సచిన్ రికార్డు బద్దల్.. టీమ్‌ ఇండియాలో 'సూర్యవంశీ' శకం షురూ

టీమ్ఇండియాలో కొత్త శ‌కం మొద‌లైంది.. ఎప్పుడో 1988లో 16 ఏళ్ల వ‌య‌సులో స‌చిన్ టెండూల్క‌ర్ వంటి చ‌రిత్ర‌లో ఒక్క‌డిగా నిలిచే అతి గొప్ప బ్యాట్స్ మ‌న్ త‌ర్వాత భార‌త జ‌ట్టు త‌ర‌ఫున మైదానంలోకి దిగిన అతి చిన్న వ‌య‌స్కుడిగా కుర్ర సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ రికార్డుల‌కెక్కాడు.

Update: 2026-07-05 02:09 GMT

టీమ్ఇండియాలో కొత్త శ‌కం మొద‌లైంది.. ఎప్పుడో 1988లో 16 ఏళ్ల వ‌య‌సులో స‌చిన్ టెండూల్క‌ర్ వంటి చ‌రిత్ర‌లో ఒక్క‌డిగా నిలిచే అతి గొప్ప బ్యాట్స్ మ‌న్ త‌ర్వాత భార‌త జ‌ట్టు త‌ర‌ఫున మైదానంలోకి దిగిన అతి చిన్న వ‌య‌స్కుడిగా కుర్ర సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ రికార్డుల‌కెక్కాడు. 15 ఏళ్ల 99 రోజుల బిహారీ బాలుడు వైభ‌వ్ సూర్య‌వంశీ టీమ్ ఇండియా త‌ర‌ఫున మైదానంలోకి దిగాడు. మాంచెస్ట‌ర్ లో ఇంగ్లండ్ తో జ‌రుగుతున్న రెండో టి20లో వైభ‌వ్ కు తుది జ‌ట్టులో చోటు దొరికింది. వ‌రుస‌గా విఫ‌లం అవుతున్న వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మ‌న్ సంజూ శాంస‌న్ స్థానంలో వైభ‌వ్ ను తీసుకున్నారు. దీంతో భార‌త క్రికెట్ లో కొత్త రికార్డు న‌మోదైంది. స‌చిన్ టెండూల్క‌ర్ 16 ఏళ్ల 205 రోజుల వ‌య‌సులో 1989 న‌వంబ‌రు 15న పాకిస్థాన్ లోని క‌రాచీలో జ‌రిగిన టెస్టు మ్యాచ్ ద్వారా టీమ్ ఇండియా త‌ర‌ఫున మైదానంలోకి దిగ‌గా.. దాన్ని ఇప్పుడు వైభ‌వ్ సూర్య‌వంశీ బ‌ద్ద‌లు కొట్టాడు.

అప్ప‌ట్లో టెస్టు.. ఇప్పుడు టి20

అంత‌ర్జాతీయంగా స‌చిన్ కెరీర్ టెస్టు మ్యాచ్ తో మొద‌లైంది. అయితే అదే ఏడాది డిసెంబ‌రు 18న అత‌డు త‌న తొలి వ‌న్డే కూడా ఆడాడు. అప్ప‌టికి 16 ఏళ్ల 238 రోజులు అత‌డి వ‌య‌సు. ఈ లెక్క‌న చూసుకున్నా.. వైభ‌వ్ సూర్యవంశీ గ‌నుక వ‌న్డేలు, టెస్టుల్లోకి ఏడాదిలోగా అడుగుపెడితే అదీ రికార్డే అవుతుంది. అయితే, వైభ‌వ్ ను ఇప్పుడు కేవ‌లం టి20 బ్యాట‌ర్ గానే చూస్తున్నారు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)లో అత‌డి ప్ర‌ద‌ర్శ‌నే దీనికి కార‌ణం. పైగా అత‌డి ఆట కూడా టి20ల‌కే స‌రిపోతుంది అనిపించేలా ఉంది. అందుక‌నే వ‌న్డేలు, టెస్టుల్లో ఆడించ‌డంపై ఇంకా చ‌ర్చ జ‌ర‌గ‌డం లేదు.

అడుగుపెట్టాడు.. ముద్ర చూపాడు

వైభ‌వ్ ఇంగ్లండ్ తో రెండో టీ20లో 14 ప‌రుగులు (10 బంతుల్లో) చేసి ఔట‌య్యాడు. పార్ట్ టైమ్ స్పిన్న‌ర్ విల్ జాక్స్ బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడ‌బోయి స్టంప్ ఔట్ గా వెనుదిరిగాడు. అయితే, త‌న స్టామినా ఏమిటో చూపిస్తూ అత‌డు రెండు సిక్సులు కూడా కొట్టాడు. 140 కిలోమీట‌ర్ల‌కు పైగా వేగంతో ఇంగ్లండ్ ప్ర‌ధాన పేస‌ర్ ఆర్చ‌ర్ వేసిన బంతిని వైభ‌వ్ కాస్త కింద‌కు వంగి వికెట్ కీప‌ర్ ప‌క్క‌నుంచి సిక్స్ గా మ‌లిచాడు. ఆ త‌ర్వాత పేస‌ర్ జోష్ టంగ్ బౌలింగ్ లోనూ అద్భుత‌మైన సిక్స్ తో అల‌రించాడు. కానీ, జాక్స్ కు మాత్రం దొరికిపోయాడు. మొత్తానికి ఐర్లాండ్ తో సిరీస్ నుంచి సాగుతున్న చ‌ర్చ‌కు తెర‌దించుతూ వైభ‌వ్ ఎంట్రీ ఇచ్చాడు.

కొస‌మెరుపుః దేశంతో పాటు ప్ర‌పంచాన్ని కూడా త‌న‌వైపు తిప్పుకొన్న వైభ‌వ్ సూర్య‌వంశీకి టీమ్ ఇండియా క్యాప్ ను అందించింది ఎవ‌రో తెలుసా..? మ‌న తెలుగు తేజం.. వైస్ కెప్టెన్ తిల‌క్ వ‌ర్మ‌.

Tags:    

Similar News