మీ మార్ట్...పేదల కోసం కూటమి కీలక నిర్ణయం
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ కాలంలో పలు సంక్షేమ పధకాలను అమలు చేస్తోంది. సామాజిక పెన్షన్లను కూడా పెద్ద ఎత్తున పెంచింది.
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ కాలంలో పలు సంక్షేమ పధకాలను అమలు చేస్తోంది. సామాజిక పెన్షన్లను కూడా పెద్ద ఎత్తున పెంచింది. నెలకు నాలుగు వేల రూపాయలు ఇవ్వడం అంటే దేశంలో ఎక్కడా లేని విధనానం. అంతే కాదు దివ్యాంగులు ఇతర కేటగిరీల పెన్షన్ అయితే ఏకంగా 15 వేల రూపాయలు నెలకు ఇస్తోంది. ఇలా ఏటా సామాజిక పెన్షన్ల కోసం బడ్జెట్ నుంచి వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వం కూడా కూటమిదే అని చెప్పాల్సి ఉంది. అదే సమయంలో ఉచిత బస్సుతో పాటు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రతీ ఇంటికీ అందించడం వంటివి కూడా కూటమి ప్రభుత్వం ఘనతలలో ఉన్నాయి.
రేషన్ దుకాణాలలో సైతం :
కూటమి ప్రభుత్వం రేషన్ దుకాణాలలో కూడా గణనీయమైన మార్పులు తీసుకుని వచ్చింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో రోడ్డు మీద ఎక్కడో వాహనాలు నిలిపి తలో టైంలో రేషన్ ఇచ్చేవారు. దాంతో చాలా మందికి అందేది కాదు, దాన్ని దృష్టిలో ఉంచుకుని తిరిగి రేషన్ దుకాణాలలోనే రేషన్ అందేలా అది కూడా నెలలో పదిహేను రోజులు కచ్చితమైన సమయంలో అందించడం కూడా మంచి నిర్ణయంగా అంతా భావిస్తున్నారు. బియ్యం తో పాటు గోధుమలు ఇతర వస్తువులను రేషన్ దుకాణాలలో ఇప్పటికే సరఫరా చేస్తున్న ప్రభుత్వం ఇపుడు ఏకంగా మీ మార్టుల పేరుతో సరికొత్తగా వాటిని తీర్చిదిద్దుతోంది.
ఆధునిక సూపర్ మార్కెట్లుగా :
రేషన్ దుకాణాలను సరికొత్త సూపర్ మార్కెట్లుగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం చూస్తోంది. ఈ క్రమంలో మీ మార్ట్ పేరుతో పైలెట్ ప్రాజెక్ట్ ని ప్రారంభించింది. దీనిని టాగ్ లైన్ గా మీ మార్టు-_నీది నాది మనందరిది అని పెట్టారు. గుంటూరు జిల్లాలో ప్రారంభించిన ఈ పైలెట్ ప్రాజెక్ట్ ని తొందరలో ఏపీ అంతటా విస్తరించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ కి వచ్చే ఆదరణను దృష్టిలో ఉంచుకుని మరిన్ని మార్పులు చేర్పులు చేస్తారు అని అంటున్నారు
250 రకాల నిత్యావసర సరుకులు :
ఇక ఈ మీ మార్టుల ద్వారా ఏకంగా 250 రకాల నాణ్యమైన నిత్యావసర సరుకులని ప్రజలకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే కాదు బహిరంగ మార్కెట్ కంటే ప్రతి వస్తువుపై అయిదు రూపాయలు వరకూ తక్కువ ధరకే విక్రయం చేయడం మీ మార్టుల స్పెషాలిటీగా ఉంటుంది. ఇక మంచి బియ్యంతో పాటు నిత్యం వాడే దాదాపు ప్రజలకు అవసరం అయ్యే అన్ని రకాల సరుకులను అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో మొదటి దశలో వేయికి పైగా రేషన్ షాపులని మీ మార్టులుగా మార్పు చేస్తారు. అందులో ప్రస్తుతం 553 షాపులు తక్షణం ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇక గుంటూరు జిల్లా లాలుపురంలో తొలి మీ మార్ట్ ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు.
వారే లక్ష్యంగా :
నానాటికీ పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పేదలు మధ్యతరగతి వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. వారికి నాణ్యమైన నిత్యావసరాలను తక్కువ ధరకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదే విధంగా రేషన్ దుకాణాలు అంటే కేవలం కోటా బియ్యం మాత్రమే ఇచ్చేవి కాకుండా సూపర్ మార్కెట్లుగా విస్తృతమైన తీరులో సేవ చేయాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. దాని వల్ల రేషన్ డీలర్లకు కూడా లబ్ది చేకూరుతుంది అని భావిస్తోంది. ఇలా రెండిందాల మేలు జరిగేలా మీ మార్ట్ వ్యవస్థను ముందుకు తీసుకుని వస్తున్నారు. ఇది సక్సెస్ అవుతుందని ప్రభుత్వం నమ్మకంగా ఉంది.