గెజిట్ వచ్చేసింది.. ఖైరతాబాద్ ఖాళీనా.. డిస్‌క్వాలిఫైనా?!
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయిందని పేర్కొంటూ.. తెలంగాణ అసెంబ్లీ అధికారికంగా ప్రకటించింది.
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయిందని పేర్కొంటూ.. తెలంగాణ అసెంబ్లీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీ కార్య దర్శి తిరుపతి తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 26నే గెజిట్ విడుదల చేసినట్టు పేర్కొన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం ఖాళీ అయిందని.. దీనిని అధికారికంగా స్పీకర్ గుర్తించారని దీనిలో పేర్కొన్నారు. అయితే.. దీనిలో కీలకమైన పదాన్ని వాడారు. ``తెలంగాణ అసెంబ్లీ.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానంనాగేందర్‌ను డిస్‌క్వాలిఫై(అనర్హుడు) చేసింది.`` అని తెలిపారు. వాస్తవానికి ఖాళీ కావడం వేరు.. డిస్‌క్వాలిఫై చేయడం వేరు. దీంతో ఈవ్యవహారం ఆసక్తిగా మారింది.
ఖాళీ కావడం అంటే.. సదరు ఎమ్మెల్యే రాజీనామా చేయడం.. లేదా అనారోగ్య, ఇతర కారణాలతో మృతి చెందిన సమయంలో దానిని ఖాళీగా పేర్కొంటూ.. ఎన్నికల సంఘమే నోటిఫికేషన్ జారీ చేస్తుంది. కానీ, దానం కేసులో `డిస్‌క్వాలిఫై` అని అసెంబ్లీ కార్యదర్శి ఈ గెజిట్‌లో పేర్కొన్నారు. తొలి వాక్యంలో ఖాళీ అంటూనే.. మధ్యలో దీనిని దానం డిస్‌క్వాలిఫై అని పేర్కొన్నారు. ఖాళీ అయితే.. తిరిగి దానం పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా.. అసెంబ్లీ కార్యదర్శి పేర్కొన్న మేరకు.. డిస్‌క్వాలిఫై అయితే.. తదుపరి స్పీకర్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుంది? ఎన్నికల సంఘం ఏం చేస్తుందన్నది చూడాలి.
గెలుపు వ్యూహాలు..
మరోవైపు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్‌లు.. తాజాగా గెజిట్ ప్రకటన వచ్చిన దరిమిలా గెలుపు వ్యూహాలపై మంతనాలు ప్రారంభించాయి. అయితే.. కాంగ్రెస్‌లో మాత్రం `డిస్ క్వాలిఫై`పై చర్చ సాగుతోంది. ఇదే నిర్ధారణ అయితే.. దానం ప్లేస్‌ను మరొకరికి ఇవ్వక తప్పదు. అలాకాకుండా.. స్పీకర్ నిర్ణయం(వాస్తవానికి ఇది స్పీకర్ నిర్ణయమే) వేరేగా ఉంటే.. అప్పుడు దానంకు అవకాశం ఉంటుంది. దీంతో ఈ విషయంపై కాంగ్రెస్‌తర్జన భర్జన పడుతుండగా.. బీఆర్ ఎస్ పార్టీలో మాత్రం మొత్తంగా ఉప ఎన్నిక ఖాయమైందన్న సంతోషంతో పాటు.. గెలుపు వ్యూహాలపై రేపటి నుంచి రెండు రోజుల పాటు.. మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో నాయకులు చర్చించనున్నారు.