కారు కొని అల్లాడుతున్నారా? వినియోగదారుల కమిషన్ తీర్పు.. ఆటోమొబైల్ కంపెనీలకు గట్టి గుణపాఠం!
కర్నూలుకు చెందిన ఒక కస్టమర్ ఎంతో ఆశగా కొత్త కారును కొనుగోలు చేశారు. అయితే కారు చేతికి వచ్చిన కొంతకాలానికే వాహనంలో సాంకేతిక, తయారీ లోపాలు బయటపడ్డాయి.
కొత్త కారు కొనుగోలు చేయడం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక తీపి జ్ఞాపకం.. ఎంతో ఆనందాన్ని ఇచ్చే క్షణం. అయితే కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసిన కారు పదేపదే మరమ్మతులకు గురైతే షోరూమ్ చుట్టూ సర్వీస్ సెంటర్ల చుట్టూ తిరగలేక వినియోగదారులు పడే నరకం అంతా ఇంతా కాదు. సరిగ్గా ఇలాంటి తీవ్రమైన మానసిక వేదనను అనుభవించిన ఒక కారు యజమానికి కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పు కొండంత అభయాన్నిచ్చింది. వినియోగదారుడికి అనుకూలంగా వెలువడిన ఈ సంచలన తీర్పు.. బాధ్యతారహితంగా వ్యవహరించే ఆటోమొబైల్ కంపెనీలకు గట్టి హెచ్చరికలా మారింది.
కర్నూలుకు చెందిన ఒక కస్టమర్ ఎంతో ఆశగా కొత్త కారును కొనుగోలు చేశారు. అయితే కారు చేతికి వచ్చిన కొంతకాలానికే వాహనంలో సాంకేతిక, తయారీ లోపాలు బయటపడ్డాయి. లోపాలను సరిదిద్దాలంటూ సదరు యజమాని పలుమార్లు సర్వీస్ సెంటర్‌ను ఆశ్రయించినప్పటికీ.. సమస్య పదేపదే ఉత్పన్నమైంది. సర్వీస్ సెంటర్ నిర్లక్ష్యం, నాసిరకం సేవలతో తీవ్ర మనోవేదనకు గురైన కస్టమర్.. చివరికి తన హక్కుల రక్షణ కోసం కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్ తలుపు తట్టారు.
ఈ కేసును కూలంకషంగా విచారించిన వినియోగదారుల కమిషన్.. కంపెనీ సేవల్లో లోపం ఉన్నట్లు స్పష్టంగా గుర్తించింది. కస్టమర్ అనుభవించిన మానసిక వేదనను, సమయ వృథాను తీవ్రంగా పరిగణించిన కమిషన్ కీలక ఆదేశాలను జారీ చేసింది. కారు కొనుగోలుకు అయిన పూర్తి మొత్తం డబ్బును వినియోగదారుడికి తిరిగి చెల్లించడంతో పాటు, సేవా లోపం, కస్టమర్‌కు కలిగించిన తీవ్ర మానసిక వేదనకు గాను రూ.1 లక్ష అదనపు పరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది. దీంతో కారు రీఫండ్ విలువ , పరిహారం కలిపి మొత్తంగా రూ.10 లక్షలకు పైగా ప్రయోజనం సదరు బాధితుడికి దక్కనుంది. కేవలం ఉచిత మరమ్మతులు చేసి చేతులు దులిపేసుకోవడం కాకుండా తయారీ లోపాలు ఉన్నప్పుడు వాహనం కొనుగోలు మొత్తాన్ని రీఫండ్ చేయాలని ఆదేశించడం వినియోగదారుల హక్కుల పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలుస్తుంది.
ఈ తీర్పు కేవలం ఒక్క కారు యజమానికి మాత్రమే సంబంధించింది కాదు. కార్లు అమ్మడమే ధ్యేయంగా పెట్టుకుని, విక్రయం తర్వాత ఇచ్చే ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ విషయంలో నిర్లక్ష్యం వహించే ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థలకు, డీలర్లకు ఇది ఒక గట్టి హెచ్చరిక. కస్టమర్ డబ్బుకు విలువ ఇవ్వకపోతే చట్టపరమైన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.
ఒకవేళ మీ కొత్త వాహనంలో కూడా పదేపదే లోపాలు వస్తుంటే చట్టపరంగా విజయం సాధించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరి. ప్రతిసారి కారు సర్వీస్ సెంటర్‌కు ఇచ్చినప్పుడు జాబ్ కార్డును తప్పకుండా తీసుకోవాలి. షోరూమ్ సిబ్బందితో కేవలం నోటి మాటగా కాకుండా ఇమెయిల్స్, అధికారిక ఫిర్యాదు నంబర్ల ద్వారా సంప్రదించాలి. పేమెంట్ రసీదులు, రిపేర్ బిల్లులు, కారులో ఉత్పన్నమయ్యే సమస్యలను తెలిపే ఫోటోలు, వీడియోలను భద్రపరుచుకోవాలి. అలాగే కారులో సమస్య ఎన్నిసార్లు వచ్చింది.. ఎన్ని రోజులు సర్వీస్ సెంటర్‌లో ఉందనే వివరాల హిస్టరీని డాక్యుమెంట్ రూపంలో నమోదు చేయాలి. కార్ల యజమానులుగా మన హక్కులపై అవగాహన కలిగి ఉండటం ఎంత ముఖ్యమో.. ఆధారాలను సరిగ్గా భద్రపరుచుకోవడం కూడా అంతే అవసరమని కర్నూలు కమిషన్ తీర్పు నిరూపించింది.