పార్టీలకు రెబల్స్ బెడద.. తెలంగాణతోనే అయిపోలేదు!
తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ ఎస్ పార్టీ నుంచి గెలిచినా.. తర్వాతకాలంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పార్టీకి అనుకూలంగా మారిపోయారు.
తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ ఎస్ పార్టీ నుంచి గెలిచినా.. తర్వాతకాలంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పార్టీకి అనుకూలంగా మారిపోయారు. అయితే.. వీరిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై మాత్రమే హైకోర్టు, సుప్రీంకోర్టు సీరియస్ అయ్యాయి. ఆయనపై అనర్హత వేటు వేశాయి. ఇక, మిగిలిన 9 మంది ఒక్కరు మాత్రమే తిరిగి బీఆర్ ఎస్‌కు అనుకూలంగా పనిచేస్తుండగా.. మిగిలిన 8 మంది పరిస్థితి ప్రస్తుతం హైకోర్టు పరిధిలో విచారణ దశలో ఉంది. అయితే.. ఈ రెబల్ ఎమ్మెల్యేల బెడద.. ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు. తాజాగా ఈ విషయాన్ని బీజేపీ తరఫున సుప్రీంకోర్టులో దాఖలైన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో 10 మంది టీఎంసీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు.. అధికార బీజేపీకి అనుకూలంగా మారిపోయారు. వారు అధికారికంగానే కండువాలు మార్చుకున్నారు. దీంతో వారిపై వేటు వేయాలని.. అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ.. టీఎంసీ తరఫున పిటిషన్ దాఖలైంది. వాస్తవానికి ఈ విషయాన్ని స్పీకర్ పరిశీలనలో కూడా పెట్టారు. కానీ, స్పీకర్ దీనిపై మౌనంగా ఉన్నారు. మరో 44 మంది ఎమ్మెలు .. తమదే టీఎంసీ అని పేర్కొంటున్నారు. మొత్తంగా ఆ పది మందిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా బీజేపీ తరఫున దాఖలైన అఫిడవిట్‌లో దేశవ్యాప్తంగా అభివృద్ధి దిశగా ఎమ్మెల్యేలు అడుగులు వేస్తున్నారని పేర్కొంది. దీనిని ఫిరాయింపులుగా చూడరాదని తెలపడం గమనార్హం.
ఈ సందర్భంగా తమిళనాడు ఉదంతాన్ని కూడా బీజేపీ వివరించింది. తమిళనాడులో కూడా.. అన్నాడీఎంకే తరఫున ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార టీవీకేలో చేరారని బీజేపీ తెలిపింది. అయితే.. వారు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయని వివరించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని.. ఆ కేసులు ప్రస్తుతం హైకోర్టు పరిదిలో ఉన్నాయని.. అయినా.. రెబల్స్ బెడద రాష్ట్రాలను కుదిపివేస్తోందని పేర్కొంది. అంతగా అభివృద్ధి వైపు మొగ్గు చూపాలని అనుకుంటే.. ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవుల ద్వారా చేయొచ్చు కదా! అని వ్యాఖ్యానించింది.
ప్రజల తీర్పును ధిక్కరించడమే..
ఒక పార్టీ తరఫున గెలిచి.. మరో పార్టీలోకి జంప్ చేయడం అంటే.. ప్రజలు ఇచ్చిన తీర్పును ధిక్కరించడమే అవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనిని పరిష్కరించేందుకు స్పీకర్‌లు నిర్ణయాలు తీసుకోవాలని.. న్యాయ వ్యవస్థ జోక్యాన్ని తగ్గిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. స్పీకర్లు రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నారన్న సుప్రీంకోర్టు.. వారు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటే.. సమస్యలు క్షేత్రస్థాయిలో పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది.