భారత్ ఘోర ఓటమి.. సంజూకు అన్యాయం.. గంభీర్‌ను తొలగించాలని డిమాండ్
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఎదుర్కొన్న ఘోర పరాజయం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఎదుర్కొన్న ఘోర పరాజయం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పటిష్టమైన టీమిండియా అన్ని విభాగాల్లోనూ చేతులెత్తేయడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తీసుకుంటున్న నిర్ణయాలే ఈ ఘోర ఓటమికి ప్రధాన కారణమంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ప్రయోగాల పేరుతో జట్టును బలహీనపరుస్తున్నారా?
ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌కు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు అభిమానులను మరింత అసహనానికి గురిచేశాయి. మంచి ఫామ్‌లో ఉన్న తిలక్ వర్మ కంటే ముందుగా అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్‌కు పంపడం ఏ రకమైన వ్యూహమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఫాంలో ఉన్న దూబేను చివర్లో పంపడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
కీలక సమయంలో అనుభవజ్ఞులైన బ్యాటర్లను సరైన స్థానాల్లో వినియోగించకపోవడం వల్లే భారత జట్టు తక్కువ పరుగులకే పరిమితమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. జట్టు ఎంపికలో ఎలాంటి స్పష్టమైన ప్రణాళికలు కనిపించడం లేదని, ప్రయోగాల పేరుతో టీమిండియా బలహీనపడుతోందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై ప్రశ్నలు
మరోవైపు కెప్టెన్‌గా, బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ ప్రదర్శన కూడా తీవ్ర విమర్శల పాలవుతోంది. మైదానంలో జట్టును సమర్థవంతంగా నడిపించడంలో బౌలర్లను సరైన రీతిలో ఉపయోగించుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. బ్యాటింగ్‌లోనూ కీలక సమయంలో తక్కువ పరుగులకే అవుట్ కావడం జట్టును మరింత కష్టాల్లోకి నెట్టింది. దీంతో కోచ్ గంభీర్, సెలక్టర్ అగార్కర్‌లతో పాటు అయ్యర్ కెప్టెన్సీపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సంజూ శాంసన్ వివాదంపై కోచ్ గంభీర్ వివరణ
భారత టీ20 జట్టు నుండి వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను తప్పించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ వివాదంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తాజాగా స్పందించారు. "సంజూ శాంసన్‌తో నేను మాట్లాడిన మాటలు పూర్తిగా మా ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత చర్చ. ఆ వివరాలను బహిరంగంగా వెల్లడించడం సరైంది కాదు. జట్టులో ఆటగాళ్ల ఎంపిక అనేది పూర్తిగా వారి ప్రస్తుత ఫామ్, ఆ సమయానికి జట్టుకు ఉన్న అవసరాలను బట్టి మాత్రమే జరుగుతుంది." అని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపారు.
సంజూ ప్రతిభపై తమకు ఎలాంటి సందేహం లేదని, ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, అతను త్వరలోనే తిరిగి తన ఫామ్‌ను అందుకుని జట్టులోకి వస్తాడనే నమ్మకం తమకు ఉందని గంభీర్ పేర్కొన్నారు. ప్రతి ఆటగాడికి అవకాశాలు వస్తాయని, వాటిని ఎలా వినియోగించుకోవాలన్నదే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.
స్థిరమైన జట్టు కావాలంటున్న అభిమానులు
వరుస ప్రయోగాల కంటే స్థిరమైన జట్టు కూర్పు, స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు సూచిస్తున్నారు. ఈ ఘోర పరాజయం తర్వాత సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో భారత్ ఎలా పుంజుకుంటుందో, కోచ్ గంభీర్, కెప్టెన్ అయ్యర్ ఎలాంటి మార్పులతో బరిలోకి దిగుతారో వేచి చూడాలి.