మండలి ఆవేదన ఆలోచించాల్సిందేగా !
మండలి బుద్ధ ప్రసాద్, సీనియర్ రాజకీయ నాయకుడు, అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
మండలి బుద్ధ ప్రసాద్, సీనియర్ రాజకీయ నాయకుడు, అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 నుంచి 2019 మధ్యలో ఆయన ఏపీకి ఉప సభాపతిగా పనిచేశారు. ఆయన తండ్రి మండలి వెంకట కృష్ణారావు విద్యా శాఖ మంత్రిగా ఏపీలో కీలక నిర్ణయాలు తీసుకుని చరిత్రలో నిలిచిన వారు. అంతే కాదు దివిసీమ ఉప్పెన సమయంలో ఆయన ప్రభుత్వం పరంగా స్పందించిన తీరు చేసిన సేవలు ఇప్పటికీ అంతా గుర్తుంచుకుంటారు. అలాంటి తండ్రి వారసుడు, రాజకీయంగా ఉన్నత విలువలు కలిగిన వారు, సాహిత్యాభిలాషి ఇలా ఎన్నో రకాలుగా మండలి బుద్ధ ప్రసాద్ గురించి చెప్పుకోవాల్సి ఉంది. అటువంటి ఆయన వర్తమాన రాజకీయాల గురించి మధనపడ్డారు. అది తనలో తాను కాదు, ఏకంగా బహిరంగంగానే తన ఆవేదనను వ్యక్తం చేశారు.
ఈసారి ఎమ్మెల్యేగా తప్పు :
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య జయంతి సందర్భంగా జరిగిన ఆయన విగ్రహావిష్కరణ సభలో మండలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అని అన్నారు. తామంతా మహానుభావుడు రోశయ్య వంటి పెద్దల సరసన నిలబడి రాజకీయాలు చేశామని మండలి గుర్తు చేసుకున్నారు. రోశయ్యకు ఇతరులను ఎలా గౌరవించాలో బాగా తెలుసు అన్నారు. ఇప్పటి నాయకులు మాదిరిగా ఆయన ఆనాడు భాష వాడలేదని మండలి అన్నారు. సిద్ధాంతపరంగా ఆయన రాజకీయంగా విభేదించారు తప్పించి వ్యక్తిగత విమర్శలు ఎక్కడా చేయలేదని అన్నారు. ప్రస్తుతం చూస్తే రాజకీయాలు కలుషితం అయిపోయాయని మండలి ఆవేదన చెందారు. అందుకే రోశయ్య విగ్రహం ద్వారా స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
సహేతుకమైనదే అంటూ :
ఇదిలా ఉంటే మండలి వంటి వారు ఆవేదన సహేతుకమే అని అంటున్నారు. ఆయన గతంలో పెద్ద నాయకులను చూశారు, ఆనాటి రాజకీయాలను చూశారు, ఇపుడు రాజకీయాలను చూస్తున్నారు, కచ్చితమైన తేడా అయితే వచ్చింది. దాంతోనే సీనియర్ నేతలు బాధపడుతున్నారు. సిద్ధాంతపరమైన విమర్శలు పోయాయి, రాజకీయంగానే ఢీ కొట్టాలన్న ఆలోచనలు పక్కకు పోయాయి, ఏకంగా వ్యక్తిగత దూషణలకు దిగిపోతున్నారు ఇప్పుడు రాజకీయాలు చేసే వారు అంతా దీని మీదనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెనకటి తరం వారు అయితే అసలు ఇమడలేకపోతున్నారు, మండలి ఆ విధంగానే తన బాధను వ్యక్తం చేశారు అనుకోవాలి. రాజకీయాలు అన్నవి ప్రజా సేవ కోసం ఉన్నాయి, కానీ అసలు విషయాన్ని మరచి నేరుగా దూషణ భూషణలకు దిగిపోతున్నారు, ఇది ప్రజలలో కూడా చర్చగానే ఉంది. మరి దీనికి ఎండ్ కార్డు ఎక్కడైనా పడుతుందా లేక ఇలాగే కొనసాగుతుందా అంటే ప్రతీ ఒక్కరూ దీని మీద సీరియస్ గానే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.