నియోజకవర్గాల పునర్విభజన ఉన్నా.. ఏపీలో జరిగేది ఇదే.. !
రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తరచుగా చర్చలు జరుగుతున్నాయి. కానీ, ఈ కార్యక్రమం కేంద్రం చేతిలో ఉంది.
రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తరచుగా చర్చలు జరుగుతున్నాయి. కానీ, ఈ కార్యక్రమం కేంద్రం చేతిలో ఉంది. ప్రస్తుతం కేంద్రం కూడా దీనిని తీవ్రంగా పరిశీలిస్తోంది. అయితే.. మహిళా రిజర్వేషన్‌కు.. పునర్విభజనకు ముడి పెట్టడంతో రాజకీయంగా ఇబ్బందులు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 175 నియోజక వర్గాలు ఉన్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం.. 50 శాతం నియోజకవర్గాలు పెంచితే.. మరో 86 నియోజకవర్గాలు పెరగనున్నాయి. ఒకవేళ ఇన్ని పెరిగినా.. ప్రత్యేకంగా ఒరిగేది ఏముంటుందన్న చర్చ సాగుతోంది.
పెరిగితే ఏం జరుగుతుంది ..?
అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తవి ఏర్పడటంతో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారుతుంది. జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య పెరిగి, నాయకులకు ప్రజలతో మమేకమయ్యే అవకాశం మెరుగవుతుంది.ఆశావహులకు అవకాశం వస్తుంది. కొత్త సీట్లు పుట్టుకొస్తే ఎక్కువ మంది కొత్త నాయకులకు, యువతకు పోటీ చేసేందుకు రాజకీయ అవకాశాలు లభిస్తాయి. అభివృద్ధి వికేంద్రీకరణకు కూడా అవకాశం ఉంటుందన్న అంచనాలు వున్నాయి. నియోజకవర్గాల పరిధి తగ్గడం వల్ల ప్రజా ప్రతినిధులు సమస్యలను మరింత లోతుగా పరిశీలించి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయవచ్చు.
ఇక, మహిళా రిజర్వేషన్లు కూడా అమల్లోకి రానున్నాయి. రాబోయే ఎన్నికల నాటికి చట్టసభల్లో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ల అమలుకు కూడా ఇది మార్గం సుగమం చేస్తుంది. దీనికితోడు వచ్చే ఎన్నికల్లో రిజర్వేషన్లు ఉన్నా.. లేకున్నా.. తాము మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని టీడీపీప్రకటించింది. ఇదే పంథాలో బీజేపీ కూడా అడుగులు వేయనుంది. ఇక, జనసేన మాత్రం మౌనంగా ఉంది. వైసీపీలోనూ ఈ తర హా చర్చ ఉన్నా.. ఇతమిత్థంగా ప్రకటన అయితే చేయలేదు. ఆది నుంచి తాము మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు వైసీపీ పేర్కొంటోంది.
మొత్తంగా నియోజకవర్గాల పెంపు జరిగినా.. రాజకీయాల్లో పెద్దగా మార్పు ఉండదని.. కొత్త నేతలు మాత్రమే వస్తారని అంటున్నారు. ఓటర్ల సంఖ్య పెరగదు. కేవలం బౌండరీలు మాత్రమే మారనున్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక వర్గాల ప్రభావం తగ్గుముఖం పడుతుందా? లేక పెరుగుతుందా? అనేది చూడాలి. ఇక, ధనవంతులు మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నారన్న వాదనకు నియోజకవర్గాల పెంపు వ్యవహారం కొంత వరకు బ్రేక్ చేసే అవకాశం ఉంది. మొత్తంగా నియోజకవర్గాల పెంపుతో భారీ మార్పులు చోటు చేసుకోకపోయినా.. కొత్త ముఖాలు రావడంతోపాటు.. కొంత వరకు మహిళలకు అవకాశం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.