కార్ రంగు.. బాడీలో బుల్లెట్లు.. కబ్జా ఆరోపణలు.. కొండా మురళి పేల్చిన బాంబులు
తెలంగాణ రాజకీయం ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠను రేపుతున్న వేళ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర కలకలం సృష్టించాయి.
తెలంగాణ రాజకీయం ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠను రేపుతున్న వేళ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర కలకలం సృష్టించాయి. వరంగల్‌లో నిర్వహించిన అభిమానులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూనే వ్యక్తిగత, కుటుంబ విషయాలతో పాటు ప్రత్యర్థులపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘సారీ’ చెప్పేదే లేదు.. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి
తన భార్య, మాజీ మంత్రి కొండా సురేఖ పక్షాన కొండా మురళి స్పందిస్తూ.. రాజకీయంలో మాటపై నిలబడటమే అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. "చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖ చేత క్షమాపణ చెప్పించాలని నా వద్ద ప్రతిపాదన వచ్చింది. కనీసం పేపర్‌పై రాసి ఇవ్వమని ఆమెను బ్రతిమిలాడాను. కానీ, తప్పు చేయనప్పుడు 'సారీ' చెప్పేది లేదని, పదవి ఉంటే ఉండనీ.. పోతే పోనీ అని సురేఖ స్పష్టం చేసింది. ఆమె పదవి పోయినా భయపడలేదు" అని కొండా మురళి వివరించారు.
కూతురు ‘ప్లాన్ బీ’ వేరు.. మా బిడ్డకు మాకు సంబంధం లేదు
కుటుంబ రాజకీయంపై ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. కొండా సురేఖ, తాను ఎప్పుడూ ఒకే మాటపై ఉంటామని, అయితే తమ కూతురి ఆలోచనలు, బాట వేరే అని వ్యాఖ్యానించారు. తమ కూతురు ‘ప్లాన్ బీ’ ఏంటో తమకు తెలియదని, ఆమె నిర్ణయాలకు తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.
కాంగ్రెస్‌ను వీడేది లేదు.. రాహుల్ గాంధీ కోసం పోరాటం
పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని కొండా మురళి ఖండించారు. తమ గెలుపు కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. రాహుల్ గాంధీని భారతదేశానికి ప్రధానమంత్రిని చేసేవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి పోరాడతామని స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం పిలిచినా కొండా సురేఖ వెళ్లడం లేదని, పదవుల కంటే కార్యకర్తల నమ్మకమే తమకు ముఖ్యమని చెప్పారు.
కబ్జా ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి అవుట్
తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఎక్కడైనా బెదిరించి భూములు కబ్జా చేసినట్లు ఆధారాలతో నిరూపిస్తే తక్షణం రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తన కార్యకర్తల సంక్షేమం కోసం అవసరమైతే మరో 10 ఎకరాల భూమిని విక్రయించడానికైనా సిద్ధమని తెలిపారు.
నా కార్ రంగు ఇండియాలోనే లేదు.. బాడీలో బుల్లెట్లు ఉన్నా బతుకుతున్నా
తన వ్యక్తిగత జీవితం.. గత పరిస్థితులపై మురళి ఆసక్తికరమైన ‘పంచ్’లు పేల్చారు. "నా కారు రంగు ఇండియాలోనే ఎక్కడా లేదు.. అది ప్రత్యేకమైన ముస్లింల చిహ్నం" అని తెలిపారు. తనకు సేవ చేస్తున్న ముగ్గురు డ్రైవర్లూ ముస్లింలేనని పేర్కొన్నారు. "నా శరీరంలో ఇప్పటికీ 4 బుల్లెట్లు ఉన్నా బతుకుతున్నానంటే ప్రజలు, కార్యకర్తల ఆశీస్సులే కారణం" అని వ్యాఖ్యానించారు.
రక్తంలోనే కృతజ్ఞత!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆయన ఇచ్చిన మంత్రి పదవిని వద్దనుకుని, పావురాలగుట్టలోనే రాజీనామా పత్రం పడేసి వచ్చిన చరిత్ర తమదని కొండా మురళి అన్నారు. విశ్వాసం, కృతజ్ఞత అనేది తమ రక్తంలోనే ఉందన్నారు.
కార్యకర్తలే తన బలమని, రాబోయే స్థానిక సంస్థల, కార్పొరేషన్ ఎన్నికల్లో నిజాయితీగా కష్టపడే నాయకులకే టికెట్లు వచ్చేలా చూస్తానని కొండా మురళి హామీ ఇచ్చారు.