మాజీ మంత్రి గారు ఇంకా డైలామాలోనే !?
శ్రీకాకుళం జిల్లాలో పెద్ద దిక్కుగా రాజకీయాలు చేసిన వారు ఆయన. అతి చిన్న వయసులోనే గ్రామ సర్పంచ్ గా తన రాజకీయ ప్రయాణాన్ని మొదలెట్టిన ఆయనే ధర్మాన ప్రసాదరావు.
శ్రీకాకుళం జిల్లాలో పెద్ద దిక్కుగా రాజకీయాలు చేసిన వారు ఆయన. అతి చిన్న వయసులోనే గ్రామ సర్పంచ్ గా తన రాజకీయ ప్రయాణాన్ని మొదలెట్టిన ఆయనే ధర్మాన ప్రసాదరావు. గట్టిగా మూడు పదుల వయసు నిండకుండానే మంత్రి పదవిని అందుకున్న ప్రసాదరావు నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్సార్, రోశయ్య, జగన్ మంత్రి వర్గాలలో కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డు అయితే ధర్మాన ప్రసాదరావు సొంతం. అదే విధంగా నరసన్నపేట నుంచి రెండు సార్లు శ్రీకాకుళం నుంచి మూడు సార్లు గెలిచిన ప్రసాదరావు 2024లో మాత్రం చేదు ఓటమిని అందుకున్నారు. దాంతో ఆయనలో వైరాగ్య భావనలు కూడా అధికం అయ్యాయని అంటున్నారు.
అపుడపుడు మాత్రమే :
ధర్మాన ప్రసాదరావు సబ్జెక్ట్ మీద పట్టు ఉన్న వారు. ఏ విషయం అయినా అనర్గళంగా మీడియా ముందు అలాగే సభలలో అసెంబ్లీలో సైతం వినిపించగలరు. పాయింట్ మీద మాట్లాడాలంటే ఆయనే ఎక్స్ పెర్ట్ అని అంతా ఒప్పుకుంటారు. ఇక ప్రసాదరావు రాజకీయం చూస్తే శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకసారి ఓటమి ఒకసారి గెలుపు అన్నట్లుగా ఉంది 2014లో ఓడిన ఆయన 2019లో గెలిచారు. 2024లో ఓడారు, 2029లో గెలుపు కోసం ఆయన ఆలోచిస్తున్నారా అన్నదే క్యాడర్ కి పట్టుకుంటున్న సందేహం. ఎందుకంటే ప్రసాదరావు పోటీ చేస్తారో లేదో కూడా ఎవరికీ అర్థం కావడం లేదని అంటున్నారు.
అపుడే చెప్పేసిన పెద్దాయన :
ఇక ప్రసాదరావు అయితే 2024 ఎన్నికల్లోనే పోటీ చేయను అని చెప్పేశారు. తన కుమారుడు రాం మనోహర్ నాయుడుకు టికెట్ ని ఆయన కోరుకున్నారు. కానీ అధినేత జగన్ మాత్రం ఆయననే పోటీ చేయమని కోరడంతో తప్పనిసరిగా పోటీ చేశారు. ఇక 2029 ఎన్నికల నాటికి ఏడు పదులు పైబడే వయసుకు చేరుకుంటున్న ప్రసాదరావు పోటీ చేయరని అంటున్నారు. అయితే శ్రీకాకుళం అసెంబ్లీ సీటులో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే గోండు శంకర్ దూసుకుని పోతున్నాడు. యువకుడిగా ఉన్న ఆయనకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మద్దతు దండీగా ఉంది. అలాగే నారా లోకేష్ ప్రోత్సాహం ఉంది. అయితే ఆయనకు మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వర్గం మద్దతు దక్కడం లేదు. ఆ వర్గ పోరు అలాగే ఉంది. దానితో పాటు స్థానికంగా కొన్ని హామీలను నెరవేర్చలేదని జనంలో అసంతృప్తి ఉంది.
ఆయన దిగితేనే మరి :
ఈ నేపధ్యంలో 2029 ఎన్నికలు టీడీపీకి కూడా కొంత టఫ్ గా ఉంటాయని అంటున్నారు. ధర్మాన ప్రసాదరావు పోటీకి దిగితే గట్టి పోటీ జరుగుతుందని అంటున్నారు. దాంతో ఎవరు గెలుస్తారు అన్నది ఒక సస్పెన్స్ గా కూడా మారే చాన్స్ ఉంది. అదే ప్రసాదరావు వారసుడు బరిలోకి దిగితే మాత్రం అంత గట్టి పోటీ ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ప్రసాదరావుకు ఉన్న పట్టు అలాంటిది అని చెబుతున్నారు. అయితే కుమారుడినే పోటీకి దించాలని ప్రసాదరావు అనుకుంటే ఇప్పటి నుంచే తగిన వ్యూహాలతో రంగంలోకి దిగాలని అంటున్నారు. క్యాడర్ లో కానీ జనంలో కానీ డైలమా లేకుండా ఒక స్పష్టతతో వ్యవహరిస్తేనే ఇక్కడ వైసీపీకి మంచి రోజులు వస్తాయని అంటున్నారు. మరి పెద్దాయన ఈ విషయంలో ఏ వ్యూహంతో ఉన్నారో చూడాల్సి ఉందని అంటున్నారు.