మావిగన్ తో పందెం...అమరావతికి దూరం
వైసీపీ ఆలోచనలు గతానికి కంటే కొంత మారుతున్నాయి. కానీ అదే సమయంలో అమరావతి రాజధానికి బహు దూరంగా ఉంటున్నాయి.
వైసీపీ ఆలోచనలు గతానికి కంటే కొంత మారుతున్నాయి. కానీ అదే సమయంలో అమరావతి రాజధానికి బహు దూరంగా ఉంటున్నాయి. 2014లో విపక్ష నేతగా జగన్ ఉన్నపుడు అమరావతి రాజధానికి మద్దతు తెలిపారు అని టీడీపీ నేతలు ఇప్పటికీ చెబుతారు. అయితే తాము ప్రభుత్వం భూములలోనే రాజధాని నిర్మించాలని కోరుకున్నామని అంతే తప్ప ప్రైవేటు భూములు వేల ఎకరాలు తీసుకుని అవినీతి అక్రమాలు చేయమని చెప్పలేదని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే అమరావతి రాజధాని విషయంలో మాత్రం వైసెపీ ఈ రోజుకీ క్లారిటీ ఇవ్వడం లేదు. మరి దీని వల్ల మేలు జరుగుతుందా లేక కీడు జరుగుతుందా అన్నదే ఆ పార్టీలో తర్జన భర్జన గా ఉంది.
మావిగన్ అంటూ :
ఇక మూడు రాజధానుల నినాదాన్ని 2024 ఎన్నికల తరువాత వైసీపీ అటకెక్కించేసింది అనే చెప్పాలి. ఆ ఊసే తలవడం లేదు. ప్లాన్ ఏ గా విశాఖను రాజధాని చేయమన్నాం, కాదన్నారు, ప్లాన్ బీ అని మావిగాన్ చెప్పాం దానికి అయినా అంగీకరించాలి కదా అని జగన్ ఏప్రిల్ 1న నిర్వహించిన ప్రెస్ మీట్ లో చెప్పారు. అంటే ప్లాన్ ఏ ని వైసీపీ కూడా వదిలేసినట్లుగానే భావించాలని అంటున్నారు. ఇపుడు మరోసారి తాజా ప్రెస్ మీట్ లో జగన్ మావిగన్ ప్రస్తావన తెచ్చారు. మావిగన్ అంటే టీడీపీ నేతలకు భయం అని కూడా వ్యాఖ్యానించారు. అమరావతి పేరుతో అవినీతి చేస్తున్నారని ఎప్పటికీ ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారు అని కూడా చంద్రబాబు మీద జగన్ విమర్శలు గుప్పించారు.
మావిగన్ తోనే అంతా :
అమరావతి అవినీతి అక్రమాల పుట్ట అని జగన్ మరోసారి గట్టిగానే సౌండ్ చేశారు. అక్కడ చదరపు అడుగుకు ఎంత ఖర్చు చేస్తున్నారో కూడా లెక్కలు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఖర్చు చేస్తున్నారని కూడా మండిపడ్డారు. ఆ విధంగా అమరావతిలో అవినీతి జరుగుతోందని చెప్పడం ద్వారా ఏపీ ప్రజలకు అక్కడ జరుగుతోంది అభివృద్ధి కాదని విచ్చలవిడి దోపిడీ అని చాటి చెప్పాలన్నదే వైసీపీ అధినేత ఆలోచనగా కనిపిస్తోంది అని అంటున్నారు. అదే సమయంలో మావిగన్ అన్నది జగన్ మరచిపోలేదని గుర్తు చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే మచిలీపట్నం, విజయవాడ గుంటూరులను అభివృద్ధి చేస్తామని జగన్ చెప్పదలచారు అని అంటున్న్నారు. దీని వల్ల అమరావతి ప్రాంతంలో ప్రతికూలత వచ్చినా మిగిలిన మొత్తం ఏపీ అంతా సానుకూలత వైసీపీకి వస్తుందని జగన్ భావిస్తున్నారు అని అంటున్నారు.
సెంటిమెంట్ ఉంటే కనుక :
సాధారణంగా రాజధాని అన్నది సెంటిమెంట్ గా ఉంటుంది. ఏపీ ప్రజల విషయానికి వస్తే అది దశాబ్దాల కోరిక. అసలు ఏపీకి రాజధాని అంటూ పర్మనెంట్ గా ఎపుడూ లేదన్న బాధ కూడా ప్రజలలో ఉంది. దాంతో అమరావతి అన్నది తమకు ఒకటి తయారు అవుతోందని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ అవినీతి అక్రమాలు అని వైసీపీ ఎంత చెప్పినా జనాలకు అవి చేరువ అవుతాయా వారు పట్టించుకుంటారా అన్నది కూడా మరో చర్చగా ఉంది. అంతే కాదు వైసీపీ ఎన్నిక ఎన్నికకూ రాజధాని మీద తన స్టాండ్ మార్చుకుంటూ పోతే అది ఆ పార్టీని ఏ విధంగా మేలు చేస్తుంది అన్నది కూడా మరో చర్చగా ఉంది. అయితే వైసీపీ మాత్రం మావిగన్ మీదనే భారీగా పందెం కాసింది. అది మరి 2029 ఎన్నికల్లో ఆ పార్టీకి ఏ రకమైన ఫలితం ఇస్తుందో వేచి చూడాల్సిందే అని అంటున్నారు.