చీల్చి చెండాడడమే...బీజేపీ లిస్ట్ లో మూడు పార్టీలు ?

ఇదిలా ఉంటే ఈ చీల్చుడు అన్నది ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీలో 37 మంది ఎంపీలలో 22 మందిని బీజేపీ ప్రత్యేక వర్గంగా మార్చాలని చూస్తోంది అని అంటున్నారు.

Update: 2026-06-26 19:30 GMT

కేంద్రంలో మూడోసారి కూడా అధికారం చలాయిస్తున్న బీజేపీ ఒకే విధానం ఇపుడు ఎంచుకుంది. చీల్చి చెండాడడమే ఆ విధానం. ప్రతిపక్షాలను అందునా ప్రాంతీయ పార్టీలను నిలువునా చీల్చేసి వారిని పార్లమెంట్ లో ప్రత్యేక వర్గంగా చేసి తమకు అవసరం అయిన వేళ పూర్తి మద్దతు వారి నుంచి పొందడమే బీజేపీ స్ట్రాటజీగా ఉంది. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను ఈ విధంగా వేరు కుంపటి పెట్టించిన బీజేపీ మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే శివసేనను కూడా అడ్డంగా ఏక్ నాధ్ షిండే ద్వారా చీల్చింది. ఆరుగురు ఎంపీలకు ఇపుడు లోక్ సభలో ప్రత్యేక వర్గంగా గుర్తింపు లభించింది. ఇక అదే మహారాష్ట్రలో ఎన్సీపీ మీద కూడా బీజేపీ చూపు పడింది అని అంటున్నారు. శరద్ పవార్ నాయకత్వంలోని ఎనిమిది మంది ఎంపీలలో ఏకంగా అయిదుగురుని తమ వైపునకు తిప్పుకోవాలని అజిత్ పవాన్ నాయకత్వంలోని ఎన్సీపీ చూస్తోంది. దాని వెనక బీజేపీ వ్యూహాలు ఉన్నాయి.

ఆ పార్టీలకూ ముప్పు :

ఇదిలా ఉంటే ఈ చీల్చుడు అన్నది ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీలో 37 మంది ఎంపీలలో 22 మందిని బీజేపీ ప్రత్యేక వర్గంగా మార్చాలని చూస్తోంది అని అంటున్నారు. వారి విషయంలో ఇప్పటికే యూపీ బీజేపీ మంత్రి సంచలన ప్రకటన కూడా చేశారు. ఇక ఒడిషాలోని నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనదాదళ్ కి చెందిన తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులలో ఆరుగురిని చీల్చేయాలని చూస్తున్నారు. అలాగే పంజాబ్ లో ఇప్పటికే ఆప్ నుంచి రాజ్యసభ ఎంపీలను చీల్చేశారు. ఇపుడు లోక్ సభ ఎంపీలను చీలుస్తారు అని అంటున్నారు. ఇలా బీజేపీ అమాంతం లోక్ సభలో రాజ్యసభలో మూడింట రెండు వంతుల బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది అని అంటున్నారు.

ఇదీ లెక్క అంటే :

లోక్ సభలో మొత్తం 543 మంది ఎంపీలు. రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెడితే అందరు ఎంపీలు హాజరైతే కచ్చితంగా మూడింట రెండు వంతుల బలం అంటే 362 గా ఉండాల్సిందే. ప్రస్తుతం చూస్తే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే బలం చూస్తే ఈ చీల్చుడు ఎంపీలు ప్రత్యేక వర్గాలతో కలుపుకుని 344 కి పెరిగింది అని అంటున్నారు. ఈ నంబర్ ని మరింతగా పెంచుకుంటే రానున్న మూడేళ్ళూ బేఫికర్ గా తాము అనుకున్న బిల్లులు అన్నీ రాజ్యాంగబద్ధంగా సవరణలు చేసుకోవాలని అనుకుంటోంది. అలాగే రాజ్యసభలో కూడా 164 మంది ఎంపీల మద్దతు కూడగట్టేందుకు ఈ చీల్చుడు కొనసాగుతోంది అని అంటున్నారు.

మళ్లీ గెలిచేందుకే :

ఈసారి దేశంలో ఎన్నికలు 543 ఎంపీ సీట్లకు కాదు 824 ఎంపీ సీట్లకు నిర్వహించాలని బీజేపీ చూస్తోంది. అలా డీలిమిటేషన్ బిల్లుని ఆమోదించుకోవడమే కాదు ఇందులో మూడవ వంతు మహిళలకు కేటాయించే బిల్లుకు కూడా ఆమోదముద్ర వేసుకోవాలని చూస్తోంది. అంటే 824 లో 275 దాకా మహిళలకు రిజర్వేషన్లు కేటాయించాలని చూస్తోంది. అంటే తనకు అనుకూలంగా ఈ డీలిమిటేషన్ ని మహిళా రిజర్వేషన్ ని కనుక పూర్తి చేసుకుంటే 2029 ఎన్నికల్లో కూడా ఎదురులేకుండా ఉంటుందని బీజేపీ భావిస్తోంది. వీటితో పాటుగా ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే జమిలి ఎన్నికల బిల్లుకు కూడా రాజ్యాంగ సవరణ అవసరం ఉంటుంది. అలాగే యూనిఫాం సివిల్ కోడ్ కోసం బీజేపీ అమ్ముల పొదిలో ఉన్న అనేక అజెండా బిల్లుల ఆమోదం కోసం కూడా బిగ్ నంబర్ కావాలి. అందుకే ఈ చీల్చుడు అని చెబుతున్నారు. మొత్తానికి బీజేపీకి ఎవరికీ దక్కని చాన్స్ అయితే ఇపుడు ఉంది. అందుకే బీజేపీ లోక్ సభలో తన బలాన్ని అమాంతం 360 ప్లస్ గా చేసుకోవాలని తపన పడుతోంది. అదే జరిగితే బీజేపీని అడ్డుకోవడం ఎవరి తరం కాదు, అంతే కాదు కీలక రాజ్యాంగ సవవరణలు జరిగితే బీజేపీకి దేశంలో పూర్తిగా అనుకూల వాతావరణం ఏర్పడుతుందని అంటున్నారు.

Tags:    

Similar News