ప్ర‌చారాన్ని ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఇది బాగానే వ‌ర్క‌వుట్ అవుతోంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇక‌, జనసేన పార్టీ తరఫున వంగవీటి రాధాకృష్ణ (రాధా) కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సంయుక్తంగా ప్రచారం నిర్వహిస్తూ రాధాకు మద్దతుగా నిలుస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సహా కూటమి అగ్రనేతలు నగరంలోని 86 డివిజన్లలోనూ తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నా రు. కూటమి ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుత మేయర్(మాజీ), వైసీపీ అభ్య‌ర్థి.. రాయన భాగ్యలక్ష్మి గత ఐదేళ్ల తమ హయాంలో నగరంలో దాదాపు రూ. 4,000 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని, వాటి ఆధారంగానే తాము ఓట్లు అడుగుతున్నామని చెబుతున్నారు. కానీ, ర‌హ‌దారులు, తాగునీటి స‌మ‌స్య‌, ఇంటి ప‌ట్టాల వంటి అంశాల‌పై ఆమె ఎప్పుడూ దృష్టి సారించ‌లేద‌న్న విమ‌ర్శ‌లు ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తున్నాయి. వైసీపీ జిల్లా కన్వీనర్ దేవినేని అవినాష్ ప్రచారం నిర్వహిస్తున్నా.. ఇత‌ర నేత‌లు పెద్ద‌గా దూకుడు ప్ర‌ద‌ర్శించ లేక పోతున్నారు. దీంతో భాగ్య ల‌క్ష్మి వెనుక‌బ‌డ్డార‌న్న ప్ర‌చారం ఉంది.

మ‌రోవైపు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నా.. ప్ర‌ధాన పార్టీల‌కు దీటుగా ప్ర‌చారం చేస్తున్నారు. ఈయనకు కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం పార్టీలు, వివిధ ప్రజాసంఘాలు మద్దతు ప్రకటిస్తూ ప్రచారం చేస్తున్నాయి. మాజీ ఉన్నతాధికారిగా ఆయనకున్న ఇమేజ్, అవినీతి రహిత పాలన, విజయవాడ నగర సమగ్ర అభివృద్ధి అనే ఎజెండాతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం, వైఎస్సార్సీపీలు రెండూ నగరాన్ని నిర్లక్ష్యం చేశాయంటూ విమర్శిస్తూ ప్రత్యామ్నాయంగా ఓటర్ల ముందుకు వెళ్తున్నారు.

మొత్తంగా చూస్తే ఈసారి విజయవాడ మేయర్ స్థానానికి వంగవీటి రాధా, వెంక‌టేశ్వ‌ర‌రావుల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు.

Tags:    

Similar News