కమాన్ కామ్రేడ్... కొత్త జట్టు కట్టే వైసీపీ వ్యూహం ?
ఒకటి ఒంటరి అంకె మాదిరిగా వైసీపీ ఏపీ రాజకీయాల్లో సోలో ఫైట్ ఇస్తూ వస్తోంది. విపక్షంలో ఉన్న వైసీపీ ఇతర ప్రతిపక్షాలతో కలసి కూటమిని కట్టే ప్రయత్నం చేయడం లేదు.
ఒకటి ఒంటరి అంకె మాదిరిగా వైసీపీ ఏపీ రాజకీయాల్లో సోలో ఫైట్ ఇస్తూ వస్తోంది. విపక్షంలో ఉన్న వైసీపీ ఇతర ప్రతిపక్షాలతో కలసి కూటమిని కట్టే ప్రయత్నం చేయడం లేదు. దానికి కారణం కాంగ్రెస్ అంటే మొదటి నుంచి పొడ గిట్టని వ్యవహారంగా వైసీపీకి ఉంది. ఇక వామపక్షాల విషయంలో వైసీపీ వైఖరి కూడా అలాగే ఉంది అని అంటున్నారు. నిజానికి ప్రజా సమస్యల విషయంలో వామపక్షాలు దూకుడుగానే ఉంటాయి. వారి అజెండా జెండా అన్నీ జనం కోసమే అంటూ సాగుతాయి. అధికారంలో ఎవరు ఉన్నా కానీ వారి పోరాటం ఆగదు, ఇక అధికారంలో ఉన్నప్పుడు సంగతేమో కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు మాత్రం వామపక్షాలతో చేతులు కలిపి ముందుకు సాగుతాయి. తమ ఉద్యమాలను మరింతగా గట్టిగా చేసేందుకు ఎర్రన్నల బలాన్ని కూడా వాడుకుంటాయి. అయితే వైసీపీ మాత్రం ఈ విషయంలో భిన్న వైఖరితోనే ముందుకు సాగుతూ వస్తోంది.
కలసి వచ్చే శక్తులతోనే :
ఇక వైసీపీ ఇన్నాళ్ళూ ఒంటరి పోరాటం చేసింది. కానీ మూడు పార్టీలతో బలంగా ఉన్న టీడీపీ కూటమిని ఇరకాటంలో పెట్టాలన్నా తమ ఉద్యమ వేడి జనాలకు మరింత బలంగా తాకాలన్నా అందుబాటులో ఉన్న శక్తులను కలుపుకుని పోవడం మేలైన రాజకీయ వ్యూహం అని వైసీపీ ఇన్నాళ్ళకు భావిస్తోంది. నియోజకవర్గం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ఇదే వ్యూహాన్ని అనుసరించాలని ఆ పార్టీ అనుకుంటోంది. ఈ మేరకు వైసీపీ సరికొత్త వ్యూహంతో ముందుకు రాబోతోంది అని అంటున్నారు.
అది ఇబ్బందిగా ఉంటోంది :
ఏపీలో వైసీపీ పెద్ద పార్టీ. విపక్షంలో కూడా నలభై శాతం ఓటు షేర్ ఉన్న పార్టీ. అయితే వైసీపీ ఒంటరిగా ఉద్యమాలు చేసి సక్సెస్ కావచ్చేమో కానీ జనంలో ఆ ఇంపాక్ట్ చూస్తే ఒంటరి అన్నది ఎక్కువగా వినిపించే మాట. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఒంటరిగా వైసీపీ ఎదుర్కోగలదు అన్నది పార్టీకి విశ్వాసం ఉన్నా జనంలో ఆ ధీమా రావాలీ అంటే అందరినీ కలుపుకుని పోవాలని వైసీపీ కొత్త ఆలోచనలు చేస్తోంది అని అంటున్నారు. అందుకే వామపక్షాల వైపు వైసీపీ చూపు పడింది అని అంటున్నారు.
ఎవరి దోవ వారిది అన్నట్లు :
ఏపీలో ప్రభుత్వం మీద చేస్తున్న ఉద్యమాలు అన్నీ వైసీపీ ఒంటరిగా చేస్తోంది, వామపక్షాలు విడిగా చేస్తున్నాయి. ఇష్యూ ఒకటే అయినా విడిగా చేయడం వల్ల ఇంపాక్ట్ అనుకున్న స్థాయిలో రావడం లేదని వైసీపీ గ్రహించింది అని అంటున్నారు. అంతే కాదు కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న వైసీపీ లక్ష్యం కూడా పూర్తి స్థాయిలో నెరవేరడం లేదని అంటున్నారు. అందుకే వైసీపీ ఇపుడు కామ్రేడ్స్ వైపు చూస్తోంది అని అంటున్నారు. కలసి ఉద్యమాలు చేస్తే కలసి వేదికలు పంచుకుంటే ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్ లో ఉంటుందని వైసీపీ లెక్క కడుతోంది అని అంటున్నారు.
కామన్ అజెండాతోనే :
ఏపీలో సర్ ప్రక్రియ మీద వైసీపీది ఒంటరి పోరు అవుతోంది. తమ సానుభూతిపరుల ఓట్లు తీసేయించేస్తున్నారు అని విమర్శలు చేస్తోంది కానీ గట్టిగా దాని మీద పోరాటాలు లేవు, వామపక్షాలు సైతం సర్ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో ఈ అజెండాతో వారిని కూడా పక్కన పెట్టుకుని ఉద్యమించాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. అలాగే రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద అలాగే విద్యుత్ చార్జీల మీద నిరుద్యోగం మీద సంక్షేమ పధకాల అమలు తీరు మీద ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి అంటే కచ్చితంగా కామ్రేడ్స్ తో కలసి అడుగులు వేయడం మేలు అన్నదే వైసీపీ సరికొత్త వ్యూహం అని అంటున్నారు. దాంతో మెల్లగా ప్రజా పోరాటాల ద్వారా వామపక్షాలతో చేతులు కలిపితే అది ఎన్నికల నాటికి ఏ రూపం దాలుస్తుంది అన్నది చూడాల్సి ఉంది. పొత్తుల దాకా ఈ స్నేహాలు వెళ్తే ఏపీలో కూటముల మధ్య పోరుని 2029 లో అంతా చూడొచ్చు అని అంటున్నారు.