ఇదేం తొండి ఆటరా బై.. ఇంగ్లండ్ టీమ్‌కు చుక్కలు చూపిస్తున్న ఫ్యాన్స్

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరడం అంటే మాటలా? అందుకే మైదానంలో ఆటగాళ్లు చెమటోడ్చక ముందే.. బయట అభిమానులు తమ "కళాపోషణ" మొదలుపెట్టేశారు.

Update: 2026-07-06 03:37 GMT

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరడం అంటే మాటలా? అందుకే మైదానంలో ఆటగాళ్లు చెమటోడ్చక ముందే.. బయట అభిమానులు తమ "కళాపోషణ" మొదలుపెట్టేశారు. ఇంగ్లండ్, మెక్సికో జట్ల మధ్య జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు మెక్సికో ఫ్యాన్స్ సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. అదేంటో తెలుసా? "మేము పడుకోం.. మిమ్మల్ని పడుకోనివ్వం!" ఇంగ్లండ్ ఆటగాళ్లు హాయిగా ఏసీ రూముల్లో దుప్పటి ముసుగెట్టి పడుకుందామనుకునే సమయానికి, మెక్సికో అభిమానులు వారి హోటల్ వెలుపల ప్రత్యక్షమయ్యారు. ఇక అక్కడి నుంచి మొదలైంది అసలు సినిమా.

హోటల్ బయట 'సౌండ్ పొల్యూషన్'.. క్రీడాస్ఫూర్తికి ఐసీయూ

మ్యాచ్ గెలవాలంటే మైదానంలో టాక్టిక్స్ మార్చాలి, పాస్‌లు కరెక్ట్‌గా ఇవ్వాలి, గోల్స్ కొట్టాలి. కానీ మెక్సికో ఫ్యాన్స్ మాత్రం "అవన్నీ పాత పద్ధతులు.. ప్రత్యర్థికి నిద్ర లేకుండా చేస్తే వాళ్లే అలసిపోయి మ్యాచ్ ఓడిపోతారు" అనే వినూత్న సూత్రాన్ని నమ్ముకున్నట్టున్నారు. అర్ధరాత్రి వేళ హోటల్ బయట బ్యాండ్ మేళాన్ని మించి డ్రమ్స్ వాయించడం. గొంతు చించుకుని మరి ఇంగ్లండ్ జట్టుకు వ్యతిరేకంగా స్లోగన్స్ అందుకోవడం... రాత్రి పూట ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో అకస్మాత్తుగా ఫైర్‌క్రాకర్లు (బాంబులు) పేల్చి ఇంగ్లండ్ ఆటగాళ్లను ఉలిక్కిపడేలా చేయడం చేస్తున్నారు. పాపం, ఇంగ్లండ్ టీం "రేపటి మ్యాచ్‌లో ఏ స్ట్రాటజీ వాడాలి?" అని ఆలోచిస్తూ నిద్రపోదామనుకుంటే బయట వినిపిస్తున్న సౌండ్స్‌తో ఏకంగా బెడ్ పైనుంచి ఎగిరిపడే పరిస్థితి వచ్చిందట. స్థానిక పోలీసులు వచ్చి "ప్లీజ్ బాబుల్లారా.. వెళ్ళిపోండి" అని బ్రతిమిలాడినా, మెక్సికో ఫ్యాన్స్ మాత్రం తమ 'సంగీత కచేరీ'ని ఆపలేదు. చివరికి అదనపు బలగాలను రంగంలోకి దించాల్సి వచ్చింది.

ఇదో 'చీప్ ట్రిక్'.. ట్రెండ్ అవుతున్న నెటిజన్ల కౌంటర్లు

ఈ తరహా "రాత్రిపూట రాద్ధాంతాలు" ఫుట్‌బాల్ ప్రపంచంలో కొత్తేమీ కాదు. మొన్నటికి మొన్న ఈక్వెడార్ జట్టుకు కూడా ఇలాగే రాత్రంతా 'జోలపాట' పాడి నిద్ర లేకుండా చేశారు. ఇప్పుడు ఇంగ్లండ్‌పై అదే ఫార్ములా అప్లై చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు. "మ్యాచ్ గెలవడానికి ప్రాక్టీస్ అవసరం లేదు, ఒక నాలుగు డ్రమ్స్, కొంచెం గొంతులో ఓపిక ఉంటే చాలు అన్నట్టుంది మెక్సికో ఫ్యాన్స్ వ్యవహారం!" అని ఒకరు కామెంట్ పెడితే.. "పాపం ఇంగ్లండ్ ప్లేయర్స్.. రేపు మ్యాచ్‌లో గోల్ పోస్ట్ వైపు కాకుండా నిద్రమబ్బులో బెంచ్ వైపు పరిగెడతారేమో!" అని మరొకరు ఎద్దేవా చేశారు.

రేపే అసలు సిసలైన పోరు!

ఏదేమైనా ఈ 'సౌండ్ ట్రీట్మెంట్' తర్వాత ఇంగ్లండ్ జట్టు మైదానంలో ఎంతవరకు రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 5:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది.

మెక్సికో ఫ్యాన్స్ వేసిన ఈ "స్లీప్‌లెస్" వ్యూహం పారుతుందా, లేక ఇంగ్లండ్ జట్టు ఈ కోపమంతా మైదానంలో చూపిస్తూ మెక్సికోకు చుక్కలు చూపిస్తుందా అనేది చూడాలి. ఏది ఏమైనా ఫుట్‌బాల్ మ్యాచ్ కంటే ముందే ఈ ఆఫ్‌-ఫీల్డ్ డ్రామా నెట్టింట విపరీతంగా ట్రోల్ అవుతోంది.



Full View


Tags:    

Similar News