125 ఏళ్ల తర్వాత ఐదోసారి..డ్రాట్ బెల్స్..కేంద్రం అలర్ట్.!
చినుకు జాడ లేదు. వారం రోజులు అలర్ట్ అని వాతావరణ శాఖ చెప్తుంది. కుండపోత వర్షాలను అలర్ట్ ఇస్తుంది.
చినుకు జాడ లేదు. వారం రోజులు అలర్ట్ అని వాతావరణ శాఖ చెప్తుంది. కుండపోత వర్షాలను అలర్ట్ ఇస్తుంది. అందుకు తగ్గట్లే..మబ్బులు కమ్ముకుంటున్నాయి. వెదర్ చల్లబడుతుంది. కానీ తుప్పురు తప్ప వర్షాలు దంచికొట్టింది లేదు. రైతులు సాగుకు సాహసం చేసే పరిస్థితి కనిపించట్లేదు. ప్రతీ ఏడాది జూన్ వచ్చిందంటే చాలు.. భారీ వర్షాలు పడుతుంటాయి. ఈసారి మాత్రం వానలు మొహం చాటేశాయి. ఎండల వేడికి తోడు వరుణ దేవుడు కూడా సెలవు పెట్టడంతో దేశవ్యాప్తంగా జూన్ నెలలో అత్యల్ప వర్షపాతం నమోదైంది. 1901 నుంచి లెక్కలు తీస్తే.. చరిత్రలోనే ఇది 5వ అత్యల్ప వర్షపాతంగా రికార్డుకెక్కింది.
రుతుపవనాలు దారి తప్పాయా..?
రుతుపవనాలు ఆల్రెడీ ఎంటర్ అయ్యాయని వెదర్ రిపోర్ట్ చెబుతోంది. కానీ వర్షాలు పడకపోవడంతో మాన్ సూన్..వెరీ సూన్ అన్నట్లుగా అడ్రస్ మార్చుకున్నట్టే కనిపిస్తోంది. దీంతో 1901 నాటి రికార్డులను వానలు తిరగరాశాయి. ఎల్ నినో ఎఫెక్ట్ తోనే..ఇప్పటివరకు వర్షాలు పడట్లేదని..ఈ సారి పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయని ఎక్స్ పర్ట్స్ చెబుతూనే ఉన్నారు. జూన్ నెలలో సాధారణంగా కురవాల్సిన 165.3 మి.మీ వర్షపాతానికి గాను.. కేవలం 99.5 మి.మీ మాత్రమే కురిసింది. అంటే దాదాపు 40శాతం వర్షపాతం లోటు అన్నమాట. ముఖ్యంగా మధ్య భారతదేశంలో ఈ లోటు ఏకంగా 50శాతంపైనే ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న 'ఎల్ నినో' ప్రభావం వల్ల రుతుపవనాలు బలహీనపడ్డాయి. హిందూ మహాసముద్రంలో రుతుపవనాలకు బూస్ట్ ఇచ్చే 'ఇండియన్ ఓషన్ డైపోల్' కూడా న్యూట్రల్‌గా మారిపోయింది.
కరువు పరిస్థితులపై కేంద్రం యాక్షన్ ప్లాన్.!
పరిస్థితి ఇలాగే ఉంటే కరువొచ్చే ప్రమాదం ఉందని గ్రహించిన కేంద్రం అలర్ట్ అయింది. సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాలు తక్కువగా ఉన్నందున రైతులు మినుములు, పెసలు, జొన్నలు, సజ్జలు (మిల్లెట్స్) వంటి తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అవగాహన కల్పించాలని డిసైడ్ చేశారు. వర్షాల్లేక బోర్లపై ఆధారపడే రైతుల కోసం విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని పవర్ మినిస్ట్రీని ఆదేశించారు. దేశంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని నిర్ణయించారు. దేశంలో బియ్యం, గోధుమల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా యాక్షన్ తీసుకుంటామంటోంది కేంద్రం. ఒకవైపు దేశమంతా వర్షాల్లేక అల్లాడుతుంటే.. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం వరదలు ముంచెత్తుతున్నాయి. మొత్తానికి జూన్ నెల హ్యాండ్ ఇచ్చినా.. జూలైలో అయినా వరుణుడు కరుణిస్తాడేమోనని రైతాంగం ఆశగా ఎదురుచూస్తోంది. కేంద్రప్రభుత్వం కూడా 'ప్లాన్ బి'తో అలర్ట్ అయిపోయింది.