పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఎందుకు ఒప్పుకుంది?

విశ్వవేదికపై భారత దౌత్య వ్యూహం మరోసారి తన సత్తా చాటింది. ఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన 'న్యూఢిల్లీ డిక్లరేషన్' అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది.

Update: 2026-09-13 07:01 GMT

విశ్వవేదికపై భారత దౌత్య వ్యూహం మరోసారి తన సత్తా చాటింది. ఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన 'న్యూఢిల్లీ డిక్లరేషన్' అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణ ఉగ్రదాడిని బ్రిక్స్ సభ్య దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించడమే కాకుండా ఉగ్రవాద మూలాలను మట్టుబెట్టాలని ఉమ్మడి పిలుపునిచ్చాయి. ఈ చారిత్రాత్మక ప్రకటనలో అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రధాన అంశం పాకిస్థాన్ మిత్రదేశమైన చైనా కూడా భారత్ వైఖరితో ఏకీభవించడం.

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంఘటనలు జరుగుతున్నప్పటికీ పహల్గామ్ దాడిని పేరుతో సహా ప్రత్యేకంగా ఖండించడం భారత విదేశాంగ విధానం సాధించిన గొప్ప విజయం. కేవలం దాడి చేసిన వారిని మాత్రమే కాకుండా ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందించే నెట్‌వర్క్‌లు, వారికి ఆశ్రయం ఇచ్చే 'సేఫ్ హెవెన్స్' వ్యవస్థలను అంతం చేయాలని.. సరిహద్దులు దాటి జరిగే కార్యకలాపాలను అడ్డుకోవాలని ఈ డిక్లరేషన్ స్పష్టం చేసింది.

పాకిస్థాన్‌కు మౌలిక, ఆర్థిక, రక్షణ రంగాల్లో అత్యంత సన్నిహిత భాగస్వామిగా ఉన్న చైనా ఈ ఉమ్మడి ప్రకటనకు అంగీకరించడం గమనార్హం. తన స్వదేశంలోనూ పాకిస్తాన్ వల్ల సమస్యలను ఎదుర్కొంటున్న బీజింగ్.. అంతర్జాతీయ బహుపాక్షిక వేదికలపై ఉగ్రవాదాన్ని సమర్థించే పరిస్థితిలో లేదు. పాకిస్థాన్‌తో వ్యూహాత్మక సంబంధాలు కొనసాగిస్తున్నప్పటికీ ఉగ్రవాద వ్యతిరేక అంతర్జాతీయ సూత్రాలకు కట్టుబడక తప్పని పరిస్థితుల్లో చైనా ఈ డిక్లరేషన్‌కు సమ్మతించాల్సి వచ్చింది.

డిక్లరేషన్‌లో పాకిస్థాన్ పేరు నేరుగా లేకపోయినప్పటికీ దౌత్య పరిభాషలో ఇచ్చిన సందేశం చాలా స్పష్టంగా ఉంది. ఒక నిర్దిష్ట దేశాన్ని నేరుగా వేలెత్తి చూపకుండానే ఆ దేశం పెంపొందిస్తున్న ఉగ్ర పునాదులను, ఆశ్రయ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా భారత్ సమర్థవంతమైన వ్యూహాన్ని అమలు చేసింది. దీనికితోడు ఐక్యరాజ్యసమితి పరిధిలో పెండింగ్‌లో ఉన్న 'అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక సమగ్ర ఒప్పందాన్ని' (సీసీఐటీ) త్వరితగతిన పూర్తి చేయాలని బ్రిక్స్ పిలుపునివ్వడం భవిష్యత్తులో ఉగ్రవాద నిర్మూలనకు ఒక బలమైన చట్రాన్ని నిర్మించే దిశగా పడిన అడుగుగా కనిపిస్తోంది.

ఆపరేషన్ సిందూర్‌కు ప్రస్తావన లేకపోవడం ఏం చెబుతోంది?

ఇక భారత్ దృష్టిలో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. పహల్గామ్ దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి డిక్లరేషన్‌లో ప్రత్యేక ప్రస్తావన లేదు. దీనిని భారత్‌కు ప్రతికూల అంశంగా మాత్రమే చూడాల్సిన అవసరం లేదు. బ్రిక్స్ ప్రకటన ప్రధానంగా ఉగ్రవాదాన్ని ఖండించడం, అంతర్జాతీయ సహకారం పెంచడం వంటి విస్తృత అంశాలపై దృష్టి పెట్టింది. అంటే.. భారత్ చేపట్టిన సైనిక చర్యకు మద్దతు ఇవ్వడం కంటే ఆ చర్యకు కారణమైన ఉగ్రవాద సమస్యను అంతర్జాతీయ స్థాయిలో గుర్తించడం ద్వారా భారత్‌కు ఒక రకమైన దౌత్యపరమైన మద్దతు లభించింది.

పహల్గామ్ దాడి విషయంలో బ్రిక్స్ తీసుకున్న వైఖరి భారత్‌కు ఒక ముఖ్యమైన దౌత్య సంకేతం. పాకిస్థాన్ పేరు లేకపోయినా పహల్గామ్ పేరు ఉంది. ఆపరేషన్ సిందూర్ ప్రస్తావన లేకపోయినా ఉగ్రవాదానికి సేఫ్ హెవెన్స్, నిధులు, సరిహద్దులు దాటి కార్యకలాపాలపై స్పష్టమైన వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా.. పాకిస్థాన్‌కు సన్నిహితమైన చైనా కూడా ఈ ప్రకటనలో భాగస్వామిగా ఉండటం ఈ డిక్లరేషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యం తెచ్చింది. అందుకే ఇది కేవలం ఒక ఉగ్రదాడి ఖండన కాదు. భారత్ కోరుకుంటున్న ఉగ్రవాద వ్యతిరేక అంతర్జాతీయ దౌత్య భాషకు బ్రిక్స్ వేదికపై లభించిన మరో బలమైన మద్దతుగా దీన్ని చూడవచ్చు.

Tags:    

Similar News