అసెంబ్లీని వదిలేసి.. తెలంగాణ భవన్ లో ఈ ఆటేంది కేటీఆర్?
రోజులు మారుతున్నాయి. గతంలో అసెంబ్లీ సమావేశాలంటే ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. వ్యూహాత్మకంగా ఇరుకున పెడుతూ.. అవకాశం చిక్కిన ప్రతిసారి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేయటం ఉండేది.
రోజులు మారుతున్నాయి. గతంలో అసెంబ్లీ సమావేశాలంటే ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. వ్యూహాత్మకంగా ఇరుకున పెడుతూ.. అవకాశం చిక్కిన ప్రతిసారి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేయటం ఉండేది. అధికారపక్షం ప్రదర్శించే అధిపత్య ధోరణికి ఇబ్బంది పడుతూనే.. అసెంబ్లీ వేదికగా ప్రధాన ప్రతిపక్షం పోరాటాలు చేసేవి. అయితే.. గడిచిన పుష్కర కాలంలో ఆ తీరు మారిపోయింది. అధికారంలో ఎవరున్నా.. ప్రతిపక్షం సభలో ఉండని పరిస్థితి. తెలంగాణలో చూస్తే.. మొదటి దఫాతో పోలిస్తే.. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మరింతగా మారింది. ప్రధాన ప్రతిపక్షం ఉనికి ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. ఉన్న గుప్పెడు మంది మాట్లాడేందుకు చేసే ప్రయత్నాల్ని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిలువరించేది. అనూహ్య రీతిలో బలపడిన బీజేపీ నేతల్ని సైతం మాట్లాడనిచ్చేది కాదు.
అంతదాకా ఎందుకు తనపై పడిన నిందకు ప్రతిగా రాజీనామా చేసిన ఈటల రాజేందర్.. ఉప ఎన్నికలో సంచలన విజయాన్ని సొంతం చేసుకొని అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు ఆయన నానా ఆగచాట్లు పడాల్సి పరిస్థితి. ఆయన్ను అసెంబ్లీలోకి అడుగు పెట్టనీయకుండా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగిన వైనాన్ని మర్చిపోలేం. ఈటలను అసెంబ్లీలో ఎదుర్కొనేందుకు గులాబీ బాస్ ఒక పట్టాన ఇష్టపడే వారు కాదన్న మాట అప్పట్లో బలంగా వినిపించేది. బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ నిర్వాహణ.. ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం లేకుండా చేయటంలో సక్సెస్ అయ్యిందన్న విమర్శ ఉంది.
కట్ చేస్తే.. రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. ఆయన పాలనలోని తప్పుల్ని చీల్చి చెండాడేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉంటారని.. ఆయన్ను తట్టుకోవటం రేవంత్ కు కష్టంగా మారుతుందన్న మాట వినిపించింది. ఈ వాదనకు భిన్నంగా కేసీఆర్ తీరు ఉండటం తెలిసిందే. అసలు ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని పరిస్థితి. ఆయన్ను అసెంబ్లీకి రప్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ఏదో ఒకప్రయత్నం చేస్తూ ఉండటం కనిపిస్తుంది. ఆయన సభకు రావాలని.. పలు అంశాల మీద చర్చ చేయాలని.. తాము సమాధానం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పటం కనిపిస్తుంది.
ఆ మాటకు వస్తే.. ప్రధాన ప్రతిపక్ష నేతను అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ఇంతలా కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే అవుతారు. అయితే.. రేవంత్ ను ముఖ్యమంత్రిగా అంగీకరించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇష్టం లేదు. ఇది కూడా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవటానికి ఉన్న కారణాల్లో ఒకటిగా చెబుతారు. కేసీఆర్ సంగతి పక్కన పెడితే.. కేటీఆర్, హరీశ్ రావు లాంటి వారు సభకు హాజరై రేవంత్ సర్కారు చేసే తప్పుల్ని చీల్చి చెండాల్సిన అవసరం ఉంది. అయితే.. అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా నిరసన తెలపటం తప్పేం కాదు. కానీ.. తాము పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన నిబంధనలు.. తాము అనుసరించిన రూల్స్ ను తామే బ్రేక్ చేసేలా వ్యవహరించటం సరైన వ్యూహం కాదన్న విషయాన్ని కేటీఆర్.. హరీశ్ లు మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది.
ఏ రాష్ట్ర అసెంబ్లీలో అయినా అధికారపక్షానికి అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షానికి పరిమితులు ఉంటాయి. వాటిని ఎదుర్కొంటూ.. ప్రభుత్వాన్ని ఇరుకున పడేలా వ్యవహరించటం అంత తేలికైన పని కాదు. ఈ క్లిష్టమైన ఆట ఆడే కన్నా.. ప్రభుత్వం తీరును తప్పు పడుతూ కార్యక్రమాల్ని చేపట్టటంలో అర్థం లేదు. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా.. అందుకు ప్రత్యామ్నాయంగా తమ సొంత పార్టీ ఆఫీసులో మాక్ అసెంబ్లీని నిర్వహించటం.. ఈ సందర్భంగా ప్రభుత్వం మీద విమర్శలు చేయటంలో అర్థమేంటి?అన్నది ప్రశ్న. అదేదో.. సభకు వచ్చి.. ప్రభుత్వాన్ని ఇరిటేట్ చేసేలా.. వారు ఇబ్బంది పడే అంశాలను చర్చకు తీసుకురావటం లాంటి వాటి మీద ఫోకస్ తగ్గించి..అందుకు భిన్నంగా వ్యవహరించటం వల్ల లాభమేంటి?అన్నది ప్రశ్న.
నిజంగానే మాక్ అసెంబ్లీని నిర్వహించి.. ప్రభుత్వం తీరును ఎండగట్టాలన్నదే కేటీఆర్.. హరీశ్ రావు లాంటి వారి ఆలోచన అయితే.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత.. ఇదే తెలంగాణ భవన్ లో ఇప్పటి మాదిరే సెట్టింగ్ వేసి.. ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. అందుకు ప్రతిపక్షం ప్రదర్శించిన పాత్రను వ్యంగ్య రూపంలో చేసి ఉంటే బాగుండేది. అందుకు భిన్నంగా ఓవైపు అసెంబ్లీ జరుగుతుంటే.. అందులో పాల్గొనకుండా.. ఇలా మాక్ అసెంబ్లీని నిర్వహించటం తెలివైన పనిగా కనిపించదు. ఇలాంటి అంశాల్ని కేటీఆర్.. హరీశ్ రావులు ఎందుకు గుర్తించటం లేదన్నది అసలు ప్రశ్న. పిల్లలు తప్పులు చేస్తుంటే.. సరిదిద్దాల్సిన గులాబీ బాస్ సైతం గమ్మున ఉండటం దేనికి నిదర్శనం?