భారీగా బంగారాన్నికొనేస్తున్న ఆర్ బీఐ.. ఎందుకంటే?
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి వేళ.. భారత రిజర్వు బ్యాంక్ భారీ ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి వేళ.. భారత రిజర్వు బ్యాంక్ భారీ ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. వరుస పెట్టి బంగారాన్ని కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఆర్ బీఐ వద్ద ప్రస్తుతం బంగారు నిల్వలు కొత్త రికార్డులకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం ఆర్ బీఐ వద్ద పోగుపడిన బంగారు నిల్వల విలువ 115.8 బిలియన్ డాలర్లుగా చెబుతున్నారు. రూపాయిల్లో చూస్తే దగ్గర దగ్గర రూ.9.66 లక్షల కోట్లుగా చెబుతున్నారు. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బంగారాన్ని ఆర్ బీఐ కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా ఇటీవల గణనీయంగా పెరిగింది.
ప్రస్తుతం విదేశీ నిల్వల్లో బంగారం వాటా 17 శాతంగా ఉంటే.. గత ఏడాది ఇది కేవలం 12 శాతం మాత్రమే. అంటే.. భారత్ డాలర్ లాంటి విదేశీ కరెన్సీ మీద కంటే బంగారాన్ని కీలక ఆస్తిగా బావిస్తుందని చెప్పాలి. గ్లోబల్ మార్కెట్ లో బంగారం ధర అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో బంగారాన్ని నిరంతరం కొనుగోలు చేస్తోంది ఆర్ బీఐ. 2024 ఆరంభంలో ఔన్స్ బంగారం ధర 2వేల డాలర్ల వద్ద ఉంటే.. ఇప్పుడది ఏకంగా 4వేల డాలర్లకు చేరుకోవటం దీనికి నిదర్శనం.
బంగారాన్ని భారీగా కొనుగోలు చేసే ట్రెండ్ కు తెర తీసింది మాత్రం రష్యా - ఉక్రెయిన్ యుద్దమనే చెప్పాలి. ఈ యుద్ధం నేపథ్యంలో పలు దేశాలు తమ విదేశీ నిల్వలను అమెరికా డాలర్లకే పరిమితం కాకుండా బంగారం నిల్వల్ని పెంచుకునే దిశగా అడుగులు వేయటం మొదలు పెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా బంగారాన్ని కొనుగోలు చేసే దేశాల్లో పోలాండ్ ముందు ఉందని చెప్పాలి. చైనా సైతం2023 తర్వాత నుంచి బంగారాన్నిభారీగా కొనుగోలు చేయటం మొదలు పెట్టింది. చెక్ రిపబ్లిక్ లాంటి చిన్న దేశాలు బంగారు నిల్వల్ని తమ వద్ద పోగు వేసుకోవటానికి చర్యలు తీసుకుంటోంది.
మన దేశం విషయానికి వస్తే.. 2015లో ఆర్ బీఐ వద్ద 557.8 టన్నుల బంగారం ఉంటే.. 2026 నాటికి అది కాస్తా 880.5టన్నులకు చేరుకుంది. ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్నికొనుగోలు చేసే దేశాల జాబితాలో అమెరికా.. జర్మనీ.. ఇటలీ.. బ్రిటన్ లాంటి దేశాలు ముందున్నాయి. ఈ కారణంగానే ఇప్పటికే ప్రపంచంలోనే అతి పెద్ద బంగారం నిల్వలు ఆ దేశంలో ఉన్నాయి. బంగారాన్ని ఇంత భారీగా నిల్వ ఉంచటం భారత విదేశీ మారక నిల్వల చరిత్రలోనే ఇదే తొలిసారిగా చెబుతున్నారు.
చివరగా మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. మన దేశపు ఇళ్లలోనూ.. ఆలయాల్లోనూ వాడకుండా ఆభరణాల రూపంలో ఉన్న బంగారం అక్షరాల 32 వేల టన్నులుగా చెబుతారు. దీని విలువ రూపాయిల్లో చెప్పాలంటే.. రూ351.4 లక్షల కోట్లుగా చెప్పొచ్చు. అంటే.. ఆర్ బీఐ వద్ద ఉన్న బంగారు నిల్వలతో పోలిస్తే మన దేశ ఇళ్లల్లోనూ.. ఆలయాల్లో ఉన్న బంగారం 36రెట్లు ఎక్కువగా చెప్పాచ్చు. ఇంకో ఆసక్తికర అంశం ఏమంటే.. ప్రపంచంలోని ఏ దేశంలోని ప్రజల ఇళ్లల్లో కానీ.. ప్రార్థనాలయాల్లో కానీ భారతదేశం తరహాలో భారీగా బంగారం పోగుపడిన పరిస్థితి లేదని చెప్పాలి. భారత్ తర్వాత ప్రజల ఇళ్లల్లో పోగుపడిన బంగారం నిల్వలను చూస్తే సుమారు 20వేల టన్నుల నుంచి 23 వేల టన్నుల వరకు ఉంటుందని చెబుతున్నారు. మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా ఇళ్లల్లో బారీగా బంగారం ఉన్న దేశాల్లో మనమే ముందు ఉంటామని చెప్పక తప్పదు.