రావాలి జగన్.. కావాలి మావి‘గన్’.. ఫ్లెక్సీల కలకలం!

రాజధాని అమరావతి విషయంలో వైసీపీ తన వాదన నుంచి వెనక్కి తగ్గడం లేదు. అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డికి వైసీపీ శ్రేణులు మద్దతు ప్రకటిస్తున్నాయి.;

Update: 2026-04-09 07:41 GMT

రాజధాని అమరావతి విషయంలో వైసీపీ తన వాదన నుంచి వెనక్కి తగ్గడం లేదు. అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డికి వైసీపీ శ్రేణులు మద్దతు ప్రకటిస్తున్నాయి. జగన్ రెడ్డి ప్రతిపాదనలపై వైసీపీలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నేతలు, వారి అభిమానులు ‘మావిగన్’ను సమర్థిస్తూ తాడేపల్లిలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.


తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇంటి ముందు వెలిసిన ఫ్లెక్సీలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. తాడేపల్లిలో జగన్ రెడ్డి ఇంటి ముందు రోడ్డుకు ఇరువైపులా భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మావిగన్ కు మద్దతు తెలిపారు. ఫ్లెక్సీలపై కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నాయకుల ఫొటోలు కూడా ఉన్నాయి. ‘రావాలి జగన్.. కావాలి మావిగన్’ అంటూ నినాదాలు చేయడమే కాకుండా ‘గన్’కు కొటేషన్లు పెట్టడం గమనార్హం.

మరికొన్ని పోస్టర్లపై ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే అజెండా అని రాసి ఉంది. ‘మావిగనే రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్’, ‘యువతకు ఆదర్శం, సమాజానికి అండ.. మావిగన్’ అంటూ మరికొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మొత్తానికి మాజీ సీఎం జగన్ ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో ‘మావిగన్’ విషయంలో వైసీపీ గట్టి నిర్ణయమే తీసుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయమై లోక్ సభలో చర్చ జరుగుతున్న సమయంలో ఇక్కడ మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగన్ రెడ్డి ఆకస్మాత్తుగా మావిగన్ ప్రతిపాదన తీసుకువచ్చారు.

అమరావతి నిర్మించడం ఆర్థికంగా భారమని, ప్లాన్-బి కింద మావిగన్ అన్న పేరుతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ రాజధానిని అభివృద్ధి చేయాలని జగన్ రెడ్డి సూచించారు. ఈ ప్రతిపాదనపై టీడీపీ కూటమి పార్టీలు మండిపడగా, మొదట వైసీపీ శ్రేణులు ఖిన్నులైనట్లు వార్తలు వచ్చాయి. అయితే జగన్ రెడ్డి ప్రకటనకు మద్దతుగా కేడర్ మొత్తం రంగంలోకి దిగాలని అధిష్టానం సూచించడంతో జిల్లాల వారీగా నేతలు మీడియాతో మాట్లాడుతూ మావిగన్ కు అనుకూలంగా ప్రకటనలు చేశారు. ఇప్పుడు మరింత స్పష్టత ఇస్తున్నట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మావిగన్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు.




Tags:    

Similar News