జ‌య‌ము క‌లిగేనా.. జ‌య‌మంగ‌ళా ..?

వైసీపీ త‌ర‌ఫున మండ‌లిలో సీటు దక్కించుకుని.. త‌ర్వాత ఆ పార్టీకి దూర‌మైన నాయ‌కుడు జ‌య‌మంగ‌ళ వెంక‌టర‌మ‌ణ‌.

Update: 2026-08-12 11:34 GMT

వైసీపీ త‌ర‌ఫున మండ‌లిలో సీటు దక్కించుకుని.. త‌ర్వాత ఆ పార్టీకి దూర‌మైన నాయ‌కుడు జ‌య‌మంగ‌ళ వెంక‌టర‌మ‌ణ‌. బీసీ సామాజిక‌వ ర్గానికి చెందిన ఆయ‌న‌.. టీడీపీతోనే రాజ‌కీయాలు ప్రారంభించారు. గ‌తంలో ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత‌.. ఈ సీటును బీజేపీకి ఇచ్చేయడంతో ఆయ‌న మౌనంగా ఉన్నారు. ఇలా.. 2014, 2024 ఎన్నిక‌ల్లో బీజేపీ ఇక్క‌డ నుంచి విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. 2019లో జ‌య‌మంగ‌ళ‌కు పార్టీ టికెట్ ఇచ్చినా.. ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు.

కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో 2004 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఒకే ఒక్క‌సారి (2009) టీడీపీ విజ‌యం దక్కించుకుంది. అయితే.. అది కూడా జ‌య‌మంగ‌ళ‌తోనే సాధ్య‌మైంది. కానీ, బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న ప్ర‌తి సారీ.. జ‌య‌మంగ‌ళ‌కు శ్రీముఖ‌మే ద‌క్కుతోంది. అందుకే 2014, 2024లో ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌లేదు. ఈ క్ర‌మంలోనే వైసీపీ బాట‌ప‌ట్టారు. అక్క‌డ బీసీ కోటాలో మండ‌లి స్థానం ద‌క్కించుకున్నారు. కానీ, ఎన్నిక‌ల్లో వైసీపీ ప‌రాజ‌యం పాల‌వ‌డం.. టీడీపీలోని పాత మిత్రులు ఆహ్వానించ‌డంతో జ‌య‌మంగ‌ళ సైకిల్ ఎక్కేశారు.

ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు మార‌నున్నాయి. ఇక్క‌డ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. కామినేని శ్రీనివాస‌రావు రాజ‌కీయ రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఎన్నిక ల‌లో తాను పోటీ చేసేది లేద‌న్నారు. దీంతో తాజాగా సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జ్‌ను నియ‌మిస్తామ‌న్నారు. ఈ ప‌రిణామంతో జ‌య‌మంగ‌ళ‌కు జ‌యం క‌లుగుతుంద‌ని.. ఆయ‌న‌ను ఇంచార్జ్ గా నియ‌మించే అవ‌కాశం ఉంద‌ని పెద్ద ఎ త్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. జ‌య‌మంగ‌ళ‌కు అనుకూలంగా ఫ్లెక్సీలు కూడావెలిశాయి.

క‌ట్ చేస్తే.. కామినేని వ్యూహం మ‌రోలా ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. త‌న‌కు క‌లిసి వ‌చ్చిన నియోజ‌క వ‌ర్గం కావ‌డం.. రెండు సార్లు పోటీ చేస్తే.. రెండు సార్లూ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్న క్ర‌మంలో త‌న లెగ‌సీని కాపాడుకునేందుకు.. ఆయ‌న బీజేపీకి ఇక్క‌డ స్థానాన్ని ప‌దిలం చేసేలా ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని స‌మాచారం. అంటే.. త‌న బ‌దులుగా ఆయ‌నే బీజేపీకి చెందిన బ‌ల‌మైన నేత‌ను ప్ర‌తిపాదించే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదే జ‌రిగితే.. మ‌రోసారి బీజేపీకి ఇక్క‌డ టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంది. ఈ ఒక్క స‌మ‌స్య నుంచి జ‌య‌మంగ‌ళ బ‌య‌ట ప‌డితే.. ఆటోమేటిక్‌గా ఆయ‌న‌కు బాధ్య‌త‌లు ద‌క్కుతాయ‌ని చెబుతున్నారు.

Tags:    

Similar News