పశ్చిమాసియాలో మళ్లీ భీకరయుద్ధం.. 85 అమెరికా బేస్‌లపై ఇరాన్‌ క్షిపణులు

మరోవైపు అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన 'హర్మూజ్ జలసంధి'లో వాణిజ్య నౌకల భద్రతను అడ్డుపెట్టుకుని అమెరికా కూడా ఇరాన్‌పై విరుచుకుపడింది.

Update: 2026-07-08 07:05 GMT

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చోటుచేసుకుంటున్న పరస్పర దాడులతో గల్ఫ్ ప్రాంతం తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడుకుతోంది. ఇటీవల అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తాము రంగంలోకి దిగినట్లు ఇరాన్ ప్రకటించడంతో పరిస్థితి మరింత భీకరంగా మారింది. బహ్రెయిన్, కువైట్‌లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో భారీ దాడులు చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధికారికంగా వెల్లడించింది.

85 అమెరికా స్థావరాలే లక్ష్యంగా...

ఐఆర్‌జీసీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. బహ్రెయిన్‌లో ఉన్న అత్యంత కీలకమైన అమెరికా 'ఫిఫ్త్ ఫ్లీట్' నౌకాదళ స్థావరం.. అలాగే కువైట్‌లోని 'అలీ అల్ సలేమ్' ఎయిర్ బేస్‌ సహా మొత్తం 85 కీలక అమెరికా సైనిక కేంద్రాలను టార్గెట్ చేసినట్లు ఇరాన్ పేర్కొంది. దీనితో పాటు బుషెహర్ ప్రాంతంలో అమెరికాకు చెందిన అత్యాధునిక 'ఎంక్యూ-9' డ్రోన్‌ను కూడా తాము విజయవంతంగా కూల్చివేసినట్లు స్పష్టం చేసింది. ఒకవేళ అమెరికా గనుక మరోసారి దాడులకు తెగబడితే.. అంతకంటే తీవ్ర స్థాయిలో బుద్ధి చెబుతామని ఇరాన్ హెచ్చరించింది.

అమెరికా భీకర వైమానిక దాడులు

మరోవైపు అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన 'హర్మూజ్ జలసంధి'లో వాణిజ్య నౌకల భద్రతను అడ్డుపెట్టుకుని అమెరికా కూడా ఇరాన్‌పై విరుచుకుపడింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత నిఘా కేంద్రాలు, క్షిపణి సామర్థ్యాలే లక్ష్యంగా అమెరికా భారీ ఎత్తున వైమానిక దాడులు నిర్వహించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఇరాన్‌కు చెందిన దాదాపు 80కి పైగా కీలక లక్ష్యాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇరాన్ కమాండ్ అండ్ కంట్రోల్ నెట్‌వర్క్‌లు, కోస్టల్ రాడార్ వ్యవస్థలు, యాంటీ షిప్ మిసైల్ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఐఆర్‌జీసీకి చెందిన సుమారు 60 వేగవంతమైన బోట్లను సైతం అమెరికా దళాలు నాశనం చేశాయి.

బెదిరింపుల యుగం ముగిసింది: ఇరాన్

అమెరికా చర్యలపై ఇరాన్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమెరికానే స్వయంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. ఇకపై తాము ఎవరి బెదిరింపులకు లొంగబోమని స్పష్టం చేశారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ... "వేధింపులు, ఒత్తిళ్ల యుగం ముగిసింది. ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు అవసరమైన ఎలాంటి చర్యలైనా తీసుకుంటుంది" అని హెచ్చరించారు.

ప్రపంచ దేశాల్లో వణుకు.. చమురు సంక్షోభం పొంచి ఉందా?

ఇదిలా ఉండగా ప్రపంచంలోనే అత్యధిక చమురు రవాణా జరిగే 'హర్మూజ్ జలసంధి'ని మూసివేయాలని ఐఆర్‌జీసీ నేవీకి ఆదేశాలు అందినట్లు అంతర్జాతీయ మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇరాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ నిజంగానే హర్మూజ్ జలసంధి గనుక మూతపడితే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోయి ఇంధన ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో శిఖరాగ్ర సమావేశం నిమిత్తం తుర్కియేలో ఉన్నారు. అక్కడ నుంచే ఆయన ఈ తాజా సైనిక చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఈ సైనిక ఘర్షణ పశ్చిమాసియాను మరోసారి పూర్తిస్థాయి భీకర యుద్ధం వైపు నెడుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళనతో గమనిస్తున్నాయి.

Tags:    

Similar News